Sneha TV
న్యూస్

కాంగ్రెస్‌ హవా!

X

కర్ణాటక పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి ఉంటాయి. రెండున్నరవేల పైచిలుకు వార్డుల్లో బీజేపీ కంటే ఓ యాభై ఐదు వార్డులు ఎక్కువ గెలుచుకొని కాంగ్రెస్‌ ప్రథమస్థానంలో నిలబడగలిగింది. దాని మిత్రపక్షం జెడీఎస్‌ 375వార్డులతో మూడోస్థానంలో నిలిచింది. రాష్ట్రస్థాయిలో సంకీర్ణం సాగుతున్నప్పటికీ, స్థానిక ఎన్నికల్లో వేరువేరుగా పోటీచేసిన కాంగ్రెస్‌, జెడీఎస్‌లు ఎన్నికల అనంతర పొత్తులతో మెజారిటీ మునిసిపాలిటీలను స్వాధీనం చేసుకోబోతున్నాయి. బీజేపీ ఆరోపించినట్టుగా ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగివుండవచ్చునేమో కానీ, దాని సంప్రదాయ పట్టణ ఓటర్లు కాంగ్రెస్‌వైపు మళ్ళిపోతున్నట్టు నిర్థారణ కావడం పెద్ద దెబ్బ. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు నెగ్గిన బీజేపీకి సార్వత్రక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామం కచ్చితంగా ఆందోళన కలిగించేదే.

అసెంబ్లీ ఎన్నికల్లో బాగా దెబ్బతిన్న ఉత్తర కర్ణాటకలోనూ మంచి ఫలితాలు రావడం కాంగ్రెస్‌కు ఉత్సాహాన్ని కలిగించే అంశం. ఫలితాలు తన పక్షాన ఈ స్థాయిలో ఉంటాయని కాంగ్రెస్‌ కూడా ఊహించినట్టు లేదు. ఈ ఎన్నికలు సంకీర్ణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం కాబోవని ఎన్నికల ముందు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కొందరు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇందుకు భిన్నంగా ఇవి కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం సాధించిన ప్రజామోదానికి ప్రత్యక్షసాక్ష్యమని అంటున్నారు. పట్టణ ఓటర్లంతా తమ పక్షానే కనుక ఈ ఎన్నికల్లో అద్భుత విజయాలు తథ్యమని ఆశపడ్డ బీజేపీ నాయకులు ఈ ఫలితాలు రాబోయే సార్వత్రక ఎన్నికలమీద ప్రభావం చూపబోవని వాదిస్తున్నారు. మొత్తం 1357 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌, జెడీఎస్‌లు తమ సంకీర్ణ ప్రభుత్వానికి ప్రజామోదం బలంగా ఉన్నదని ఇకపై చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పరస్పరం ఘాటుగా విమర్శించుకొని ఎన్నికల అనంతరం పొత్తుతో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్‌-జేడీఎస్‌లను బీజేపీ ఇంతకాలం పలువిధాలుగా విమర్శిస్తూ వచ్చింది. ప్రజాభీష్ఠానికి వ్యతిరేకంగా, కేవలం అధికార కాంక్షతో జరిగిన ఈ అక్రమ కలయికను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనీ, కలలోనైనా ఊహించని ఈ అక్రమ సంకీర్ణంపై వారు ఎంతో ఆగ్రహంగా ఉన్నారన్నది బీజేపీ వాదన. స్థానిక ఎన్నికల విజయంతో కాంగ్రెస్‌, జెడీఎస్‌లు ఇకపై ఆత్మరక్షణ వ్యాఖ్యలు మాని బీజేపీపై ఎదురుదాడి చేయవచ్చు. ఈ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీచేసినప్పటికీ, అవసరమైన చోట్ల బీజేపీని నిలువరించడానికి కచ్చితంగా పొత్తులుంటాయని ముందుగానే ప్రకటించి, తదనుగుణగానే ఈ రెండు పక్షాలు పావులు కదుపుతున్నాయి. కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణం ఎంతో కాలం నిలవదని నిర్థారించినవారు, కనీసం అనుమానించినవారు ఇకపై అటువంటి ఆలోచనలు చేయలేని వాతావరణాన్ని ఈ ఫలితాలు సృష్టించాయి. ఈ రెండు పార్టీలు ఈ ఎన్నికలతో మరింత చేరువయ్యాయి. సంకీర్ణంపై ఉభయపక్షాల్లోనూ నమ్మకం మరింత హెచ్చి, రాబోయే రోజుల్లో కలసికట్టుగా పనిచేసేందుకు, సార్వత్రక ఎన్నికల్లో ఇదేబాటలో నడిచేందుకు ఈ ఫలితాలు ఉపకరించవచ్చు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌-జేడీఎస్‌లు వేర్వేరుగా పోటీచేసినందువల్ల రెండూ నష్టపోయాయని కొందరి వాదన. ఈ రెండు పార్టీలూ కలసి పోటీచేసివుంటే కనీసం నూటయాభైస్థానాలు గెలుచుకోగలిగేవనీ, నూట అయిదు స్థానాలతో బీజేపీ ముందంజలో ఉండటం అసాధ్యమయ్యేదని అప్పట్లోనే కొందరు విశ్లేషించారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌లు ఉమ్మడిగా పోరాడితే రాబోయే సార్వత్రక ఎన్నికల్లో 17 లోక్‌సభ స్థానాలు దక్కించుకుంటాయని కూడా లెక్కలేశారు. పట్టణ స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం 51నుంచి 35కు పడిపోయిందన్న విశ్లేషణలు దానికి ప్రమాద సూచికలే. కాంగ్రెస్‌ ఐదుశాతం పెంచుకుంటే, జెడీఎస్‌ నాలుగుశాతం కోల్పోయినట్టు చెబుతున్నారు. జేడీఎస్‌ ప్రధానంగా పట్టణ ఓటర్లపై ఆధారపడిన పార్టీ కాదు కనుక దీనివల్ల వచ్చే నష్టమేమీ పెద్దగా లేకపోవచ్చు. ఈ ఫలితాలు కాంగ్రెస్‌కు కొత్త శక్తినిస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న కుమారస్వామి కాంగ్రెస్‌తో మరింత సఖ్యంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. సార్వత్రక ఎన్నికల్లోగా సంకీర్ణానికి తన కన్నీటి చేష్టలతో అప్రదిష్ట తేకుండా, తన పదవీకాలాన్ని సజావుగా పూర్తిచేసుకోగలిగినప్పుడు మాత్రమే ఈ తరహా విజయాలు భవిష్యత్తులోనూ సిద్ధిస్తాయి.

Next Story
Share it