Sneha TV
వ్యాసం

మన చేనేత..మన సంప్రదాయం..మన బాధ్యత..!


* నేతన్న..గుండె కోత..

* కరోనాతో ఉపాధి కోల్పోయిన కార్మికులు

* పనులులేక పస్తులుంటున్న వైనం

* సాయంకోసం ఎదురుచూపులు

* స్వరాష్ట్రంలో 325 మంది ఆత్మహత్యలు

* చేనేత బంధు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్

చేనేత రంగం చిన్నబోయింది. మగ్గం మూలకుపడింది. నేతన్నల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఇక్కడి చేనేత కార్మికుల చేతుల్లో రూపుదిద్ధుకుంటున్న దర్రీస్కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్నా, గ్లోబల్ ఐడెంటిటీ సైతం కలిగిఉన్నా, చేనేత కార్మికులకు జియో ట్యాగింగ్ వేసినా వారి కడుపులు నిండే దారి చూపించేవారే కరువయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,632 చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ ఉంది. దీంతో ఒకటి కాదు.. రెండు కాదు.. స్వరాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 325 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిమీద ఆధారపడేవారు నేడు అడ్డా కూలీలుగా, హోటల్లలో కార్మికులుగా, ఆటో డ్రైవర్లుగా, సెక్యూరిటీ గార్డులుగా జీవనం సాగిస్తున్నారు. ఒకప్పుడు వరంగల్ పట్టణంలో 26 ప్రాథమిక చేనేత సహకార సంఘాల ద్వారా సుమారు రెండు వేలకుపైగా మగ్గాలు పనిచేస్తే.. నేడు అది రెండు అంకెలకు పడిపోయింది. ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించినా చిత్తశుద్ధిలేని పాలకులతో చేనేత రంగం కుదేలవుతోంది.

నగరంలో 26 సొసైటీలు..

వరంగల్ మహా నగరంలో 26 చేనేత ప్రాథమిక సహకార సంఘాలుండగా ఇందులో మూడు కరీమాబాద్ ప్రాంతంలో, ఒకటి మాత్రం మండి బజార్లో ఉంది. మిగిలిన 22 సహకార సంఘాలు కొత్తవాడలోనే ఉన్నాయంటే ఇక్కడ ఎంతమంది కార్మికులు చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారో అర్థమవుతుంది. ఒక్కో సొసైటీలో సుమారు వందమంది చేనేత కార్మికులు సభ్యులుగా ఉన్నారు. వీరంతా తెలంగాణ ప్రభుత్వంలోని టెస్కోలో భాగస్వాములుగా ఉన్నారు. ఈ లెక్కన ఐదువేల మంది ప్రత్యక్షంగా చేనేతపై ఆధారపడగా పరోక్షంగా మరో ఐదు వేల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరే కాకుండా 28 మాక్స్ సొసైటీలున్నాయి. ఒక్కో సొసైటీలో పది మంది చొప్పున సభ్యులున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేనేత రంగంపై ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా సుమారు 40నుంచి 50వేల మందికి ఉపాధి లభిస్తుంది.

నూలు సబ్సిడీ ఏమాయే..

చేనేత కార్మికులకు అండగా నిలువాలన్న లక్ష్యంతో మంత్రి కేటీఆర్ నాలుగేళ్లక్రితం వరంగల్ వచ్చిన సందర్భంగా ఇక్కడినుంచే నూలు సబ్సిడీ పథకాన్ని ప్రకటించారు. దీని ద్వారా నూలు కొనుగోలు చేసిన వారికి 40 శాతం సబ్సిడీ ఇస్తామంటూ ప్రకటించారు. అదికూడా కార్వే అనే సంస్థకు బిల్లులు ఆన్లైన్ చేస్తేనే సబ్సిడీ వర్తిస్తుందని తిరకాసు పెట్టడంతో ఈ పథకంలో ఇప్పటివరకు ఒక్కరు కూడా సభ్యులుగా చేరలేదు. చేనేత కార్మికులు తమకు అనుకూలంగా, తక్కువ ధరకు లభించే ప్రాంతంనుంచి కొనుగోలు చేసిన బిల్లులను ప్రభుత్వం ఆమోదించడం లేదు. దీనిని పూర్తిగా మార్పులు చేసి చేనేత కార్మికులు ఎక్కడ కొనుగోలు చేసినా ఆ బిల్లులకు సబ్సిడీ చెల్లించాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.

చేనేతకు చేయూత పథకం..

చేనేత కార్మికులను ఆదుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూత పథకానికి 2017 జూన్ 24న శ్రీకారం చుట్టింది. దీని వ్యవధి కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే. కార్మికులు ప్రతి నెల తమ సంపాదనలో ఎనిమిది శాతాన్ని జమచేస్తే ప్రభుత్వం దానికి రెండు రెట్లు అంటే 16శాతం ప్రభుత్వం జమ చేస్తుంది. దీనికోసం ప్రభుత్వం రూ.30వేల కోట్లను మంజూరు చేసింది. అయితే ఈ మూల ధనాన్ని మూడు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాతనే తిరిగి పొందే అవకాశం ఉంటుంది. మధ్యలో తీసుకునే వెసులుబాటు లేదు. చేనేతకు అనుబంధంగా పని చేస్తున్న డెయ్యర్, డిజైనర్, వీవర్లు, వైండర్లు, ఇతర చేనేత పనివారు సైతం ఈ పథకలో చేరేందుకు వెసులుబాటు కల్పించారు.

ఆర్థికంగా నిలదొక్కకున్న వారికే ప్రయోజనం..

ఇది ఆర్థికంగా కొంత నిలదొక్కుకున్న వారికి ఉపయోగ పడుతుంది. కానీ, రెక్కాడితే కాని డొక్కాడని, ప్రస్తుత చేనేత కార్మికుడికి పెద్దగా ప్రయోజనం ఉండదని కార్మికులు ఆరోపిస్తున్నారు. అసలు చేసేందుకే పనులు లేవు. వీరు నెలంతా కష్టపడినా వచ్చేది ఇంటి అవసరాలకు కూడా సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితిలో చేనేత కార్మికులు వారి సంపాదనలో ఎనిమిది శాతం జమచేయడం ఎలా సాధ్యమవుతుందని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. తినేందుకు తిండిలేక పస్తులుంటుంటే ప్రభుత్వం మాత్రం నెలవారి సంపాదనలో కొంత జమచేయమనడం ఎంతవరకు సమంజసం అంటున్నారు.

స్వరాష్ట్రంలో 325మంది ఆత్మహత్యలు..

స్వరాష్ట్రం సాధించాక 325మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రతి పక్ష సభ్యులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ ఆకలి బాధలు, దారిద్య్రం వారిని వెన్నాడుతోందంటున్నారు. చేనేత మిత్ర ద్వారా కనీసం రూ.11కోట్లు కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేదని విమర్శిస్తున్నారు.టెక్స్టైల్ పార్కు కోసం భూసేకరణ పూర్తయినా పనుల్లో మాత్రం పురోగతి కనిపించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరు నెలలకోసారి వంద కోట్ పెట్టుబడి పెట్టేందుకు వారు ముందుకు వచ్చారు. వెయ్యి కోట్లు పెట్టేందుకు వీరు ముందుకు వచ్చారు. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారంటూ ప్రకటనలు వస్తున్నాయి తప్ప, అక్కడ ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ ఏర్పాటైన దాఖలాలే లేవంటూ ఆరోపిస్తున్నారు.

చేనేత బంధు వర్తింపజేయాలి.

భూమి ఉన్న ప్రతి రైతుకు రైతు బంధు వర్తింపజేసినట్లు చేనేత కార్మికుడి కార్డు కలిగి ఉండి జియో టాగింగ్ పొందిన ప్రతి కార్మికుడికి చేనేత బంధు వర్తింపజేయాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతి నెలా చేనేత కార్మికుడి ఖాతాలో కనీసం రూ.5 వేలు జమ చేయాలి. ఇప్పుడు కార్మికుల చేతిలో చిల్లిగవ్వ లేదు. చేసేందుకు పని లేదు. ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం విడుదల చేసిన రూ.30కోట్లను నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాలో జమచేసి ఆదుకోవాలి.

Next Story
Share it