సహస్ర లింగేశ్వర స్వామి ఆలయం పొన్నూరు, గుంటూరు జిల్లా
గుంటూరు సమీపంలోని పొన్నూరులో వెలసిన సహస్ర లింగేశ్వర స్వామి ఆలయం మరో ఐదు దేవతలకు నిలయం కావడం ఆలయ విశిష్టత. ఇక్కడ ప్రధాన దైవమైన సహస్ర లింగేశ్వర స్వామితో పాటుగా శ్రీవీరాంజనేయ స్వామి, శ్రీగరుక్మంత స్వామి, శ్రీదశావతారాల స్వామి, శ్రీకాలభైరవ స్వామి మరియు శ్రీస్వర్ణ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఆలయంలో శ్రీపార్వతీ దేవి, శ్రీషణ్ముఖ స్వామి పూజలందుకొంటున్నారు.
శ్రీసహస్ర లింగేశ్వర స్వామి ఆలయానికి సంబంఛించి ఏలాంటి పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యాలు లభ్యం కావడం లేదు. దీనికి కారణం ఆలయం ఇటీవల అంటే క్రిందటి శతాబ్దం పూర్వార్ధంలో నిర్మించబడింది.
శ్రీసహస్ర లింగేశ్వర స్వామికి, శ్రీకాలభైరవ స్వామికి శైవ ఆగమ సంప్రదాయంతో, మిగతా దేవుళ్లకు వైఖాసన ఆగమ సంప్రదాయంతో పూజలు నిర్వహిస్తారు. ఆలయంలో శివుని పాదాల చెంత ఐదు లింగాలు స్థాపించబడినాయి. అవి వెర్వేరు పరిమాణాలలో ఉన్నాయి. ఇక్కడ వెలసిన శ్రీవీరాంజనేయ స్వామి 24 అడుగుల ఎత్తు విగ్రహం రూపంలో దర్శనమిస్తున్నాడు. అదేవిధంగా శ్రీగరుక్మంతస్వామి విగ్రహం 30 అడుగుల ఎత్తు కలిగి ఉన్నది.
శ్రీసహస్ర లింగేశ్వర స్వామిభక్తుడైన కోట జగన్నాథ స్వామి ఈ ఆలయాలను నిర్మించాడు.