Top
Sneha TV

కపాలీశ్వర స్వామి ఆలయం, చెన్నయ్

X

చెన్నయ్ లోని మైలాపూరు ప్రాంతంలో వెలసిన శ్రీ కపాలీశ్వర స్వామి ఆలయం సుమారు 1500 సంవత్సరాల నాటిదని వివరాలు వెల్లడిస్తున్నాయి. 120 అడుగుల ఎత్తు గల రాజగోపురంతో ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. సముద్రతీరం సమీపంలో వెలసిన ఈ ఆలయం పురాణేతిహాసాలలో ప్రస్తావింపబడింది. పురాణాల వివరాల ప్రకారం దేవత శక్తి నెమిలి రూపంలో శివుని పూజించింది. మయిలై అంటే తమిళంలో నెమిలి. దీనితో ఈ ప్రాంతం మయిలాపురం, మైలాపూర్ పేర్లతో ప్రాచుర్యం సంతరించుకొన్నది. కపాలం తలకు మరో పేరు. బ్రహ్మపై కోపంతో శివుడు అతని తలను (కపాలాన్ని) తొలగించిన కారణంగా ఇక్కడి శివుడు కపాలీశ్వరుడుగా పేరు పొందాడు. శాపం కారణంగా నెమిలి రూపంలో ఉన్న పార్వతి కపాలీశ్వరుని పూజించిందని ఐతిహ్యం.

కైలాసాన్ని సందర్శించిన బ్రహ్మ శివుని పట్ల అవిధేయతతో వ్యవహరించిన కారణంగా శివుడు కోపగించి బ్రహ్మ తలలలో ఒకటిని నరికి వేశాడు. బ్రహ్మ మైలాపురానికి వచ్చి శివుని ప్రీత్యర్థం ఇక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేసి, శివుని పూజించి సృష్టికార్యం కొనసాగించే అర్హతను తిరిగి పొందినట్లు పురాణాల వల్ల తెలుస్తునది. ఆలయంలోని దేవి పార్వతి కర్పగాంబాళ్ పేరుతో పూజలు పొందుతున్నది. కుమారస్వామి ఇక్కడ తన దండాన్ని(బల్లెం) పొందినట్లు, బ్రహ్మ పాప నివారణార్థం ఇక్కడ తపస్సు చేసినట్లు, పార్వతి నెమిలి రూపంపోగొట్టుకోవడానికి కూడా ఇక్కడే తపస్సు చేసినట్లు, శ్రీరాముడు ఇక్కడి లింగాన్ని పూజించి రావణునిపై విజయం సాధించాడని, శుక్రాచార్యుడు పోగొట్టుకొన్న తన కన్నును ఇక్కడే పొందినట్లు ఐతిహ్యం దీనితో ఈ ప్రాంతాన్ని శుక్రపురి అని కూడా పిలిచేవారని వివరాలు చెబుతున్నాయి. ప్రముఖ తమిళ కవి తిరువళ్లువర్ (తిరుక్కురళ్ గ్రంథకర్త) ఇక్కడే జన్మించారని ప్రతీతి.

భక్తులు ఆలయ సందర్శనకై నిర్ణయించిన వేళలు: ఉ 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మళ్లీ సా.4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. ఆలయానికి సోమవారం సెలవు దినం. ఇక్కడ బ్రహ్మోత్సవం ,తెప్పోత్సవం, నవరాత్రి ఉత్సవం, వసంతోత్సవం వైభవంగా జరుగుతాయి.

ఆలయంలో రోజూ ఆరు మార్లు పూజలు జరుగుతాయి. ఉ.6 గంటలకు, 9 గంటలకు, మ.1 గంటకు, సా.5 గంటలకు, 7 గంటలకు, రాత్రి 9 గంటలకు పూజలు నిర్వహిస్తారు. ఉ.11.30 గంటలకు, సా.5.30 గంతలకు రాహు అభిషేకం పేరుతో ప్రత్యేక పూజ జరుగుతుంది.

Next Story
Share it