Top
Sneha TV

రానాతోనే ఆ స్థాయి...

X

- 'ఘాజీ' దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి
దర్శకునిగా తొలి చిత్రాన్ని ప్రేమకథతో కాకుండా యుద్ధ నేపథ్యంలో సాగే కథతో ముందుకొచ్చారు సంకల్ప్‌ రెడ్డి. ఈ సినిమాకు ప్రముఖులు తోడుకావడంతో జాతీయ స్థాయి చిత్రంగా మారింది. ఆ సినిమాయే 'ఘాజీ'. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఇందులో రానా నేవీ ఆఫీసర్‌గా చేశారు. ఈ సినిమా ఈనెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం సంకల్ప్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడారు.

మీ నైపథ్యం?
పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. ఇక్కడ నా చదువు పూర్తవగానే ఫైన్‌ ఆర్ట్స్‌లో ఎంఎస్‌ చేయడానికి యూఎస్‌ వెళ్ళాను.

అది అయిపోగానే సినిమాల్లోకి రావాలని ఇలా వచ్చాను.
'ఘాజీ' సినిమా చేయాలని ఆలోచన ఎలా వచ్చింది ?
నేను అన్నవరం వెళ్ళినప్పుడు తిరుగు ప్రయాణంలో రైలు ఆలస్యం కావడంతో వైజాగ్‌ మీదుగా వెళ్ళాలని అటు వచ్చాను. అక్కడ ఈ సబ్‌ మెరైన్‌ను చూశాను. అప్పుడే దీని మీద, ఇండియన్‌ నేవీ మీద సినిమా తీద్దామని నిర్ణయించుకుని పరిశోధన మొదలుపెట్టి పూర్తి స్క్రిప్ట్‌ రాసుకున్నాను. కోటి రూపాయలతో సినిమా తీద్దామని మొదట నా సొంత డబ్బు రూ.25 లక్షలు పెట్టి పని స్టార్ట్‌ చేశాను. సెట్‌ కూడా వేశాం. కానీ కుదరక పివిపి, మాట్నీ సంస్థ వారిని సంప్రదించాను.
ఈ సినిమా ఏం చెబుతుంది ?
'ఘాజీ' అనేది పాకిస్థాన్‌ జలాంతర్గామి. దీని గురించి చాలా కథలున్నాయి. వాటిలో ఒకటి ఇండియా కోణంలోనిదైతే ఇంకొకటి పాకిస్థాన్‌ కోణం లోనిది. నేను ఇండియా కోణంలోని కథను తీసుకున్నాను. దానికి కమర్షియల్‌గా కొంత కల్పితాన్ని జోడించాను.
రానాతోనే చేద్దామనుకున్నారా?
1971 కథ కాబట్టి వయసును దృష్టిలో పెట్టుకుని పెద్దవారితో ప్రయత్నాలు చేశాను. అనుకోకుండా మా కథ రానా వద్దకు వెళ్ళింది. ఆయన కథ గురించి విని ఇంట్రెస్ట్‌ చూపించారు. ఆయన రాకతో చిత్ర స్థాయి మారిపోయింది. హిందీలో మాత్రమే తీయాలనుకున్న సినిమా ఇప్పుడు హిందీతో పాటు తెలుగులో కూడా రిలీజవుతోంది. పివిపిగారి వలన తమిళంలో కూడా వస్తోంది.
రానా కోసం ఏమైనా మార్పులు చేశారా ?
ఏమీ చేయలేదు. రానా పాత్రకు 45 ఏళ్లు ఉంటాయి. కానీ రానా కోసం దాన్ని యంగ్‌గా చేశాం. అప్పటికే స్క్రిప్ట్‌, స్టోరీ బోర్డ్‌, సీజీ వర్క్‌ రెడీగా ఉండటంతో కేవలం 60 రోజుల్లో హిందీ, తెలుగు వెర్షన్ల షూట్‌ ముగించేశాం.
బాలీవుడ్‌ నుండి రెస్పాన్స్‌ ఎలా ఉంది?
సినిమాని కరణ్‌ జోహార్‌కు చూపించాం. చాలా సన్నివేశాలు ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ లేకుండా తీశాం. అది చూసిన అయన సినిమాని ప్రమోట్‌ చేయాలనుకున్నారు. 1971 నేవీకి చెందిన వ్యక్తులకు సినిమా స్పెషల్‌ షో వేశాం. వారంతా మెచ్చుకున్నారు.
ముందుముందు ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు ?
పూర్తిగా భిన్నంగా ఉండే సినిమాలు తీయాలనే అనుకుంటున్నాను. నాకు సాధారణ సినిమాలు నచ్చవు. ఇప్పటి దాకా ఇండియన్‌ స్క్రీన్‌ మీద రానటువంటి చిత్రాలు తీయాలని ఉంది.
తరువాత ఏ సినిమాలు చేయబోతున్నారు ?
ఇప్పటిదాకా ఏమీ అనుకోలేదు. ప్రస్తుతానికి 'ఘాజీ' రిలీజ్‌ కోసం చూస్తున్న. కొత్త దర్శకుడిగా నా సినిమా ఒకేసారి మూడు భాషల్లో రిలీజవడం గర్వంగా ఉంది. సినిమా అందరికీ నచ్చితుందనే అనుకుంటున్నాను.
మీరు ఖర్చుపెట్టిన రూ.25లక్షలు వచ్చేశాయా?
ట్యాంక్‌బండ్‌ కింద సెట్‌వేసి దాని ద్వారా యూట్యూబ్‌కు సినిమా తీయాలని ప్రయత్నించాను. దానికే రూ.25లక్షలు అయ్యాయి. మొత్తం కోటిలో పూర్తిచేయాలనుకున్నాను. కానీ ఈ సినిమాకు ప్రముఖులు గుణ్ణం గంగరాజు, బాలీవుడ్‌ నుంచి కొంతమంది, పీవీపీ వంటివారు తోడుకావడంతో సినిమాగా మారింది. నేను పెట్టిన రూ. 25లక్షలు వచ్చేశాయి.
ఈ కథ ఇన్నిమలుపు తిరుగుతుందనుకున్నారా?
నేను మొదట్లో ఈ కథను పట్టుకుని చాలామందిని ప్రయత్నించాను. ఆహార్యం రీత్యా ఎవ్వరూ స్పందించలేదు. ఇంగ్లీషు సినిమా కోసమే స్క్రిప్ట్‌ రాసుకున్నా. గుణ్ణంగంగరాజు గారు చూసి.. ఇది సినిమాగా తీద్దామని కొంత వెయిట్‌ చేయమన్నారు. అలా తెలుగులో అనుకున్న సినిమా హిందీ, తమిళంలో కూడా ముందుకు సాగం థ్రిల్‌ కల్గించింది.

Next Story
Share it