Sneha TV
న్యూస్

అధికారం

X

ఒక మనిషి గుణగణాలు తెలియాలంటే అతనికి ఒకసారి అధికారం ఇచ్చి చూస్తే చాలు అంటారు అబ్రహం లింకన్‌. అధికారం ద్వారా మనుషులకీ మంచీ చేయవచ్చు. స్వార్థానికీ ఉపయోగించుకోవచ్చు. పరుల మేలు కోసం అధికారాన్ని వినియోగించిన వారు చరిత్రలో అరుదు. జనం కోసం రాజకీయాల్లోకి వచ్చామని చెప్పినవారు అధికారాన్ని కైవసం చేసుకున్నాక మారిపోయిన ఉదంతాలు అనేకం. అధికారంలోకి రాకముందు, వచ్చాక వారి వ్యవహారసరళి భిన్నంగా ఉండటం వర్తమాన చరిత్రలో కనిపించే వాస్తవం.
రాజరికంలోనైనా, ప్రజాస్వామ్యం లోనైనా అధికారం చెలాయించే వారి స్వభావంలో పెద్దమార్పు లేకపోవడం గమనార్హం. ప్రత్యక్ష, పరోక్ష ప్రజాస్వామ్య వ్యవస్థల తీరుతెన్నులు గమనిస్తే అధికారం ఎంతటి వారినయినా ఎలా మార్చివేస్తుందో అర్థమవుతుంది. చిన్నస్థాయి నుంచి అతిపెద్ద స్థాయి దాకా అధికారం అనుభవించే వారిలో నమ్రత కన్నా అహంకారం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయాధికారాన్ని అప్పగిస్తారు. మేలయిన సమాజ నిర్మాణదిశగా విధివిధానాల రూపకల్పనకు అధికారాన్ని అందజేస్తారు. కాని జనం తీర్పును తమ వ్యక్తిగత విజయంగా భావించే ధోరణి ఎల్లెడలా కనిపించే దృశ్యం. అధికారాన్ని బాధ్యతగా కన్నా పెత్తనంగా భావించే ధోరణి దీనికి మూలం.
ఒకసారి అధికారంలోకి వచ్చాక ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న భావనతో అహం పెరుగుతుంది. అది అపరిమిత అధికారానికి దారి తీస్తుంది. తత్ఫలితంగా వ్యవస్థీకృత సూత్రాల్ని కూడా త్రోసిరాజని తామే సర్వాధికారులమని, స్వయంభువులమని, తమ మాటకు తిరుగులేదని భావిస్తారు. ఇది ప్రజాస్వామ్యానికీ, వ్యవస్థల మనుగడకీ మరింత ప్రమాదం. నిర్దేశిత చట్రాలని, చట్టాలని సైతం ఉల్లంఘించి అవినీతికి తలుపులు తెరుస్తారు. విచ్చలవిడితనం పెరిగి నియమ నిబంధనల్ని సైతం తమకు అనువుగా మార్చుకునే తంత్రాన్ని అనుసరిస్తారు. ఇది వ్యక్తులకీ, వ్యవస్థకీ శుభకరం కాదు.
రాజకీయాల్లోనే కాదు సమాజంలోని సకల సంబంధాల్లో అధికారం మనుషుల్ని వక్రమార్గం పట్టిస్తుంది. తమకు ఏ చిన్న అధికారం ఉన్నా దానిని ఎదుటివారి మీద చెలాయించాలని చూస్తారు. కుటుంబంలోనూ, సమాజంలోనూ, సంస్థల్లోనూ అధికారమనే భావన పెత్తనంగా రూపు దాల్చింది. ఈ క్రమాన మానవ సంబంధాల్లో అధికార సంబంధాల ప్రభావం అపారం. స్త్రీ పురుష సంబంధాల్లో, కుటుంబ సంబంధాల్లో 'అధికారం' ప్రభావం కీలకం. తండ్రి, అన్న, భర్త, కొడుకు పాత్రల్ని పోషించే మగవాడు అధికారాన్ని అనేక రూపాల్లో చెలాయిస్తాడు. ఆడవాళ్ళ జీవితాల్ని నిర్దేశిస్తాడు. అనురాగం, ప్రేమ, పాతివ్రత్యం పేరిట ఆమె ఆలోచనలకు సైతం సంకెళ్ళు వేసే ధూర్తత్వం మగవారు చెలాయించే అధికారంలో ఇమిడివుంది. దీన్ని ప్రతిఘటించే చైతన్యం సంతరించుకున్న మహిళలు పురుషాధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నారు. కనిపించని పొరల నడుమ దాగున్న అధికార సంబంధాల్లోని వికృతత్వాన్ని నిరసిస్తున్నారు.
నిచ్చెనమెట్ల కులవ్యవస్థ మాదిరిగానే అధికారవ్యవస్థ మనుషుల్ని విభజించి పాలిస్తుంది. ఒక మనిషి పట్ల చూపే ఆదరం, గౌరవం వారి చేతిలో ఉన్న అధికారాన్ని బట్టి నిర్థారితమవుతుంది. భయంతో కూడిన ఆరాధనని, భక్తిని మేళవించి ప్రదర్శించడం పాలనా యంత్రాంగంలోని దుర్గుణం. తన కిందివాళ్ళ ముందు ఠీవీగా, దర్పంగా తలెత్తుకుని కనిపించే మనిషి, తనకన్నా హెచ్చు అధికారం ఉన్న మనిషి ముందు వంగిపోతాడు. ఈ విధంగా అధికారాన్ని బట్టి మనుషుల దేహభాష కూడా మారిపోతుంది. అధికారంలో ఉన్న నేతలకు సాగిలపడటం, సాష్టాంగపడటం అధికార సంబంధాల నైజాన్ని తెలియజేస్తుంది. ఒక మనిషి మరొక మనిషి ముందు వంగిపోవడం, పాదాలకు మొక్కడంలోని అసంబద్ధత, నిర్హేతుకత ప్రశ్నార్థకం. ఇది గౌరవసూచకం సైతం కానే కాదు. మనిషి ఆత్మగౌరవానికి హానికరం. కాలం చెల్లిన భూస్వామ్య పెత్తనపు ధోరణికి పరాకాష్ట పాదాభివందనం. అధికారం కొందరు వ్యక్తుల చేతిలో కేంద్రీకృతమై ఉన్న పరిణామాల ఫలితమిది.
ఒకచోట వంగిపోయే మనుషులు మరొకచోట దర్పాన్ని, అహాన్ని ప్రదర్శిస్తారు. ఇతరుల మీద అధికారం చెలాయించాలని చూస్తారు. ఈ కారణంగానే ఒక్కొక్క స్థాయిలో అధికార చట్రాలకు బలవుతూనే మరోచోట అధికారం చెలాయించే పోకడలకు అలవాటు పడ్డారు. బయట ఇతరుల పెత్తనాలకు నలిగిపోయిన మగవాడు ఇంట్లో భార్యమీద అకారణంగానే జులుం ప్రదర్శించడం సర్వసాధారణం. ఏ మాత్రం చిన్నపాటి అధికారం ఉన్నా దానిని ఏదో రూపంలో ప్రదర్శించి తమ ఆధిక్యత చాటుకోడం మానవ సంబంధాల్లోని వైపరీత్యం.
చరిత్రక్రమాన సమాజాల్లో, వ్యవస్థల్లో మార్పు వస్తున్నా అధికార చట్రాలు బలహీనం కాకపోగా మరింత బలపడ్డాయి. అత్యాధునిక వాణిజ్యపోకడలు అధికార చట్రాల్ని బలోపేతం చేస్తున్నాయి. అసమానతల్ని పెంచిపోషిస్తున్నాయి. వీటిని ప్రశ్నించడం, ప్రతిఘటించడం ద్వారానే అధికార వ్యవస్థల అమానవీయ స్వభావాన్ని నిలదీయడం సాధ్యం. ఒక మనిషి మీద మరో మనిషి పెత్తనం చెల్లదు గాక చెల్లదని చెప్పడం అనివార్య కర్తవ్యం. తద్వారా అధికార సంబంధాల స్థానాన నికార్సయిన మానవీయ సంబంధాలు పాదుకుంటాయి. ఈ దిశగా మానవాళి చైతన్యం ఇనుమడించడం ఇవాళ్టి అవసరం.

Next Story
Share it