Top
Sneha TV

శివుని స్వరూపాలు - కాలసంహార స్వరూపం

X

మృత్యుదేవతగా పేరు పొందిన యమునుకి మరో పేరు కాలుడు. యమునిపై తీవ్రంగా దెబ్బతీసిన కారణంగా శివునికి కాల సంహార మూర్తిగా పేరువచ్చింది. దీనికి సంబంఛించిన గాథ ఇలా ఉన్నది.

కౌశిక మహా ముని కొడుకు మృకండుడు. మృకండుడు అతని భార్య మరుద్మతి శివుని ప్రార్థించి తమకు ఒక కొడుకును ప్రసాదించమని వేడుకొంటారు. ఫలితంగా శివుడు వారి ప్రార్థనను మన్నించి తక్కువ ఆయు:ప్రమాణం కలిగి ఎక్కువ బుద్ధి కలిగిన కొడుకు కావాలా లేక మందబుద్ధియై ఎక్కువ ఆయుస్సు కలిగిన కొడుకు కావాలా అని ప్రశ్నించాడు. మృకండుడు తక్కువ ఆయుస్సు, ఎక్కువ బుద్ధి కలిగిన కొడుకును కోరుకొంటాడు. శివుని దయతో ఆ దంపతులకు అత్యుత్తముడై 16 సంవత్సరాల ఆయు:ప్రమాణం గల మార్కండేయుడు జన్మిస్తాడు. దైవ వశమున మార్కండేయుడు 16 సంవత్సరాల తర్వాత మరణించ వలసి ఉన్నది.

మార్కండేయుడు బాల్యం నుండి శివభక్తుడు. అతనికి 16 సంవత్సరాలు నిండాయి. మార్కండేయుడు శివపూజ కొనసాగిస్తుండగా అతని ప్రాణాన్ని తీసుకొనేందుకై యముడు వస్తాడు. గుడిలో శివపూజ చేస్తున్న మార్కండేయుడు భయంతో శివలింగాన్ని గట్టిగా పట్టుకొంటాడు. యముడు తన పాశాన్ని మార్కండేయుడిపై విసిరి గట్టిగా లాగుతాడు. ఆ పాశం లింగాన్ని కూడా చుట్టుకొంటుంది. యముడు పాశాన్ని లాగగానే లింగం నుండి శివుడు ఉద్భవించి, కోపంతో కాలితో యముడిని లాగి తన్నాడు. దానితో యముడు నేలపై కుప్పకూలిపోతాడు. అతడు దాదాపుగా ప్రాణభయానికి గురవుతాడు. యముని సంహరించడానికి పూనిన కారణంగా శివుడు కాల సంహార స్వరూపుడుగా పేరుపొందాడు.

శివుని అభయం పొందిన మార్కండేయుడు చిరంజీవి కావడమే కాకుండా ఎప్పుడూ 16 సంవత్సరాల యువకుడిగా కనిపించే విధంగా వరం పొందాడు. తమిళనాడులోని తిరుకడైయూరులో వెలసిన అభిరామి అంబ, అమృత కాటేశ్వర ఆలయంలో మార్కండేయుని ఉదంతం జరిగినట్లు ఐతిహ్యం.

Next Story
Share it