Top
Sneha TV

భైరవగీత సినిమా రివ్యూ

X

టైటిల్ : భైరవగీత
నటీనటులు : ధనుంజయ, ఇర్రా మోర్‌, రాజా బల్వాడీ తదితరులు
సంగీతం : రవిశంకర్‌
సినిమాటోగ్రఫీ : జగదీశ్‌ చీకటి
కథ, స్క్రీన్‌ప్లే : రామ్‌ వంశీకృష్ణ
నిర్మాత: రామ్‌గోపాల్‌ వర్మ, భాస్కర్‌ రాశి
డైరెక్టర్: సిద్ధార్థ తాతోలు


సంచలన, వివాదాస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు సిద్దార్థ తాతోలు తెరకెక్కించిన సినిమా 'భైరవగీత'. ధనంజయ, ఇర్రా మోర్ హీరో హీరోయిన్లుగా ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ వచ్చింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేతో పాటు నిర్మాణ బాధ్యతల్ని తీసుకున్న వర్మ.. పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు తెలుగులో శుక్రవారం (డిసెంబర్ 14) విడుదల చేశారు. 'భైరవగీత' సినిమా ఎలా ఉంది? రెస్పాన్స్ ఏంటి? కొత్త దర్శకుడితో వర్మ చేసిన ప్రయోగం ఎంత వరకూ వర్కౌట్ అయ్యింది? తదితర అంశాలు రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:
రాయలసీమకు చెందిన భైరవ (ధనుంజయ) కుటుంబం తరతరాలుగా అగ్రవర్ణానికి చెందిన సుబ్బారెడ్డి (బాలరాజ్‌వాడీ) దగ్గర బానిసలుగా పనిచేస్తుంటారు. ఫ్యాక్షన్ గొడవల్లో సుబ్బారెడ్డిని కాపాడటం కోసం భైరవ తండ్రి మరణిస్తాడు. అప్పటి నుండి తండ్రి వారసత్వంగా వచ్చిన బానిస బతుకుతోటే సుబ్బారెడ్డి ప్రాణాలను కాపాడటం కోసం కత్తి పట్టి నిలబడతాడు భైరవ. అదే ఊరిలో సుబ్బారెడ్డికి కేశవరెడ్డి (భాస్కర్ మన్యం)తో ఫ్యాక్షన్ గొడవలు జరుగుతుంటాయి. తనకు ప్రత్యర్థిగా ఉన్న కేశవరెడ్డితో వియ్యం అందుకుంటే తనకు ఊరిలో ఎదురే ఉండదని పట్నంలో చదువుకుంటున్న తన కూతురు గీత (ఇర్రా మోర్)ని కేశవరెడ్డి కొడుకు కట్టారెడ్డి (విజయ్)కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు సుబ్బారెడ్డి. ఈ పెళ్లి గీతకు ఇష్టం లేకపోయినా బలవంతంగా కట్టారెడ్డితో నిశ్చితార్ధం జరిపిస్తారు సుబ్బారెడ్డి. అంతకు ముందు శత్రువుల దాడి నుండి తన ప్రాణాలను కాపాడిన భైరవని ఇష్ట పడుతుంది గీత. భైరవకి కూడా గీత అంటే ఇష్టమైనప్పటికీ కులం అడ్డుగోడలు అతని ప్రేమకు అడ్డుగా నిలుస్తాయి.

క్రూరుడైన కట్టారెడ్డిని పెళ్లి చేసుకోవడం కంటే తన ప్రాణాలను కాపాడిన భైరవతో జీవితం పంచుకోవాలని అనూహ్య నిర్ణయం తీసుకుంటుంది గీత. అయితే గీత.. భైరవని ఇష్టపడుతుందని తెలుసుకున్న సుబ్బారెడ్డి విశ్వాసంగా పనిచేస్తున్న భైరవని చంపాలని ప్లాన్ చేస్తారు. ఈ విషయాన్ని భైరవతో చెప్పే ప్రయత్నంలో గీత తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. అనంతరం అనుకోని పరిస్థితుల్లో ఆ ఊరి నుండి పారిపోతారు 'భైరవగీత' జంట. అలా పారిపోయిన వారు వెనక్కి ఎందుకు వచ్చారు? తరతరాలుగా ఉన్న బానిస సంకెళ్లను భైరవ ఎలా సమాధి చేశాడు? దొరల అరాచకాలను ఎలా తిప్పికొట్టాడు? గీత ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఓ గొప్పింటి అమ్మాయి. ఓ పేదింటి అబ్బాయి.. ఇద్దరి మధ్యన ప్రేమకథ.. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న పెద్దోళ్లు వారి ప్రేమకు అడ్డు చెప్పడం.. పేదింటి అబ్బాయి కుటుంబాన్ని నాశనం చేయడం.. ఇలాంటి ఫ్యాక్షన్ ప్రేమకథలు తెలుగులో ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే వర్మ శిష్యుడు సిద్దార్థ్ తాతోలు మళ్లీ ఇదే తరహా ప్రేమకథకు కొత్తరకం ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఓ యువ దర్శకుడు ఈ తరహా ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కథను డీల్ చేశాడంటే కొత్త కుర్రాడిలో చాలా విషయం ఉన్నట్టే. అది తొలి చిత్రంతోటే నిరూపించుకున్నాడు సిద్దార్థ్.

ముఖ్యంగా ఫస్టాఫ్ మొత్తం ఒక్కో పాత్రను పరిచయం చేసుకుంటూ ఎక్కడా బోర్ కొట్టకుండా మెల్లగా కథలోకి తీసుకువెళ్లి.. సెకండాఫ్‌ మొత్తం బానిస బతుకుల విముక్తి కోసం హీరో చేసిన తిరుగుబాటుని ఆసక్తికరంగా తెరకెక్కించారు. చాలా రోజుల తరువాత వర్మ తన బుర్రకు పదును పట్టి తన మార్క్ ప్రేమకథకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఇచ్చారు. దీన్ని స్క్రీన్‌పై ప్రజెంట్ చేయడంతో ఒకప్పటి గురువుని మించిన శిష్యుడు అనిపించుకున్నాడు కొత్త దర్శకుడు సిద్దార్థ్.

భయంకరమైన హింస.. రక్తపాతం.. ఒళ్లుగగుర్పొడిచే భయానక సన్నివేశాలు.. రొమాన్స్.. లవ్.. లిప్ లాక్.. సెంటిమెంట్.. ఇలా వర్మ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా.. ఇంకా చెప్పాలంటే వర్మ కంటే ఎక్కువగానే హింసను ప్రేరేపిస్తూ.. రక్తాన్ని ఏరులై పారించాడు సిద్దార్థ్ తాతోలు. అయితే అక్కడక్కడా హింస ఎక్కువగా అనిపించినప్పటికీ కథకు అవి అవసరం అనే అనిపిస్తాయి. ముఖ్యంగా ప్రతినాయకుడు కట్టారెడ్డిని క్రూరంగా చూపించే సన్నివేశం జుగుప్సాకరంగా ఉంటుంది.

కంటెంట్ ఉన్న కథను స్క్రీన్‌పై పర్ఫెక్ట్‌గా ప్రజెంట్ చేయాలంటే పాత్రలకు జీవం పోసే నటీనటులు దొరకాలి. అప్పుడే ఈ కథ పండుతుంది. 'భైరవగీత' సినిమాలో హీరో హీరోయిన్లుగా చేసిన ధనుంజయ, ఇర్రా మోర్‌లు పరిణితి ఉన్న నటనతో చక్కగా మెప్పించారు. ముఖ్యంగా భైరవ పాత్రలో ధనుంజయ ఒదిగిపోయాడు. ఇక వర్మ హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన ఇర్రా మోర్‌కి 'భైరవగీత' చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. ఈ కథ మొత్తం ఆమె చుట్టూనే అల్లారు. గీత పాత్రలో పరిణితి ఉన్న నటనతో ఆకట్టుకుంది. వర్మ సినిమాల్లో చాలా వరకూ హీరోయిన్ పాత్ర కేవలం గ్లామర్‌కి మాత్రమే పరిమితం చేస్తారనే పేరును ఆయన శిష్యుడు తుడిచేశారు. 'భైరవగీత'లో ఆమెకోసం బలమైన సీన్లను రాశాడు వర్మ. గ్లామర్ పరంగానూ కనువిందు చేసింది. ఇక ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర ప్రతినాయకుడిగా నటించిన కొత్త నటుడు కట్టారెడ్డి (విజయ్). ఆరున్నర అడుగులు.. భారీ శరీరంతో ఉన్న విజయ్ విలన్‌గా బయపెట్టేశాడు. దర్శకులకు తెలుగులో మరో ప్రతినాయకుడు దొరికినట్టే. మిగిలిన తారాగణం తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా ప్రతి పాత్రను పర్ఫెక్ట్‌గా పండించగలిగారు. టెక్నికల్ పరంగా.. ఈ సినిమాకు రవిశంకర్ మంచి సంగీతాన్ని అందించారు. ఇక నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్. ఛేజింగ్, యాక్షన్, ఎమోషన్స్, పోరాట సన్నివేశాల్లో సందర్భాను సారంగా అదిరిపోయే మ్యూజిక్ అందించారు.

'భైరవగీత'కు బలాన్నిచ్చే మాటలు రాశారు రామ్ వంశీ క్రిష్ణ. ఆయన రాసిన ప్రతి డైలాగ్‌కి థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రాయలసీమ ఫ్యాక్షన్‌ను విజువల్‌గా ప్రతి ఫ్రేమ్‌లోనూ ఎంతో చక్కగా చూపించగలిగారు సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటి. అన్వర్ అలీ ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. కథను సాగదీయకుండా.. 2.09 నిమిషాల నిడివితో చక్కగా ఎడిట్ చేశారు. నిర్మాతలు అభిషేక్ నామా, భాస్కర్ రాశి నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగానే ఉన్నాయి. ఓవరాల్‌గా 'భైరవగీత' రొటీన్ స్టోరీ అన్న ముద్రను పక్కన పెట్టేస్తే.. ఓ కొత్త దర్శకుడు.. కొత్త నటీనటులతో చేసిన కొత్త ప్రయోగం మెజారిటీ ఆడియన్స్‌కి ఆమోదయోగ్యంగానే ఉంటుంది.

రేటింగ్ : 2/5

Next Story
Share it