Top
Sneha TV

దువ్వాడ జగన్నాథం - డబ్బు పిచ్చి

X

నేను గత ఆదివారం వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లాను. ఆదివారం కావడం వల్ల ఆలయం లో భక్తులు ముగ్గురు నలుగురే ఉన్నారు. భక్తులు లేరు కాబట్టి, పూజారి కూడా ఆ బాధ్యతని తన కొడుకు(17,18 ఏళ్ళు ఉంటాయి) కి అప్పచెప్పి ఎక్కడికో వెళ్ళారు. ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణంలో నేను శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవడం మొదలుపెట్టాను. కాసేపటికే, ఆ పూజారి గారి అబ్బాయి ఫోన్ లో తన ఫ్రెండ్ తో మాట్లాడటం మొదలుపెట్టాడు. అది వాట్సప్ వీడియో కాల్ అనుకుంటా, తను గట్టిగా మాట్లాడుతున్నాడు. తన మాటల సారాంశం ఏంటంటే.. తాను దువ్వాడ జగన్నాథం సినిమా లో నటించాడట, ఏడు రోజుల షూటింగ్, రోజుకి రెండు వేల చొప్పున ఏడు రోజులకి 14 వేల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారట. "ఎన్ని పూజలు వ్రతాలు చేయిస్తే 14 వేలు వస్తాయి, అందుకే షూటింగ్ లే బెటర్, ఏమైనా షూటింగ్ లు ఉంటె చెప్పు నేను వస్తాను" అని చెబుతున్నాడు. దేవుడి విగ్రహం ముందు కూర్చుని ఆ కుర్రాడు, ఈ పూజలకన్నా షూటింగ్ లు బెటర్ అని అంటున్నాడు, ఆ కుర్రాడు, ఓ పెద్ద స్వామీజీ నడిపే వేదపాఠశాల లో వేదం చదువుకుంటున్నాడు. దీని అర్థం ఏమిటి? ఈ కుర్రాడి మాటల వెనుక ఒక చేదు నిజం ఉంది. సమాజంలో డబ్బు కోసం పెరిగిన వెంపర్లాట కి ఈ కుర్రాడి మాటలు నిదర్శనం. డబ్బు కోసం కష్టపడటం లో తప్పేమీ లేదు, కాకపోతే, ఈజీగా డబ్బు సంపాదించాలనే దురాశే ఆందోళనకరం. ఆ కుర్రాడు తానూ చదివే వేదమే జాగ్రత్తగా నేర్చుకుని, పూజలు వ్రతాలు చేయించడంలో పేరు తెచ్చుకుంటే రోజుకి 10 వేలు కూడా సంపాదించవచ్చు. ఆ కుర్రాడు అది ఆలోచించడం లేదు, ఈజీగా డబ్బు సంపాదించాలని ఆశపడుతున్నాడు.

మేము, మా అపార్ట్ మెంట్ టెర్రస్ ను వాటర్ ప్రూఫింగ్ చేయిస్తున్నాము. ఈ నెల 14 లోపు పని పూర్తి చేయాలని ఈ నెల 8 న ఒకరికి కాంట్రాక్ట్ ఇచ్చాము. ఇక అక్కడినుంచి మా కష్టాలు మొదలయ్యాయి. 22 తేదీకి కూడా పని పూర్తికాలేదు. చేసిన పని కూడా సక్రమంగా చేయలేదు. పది రోజులుగా ప్రతిరోజూ నేను హాఫ్ డే ఈ పనికోసం కేటాయించాల్సి వచ్చింది. కారణమేంటంటే..కాంట్రాక్టర్ పనిలో పెట్టిన కుర్రాళ్ళకి పని రాదు,, వాళ్ళు మూడు రోజుల్లో చేయాల్సిన పని వారం చేసారు. ఆ తర్వాత తాపీ మేస్త్రీల వంతు, ఒక్కొక మేస్త్రీకి పదేళ్ళ అనుభవం ఉంది, వాళ్ళు అడిగినంత మెటీరియల్ ఇచ్చాము, అయినా టెర్రస్ మీద స్లోప్ కరెక్ట్ గా పెట్టడం వాళ్లకి చేతకాలేదు. అంటే, ఒక చిన్న పని చేయించాలన్నా నైపుణ్యం ఉన్న పనివాళ్ళు దొరకడం లేదు. సరిగ్గా పనివచ్చిన తాపీ మేస్త్రికి రోజుకి 800 దాకా అంటే నెలకి 20 వేల పైనే సంపాదించుకునే వీలు ఉంది. అయినా పనిని శ్రద్ధగా నేర్చుకుందాం, పనిలో నైపుణ్యం పెంచుకుందాం, మంచిపేరు తెచ్చుకుందాం, ఎదుగుదాం అనే ఆలోచనే జనాల్లో తగ్గిపోతోంది. ఎంతసేపటికీ ఈజీమనీ కోసం వెంపర్లాడటమే.

ఇలా సమాజంలో ఈజీమనీ కోసం వెంపర్లాట పెరగడానికి మూల కారణం అవినీతి పెరగడం. రాజకీయనాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, కార్పొరేట్లు ఈ నలుగురూ అక్రమంగా, దర్జాగా దేశసంపదని దోచుకుతింటుంటే, అలాంటి అవినీతి నాయకులే మళ్ళీ నీతి సూత్రాలు చెబుతుంటే.. అక్రమార్కుల ఇళ్ళలో పెళ్ళిళ్ళు, చావులు, వాళ్ళ ట్వీట్లు, వాళ్ళ ఎఫైర్లే మీడియా లో ప్రధానవార్తలు అయిపోతుంటే.. స్వామీజీల దగ్గర నుంచి సినిమా వాళ్ళ దాకా అందరూ, ఈ అక్రమార్జనపరులకే జైకొడుతూ ఉంటే.. కష్టపడాలని, సంపాదించాలని యువత ఎందుకు అనుకుంటుంది? మనమూ ఏదో ఒక కాంట్రాక్ట్ చేద్దాం, కమీషన్ కొట్టేద్దాం, పైరవీలు చేసేద్దాం, ఎలాగోలా డబ్బు సంపాదిద్దాం అనే ఆలోచన యువతలో పెరగడం సహజం. అందుకే మన సమాజంలో మెజారిటీ ప్రజలకి తాము చేసే పనిమీద శ్రద్ధ లేదు, నైపుణ్యం పెంచుకుందామనే ధ్యాసలేదు. మనదేశంలో ఒకపక్క ఉద్యోగాలు కోసం యువత ఎదురుచూస్తుంటే..మరోపక్క 'నిజంగా పనిచేసేవాళ్ళ' కోసం పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఎదురుచూస్తున్నారు. మనదేశం బాగుపడాలి అంటే.. అక్రమార్జనపరులకి శిక్షలు పడాలి, డబ్బు సంపాదించేందుకు సక్రమమార్గాలు పెరగాలి.

Next Story
Share it