Sneha TV
న్యూస్

ముందస్తు ఎత్తులు... పొత్తులూ జిత్తులూ!

X

ఒకే దేశం ఒకే ఎన్నికలు జపంతో శాసనసభలన్నిటినీ అర్థంతరంగా రద్దు చేసి లోక్‌సభతో పాటు అకాలంలో ఏకకాల ఎన్నికలు తేవాలని ముచ్చటపడిన ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాల పథకాలు పటాపంచలైనాయి. రాజ్యాంగ రీత్యా శాసనసభలకూ లోక్‌సభకూ దేని పరిధి దానికి ఉన్నప్పుడు పదవీ కాలం పెంచడం కుదించడం కుదిరేపని కాదని నిపుణులు స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలలో అత్యధికం అందుకు వ్యతిరేకత తెలిపాయి. ఎన్నికల సంఘం ప్రధానాధికారి కూడా అధికారికంగా సాధ్యం కాదని తేల్చిపారేశారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ఘర్‌లలో 2018 డిసెంబర్‌లో ఎన్నికలు రావాలి. వాటిని గెలవగలమన్న నమ్మకం ఆ పార్టీకి లేదు. ఉప ఎన్నికలు తలబొప్పి కట్టించడమే గాక కర్నాటకం కూడా అవమానకరంగా ముగిసింది. ఇప్పుడు ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో కూడా కొన్ని సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి. ఈ పరిస్థితికి విరుగుడుగానే బీజేపీ లోక్‌సభతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా ముందుకు జరిపి మోడీ బొమ్మ మాటున గెలవాలని ఆశపడింది. ఇప్పటికీ పది పన్నెండు రాష్ట్రాల శాసనసభలనైనా తోడు చేస్తే అప్పుడు కొన్నిచోట్ల ఓటమి వచ్చినా కాస్త అటూ ఇటూగా తట్టుకోవచ్చని ఆలోచిస్తున్నట్టు తాజా కథనాలు చెబుతున్నాయి. వీటన్నిటా తొంగి చూస్తున్నది బీజేపీ అభద్రతే. అజేయుడన్న మోడీ ఇంత త్వరగా డీలా పడిపోవడం వికటించిన విధానాల ఫలితమేనన్నది స్పష్టం.


తెలంగాణ, ఏపీలలో టీడీపీ, టీఆర్‌ఎస్‌లు కూడా రకరకాల రాజకీయ విన్యాసాల్లో మునిగితేలు తున్నాయి. జమిలి ప్రతిపాదన మొదట్లో చంద్రబాబునాయుడు, చంద్రశేఖరరావు ఉభయులూ స్వాగతించినట్టే మాట్లాడారు. ఏడాది కిందటే ఎన్నికల ఊహాగానాలు వదిలింది వారే. తర్వాత కాలంలో పరిస్థితులు మారాయి. టీడీపీ, ఎన్‌డీఏ నుంచి బయిటకు రావడం బీజేపీపై విమర్శలు గుప్పించడం ఒకవైపు, టీఆర్‌ఎస్‌ పట్ల బీజేపీ కేంద్ర నాయకత్వం బాహాటంగానే సానుకూల వైఖరి తీసుకోవడం మరోవైపు జరిగాయి. నోట్లరద్దును జీఎస్‌టీని పొగడటంలో కేసీఆర్‌, బీజేపీ ముఖ్యమంత్రులను మించి పోయారు. అసహన రాజకీయాలు దళితులపై దాడులు, గోరక్షణ పేరుతో హత్యలు ఇలాంటి దారుణాలు వేటినీ టీడీపీ, టీఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌సీపీ ఎన్నడూ గట్టిగా ఖండించింది లేదు! ప్రత్యేక హోదా నిరాకరణ నేపథ్యంలో టీడీపీ అనివార్యంగా విడగొట్టుకుని ఆ మేరకు వ్యతిరేక వైఖరి తీసుకుంది గాని, టీఆర్‌ఎస్‌. ఇటీవల అవిశ్వాస తీర్మానంలోనూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికలలోనూ మరింత దగ్గరైంది. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరిట కాంగ్రెస్‌ బీజేపీలకు ప్రత్యామ్నాయం నిర్మిస్తానని ఆర్భాటం చేసిన కేసీఆర్‌ ఆ ఊసే మానేశారు. ఇక మొన్నటి దాకా బీజేపీతో కలిసిన చంద్రబాబు ఇప్పుడు దాన్ని ఓడించేవారందరితో కలసి పనిచేస్తాననీ, 25పార్లమెంటు స్థానాలు తెచ్చుకుని వచ్చే ప్రధాని ఎవరో నిర్ణయిస్తామని చెబుతున్నారు.


అదే విధంగా మొదట జమిలిని సమర్థించిన చంద్రబాబు ఇప్పటి పరిస్థితిలో అది సాధ్యం కాదని విధానం మార్చుకోగా, టీఆర్‌ఎస్‌ జమిలికి అనుకూలంగానే అభిప్రాయం చెప్పింది. ఇప్పుడు కనీసం రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముందుగా జరిపించాలని ఆలోచిస్తున్నట్టు కథనాలు వదులుతున్నది. స్వయంగా కేసీఆర్‌ దీన్ని మొదలుపెట్టారు. 2019 ఏప్రిల్‌లో జరగాల్సిన ఎన్నికలు 2018 డిసెంబరులో జరిగితే అది ముందస్తు కాదనే వాదన తీసుకొచ్చారు. నిర్ణీత సమయానికి ఆరు నెలలు ముందు వెనకగా ఎన్నికలు నిర్వహించే అధికారం ఎన్నికల సంఘానికి ఉన్న మాట నిజమే. గానీ అది తనుగా నిర్ణయించినప్పటి సంగతి. సమాఖ్య విధానంలో రాష్ట్రాలు కోరితే ముందుగా ఎన్నికలు జరపాలని చెప్పడం రాజ్యాంగ బద్ధమే. అయితే గతంలో పశ్చిమబెంగాల్‌ వామపక్ష ప్రభుత్వం స్థానిక పరిస్థితుల రీత్యా ఎన్నికలు ముందుగా జరిపించాలని కోరితే తిరస్కరించిన ఉదంతాలున్నాయి. ఏదైనా రాష్ట్రం కోరితే దాన్ని అమలు చేయడం రాజ్యాంగ బద్దమే, గాని కచ్చితంగా సమయం ఏమిటన్నది చెప్పనవసరం లేదు. సభ రద్దు జరిగిన తర్వాతే ఎన్నికల సంఘం రంగంలోకి వస్తుంది. రద్దు చేయవలసింది రాష్ట్రపతి, కేంద్రం. ఈ కారణంగానే కేసీఆర్‌ కేంద్రంతో మంతనాలు జరిపి వారిద్వారా ఎన్నికల సంఘాన్ని ఒప్పించడానికి ప్రయత్నించారు. తుది నిర్ణయం చెప్పకుండా అనిశ్చితి కొనసాగిస్తున్నారు. ముందస్తు కాదని సాంకేతిక వాదనలు చేస్తూనే అభ్యర్థుల ప్రకటన, భారీ జనసమీకరణ వంటివాటితో రంగం సిద్ధం చేస్తున్నారు. తన పాలన పట్ల గొప్ప ప్రజాదరణ ఉందని చెప్పే కేసీఆర్‌ ఎందుకు ముందస్తుకు హడావుడి పడుతున్నారన్నది ప్రశ్న. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రధాన ప్రత్యర్థి. కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో వారు గెలిస్తే ఇక్కడ ఆ ప్రభావం పడుతుందనే అంచనా ఒక వైపు, రెండు ఎన్నికలు కలిసి వస్తే పొత్తులు జిత్తులలో స్వేచ్ఛ తగ్గుతుందనే భావన మరోవైపు ఇందుకు కారణమవుతున్నాయి. ముందే గెలిచి రాష్ట్రంలో అధికార పీఠమెక్కితే కేంద్రంలో కోరుకున్న విధంగా వ్యవహరించవచ్చు. తమ వారికి మంత్రి పదవులూ తెచ్చుకోవచ్చు.


జమిలి చర్చ తెలుగు రాష్ట్రాలకు వర్తించదని ఎందుకంటే రెండు ఎన్నికలు కలిసే జరుగుతున్నాయని ఒక వాదన. ఉమ్మడి రాష్ట్రంలో చారిత్రికంగా వేర్వేరు సమయాల్లోనే జరుగుతుండేవి. 1984లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ తర్వాత తిరిగివచ్చిన ఎన్టీఆర్‌ ఇందిరాగాంధీ హత్యానంతరం ఆ ఏడాది చివరలో లోక్‌సభతో పాటు జరిపే అవకాశమున్నా మరో మూడు మాసాల తర్వాత 1985లో శాసనసభకు జరపడం మంచిదని భావించారు. 1989లోనైతే ముందుగానే సభను రద్దు చేసి లోక్‌సభతో పాటు వెళ్లాలని నిర్ణయించారు. 2003లో చంద్రబాబు కూడా అలిపిరి హత్యాప్రయత్నం తర్వాత ముందుగా ఎన్నికలకు వెళ్లడం మంచిదనుకున్నారు. అప్పటికి కేంద్రంలోని వాజ్‌పేయి ప్రభుత్వం కూడా దాన్నే అనుసరించింది. తీరా రెండు చోట్లా ఓడిపోయారు. 2004లో విజయం సాధించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2008 నుంచి ముందస్తు రావచ్చని ఊహాగానాలు వదులుతూ చివరకు మామూలుగానే ఎన్నికలు జరిపించారు. ఇలా ముందుగా ఎన్నికలు వస్తాయనే వ్యూహాలు వదలడం ఒక వ్యూహంగా మారింది. దానివల్ల చర్చ మొత్తం ఎన్నికల చుట్టూ తిరుగుతుంటుంది. సమస్యలూ ఉద్యమాలూ మరుగున పడిపోతాయి. ప్రతిపక్షాలు సన్నాహలలో మునిగిపోతాయి. ఇదొక వ్యూహం. కాబట్టే కేసీఆర్‌ ఆ సంకేతాలిస్తూనే స్పష్టత దాటేస్తున్నారు. మీడియాలో కొందరు అటూ కొందరు ఇటూ చెబుతుంటే వారి అధికార పత్రిక ఆ సంగతి దాటేస్తున్నది. మరో వారం తర్వాతనైనా ఇది తేలుతుందా అనేది అనుమానమే. ఎన్నికలు డిసెంబరులో రావాలంటే వెంటనే సభ రద్దుకు సిఫార్సు చేయాలి. కాని దానికి హామీ లేకపోతే ఇదంతా వ్యర్థం. కాబట్టే ఇన్ని వూగిసలాటలూ నడుస్తున్నాయి.


ఇక ఎన్నికల పొత్తులకు వస్తే పాలక పార్టీలు పొత్తుల కంటే జిత్తులకే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ కలుస్తుందని దాదాపు ఖాయంగా చెబుతున్నారు. సీపీఐ, కోదండరాం టీజేఎస్‌ కూడా తమతో వస్తాయని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. సీపీఐ నాయకులు తాము అలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. సీపీఐ(ఎం), బీఎల్‌ఎఫ్‌ వేదికపై పలు సంఘాలతో కలసి ఎన్నికలకు సిద్ధమవుతున్నది. టీఆర్‌ఎస్‌కు మజ్లిస్‌తో అవగాహన బీజేపీ పట్ల సానుకూలతో ఉండటం కనిపిస్తున్నది. టీడీపీ తెలంగాణలోనే గాక ఏపీలో కూడా కాంగ్రెస్‌తో వెళ్లడానికి సిద్ధమైందని వారికి దగ్గరగా ఉండే పత్రికలు కూడా రాశాయి. దీన్ని కొందరు మంత్రులు వ్యతిరేకించగా కొందరు సమర్థించారు. అలాగే కాంగ్రెస్‌లో కొందరు వ్యతిరేకమైనా రాహుల్‌గాంధీ చెప్పినట్టు నడుచుకుంటామని అంటున్నారు. జగన్‌ తమ ప్రధాన ప్రత్యర్థి అని రాహుల్‌ అన్నట్టు గతంలోనే వచ్చింది. కర్నాటకలోనూ పార్లమెంటులోనూ కాంగ్రెస్‌తో కలసి వ్యవహరించిన టీడీపీ, బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు చెబుతున్నారు. దీనిఅర్థం కాంగ్రెస్‌తో కలవడమేనని ఎంతో కొంత శాతం ఓట్లు వచ్చి కలవకపోతే తమకు విజయం లభించదని టీడీపీ ఆలోచనలో ఉందని అంటున్నారు. నిజంగానే టీడీనీ ఏర్పడిన తర్వాత మొదటి ఎన్నికల్లో తప్ప మరెప్పుడూ వారు వంటరిగా పోరాడలేదు. గతసారి బీజేపీ, జనసేన మద్దతు ఉన్నా ఓట్ల మొత్తం తేడా చాలా పరిమితంగానే ఉంది. ఇప్పుడు జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌ వామపక్షాలతో కలసి పోరాడుతున్నారు. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లనున్నట్టు చెబుతున్నారు. టీడీపీ, కాంగ్రెస్‌కు లొంగిపోయిందని బీజేపీతో కుమ్మక్కు కొనసాగుతున్నదని వైసీపీ ఆరోపిస్తున్నది. అయితే రాజ్యసభ ఎన్నికలలో బీజేపీని వ్యతిరేకిస్తానని చెప్పి తర్వాత తటస్తంగా ఉండటం విశ్వసనీయతను దెబ్బతీసింది. అయితే వైసీపీ నేత జగన్‌ భార్య భారతిని కూడా ఈడీ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన తర్వాత బీజేపీపై బహిరంగ విమర్శలు చేశారు. బీజేపీతో ప్రత్యక్షంగా కలిసేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నది వాస్తవం. వామపక్షాలను మినహాయిస్తే జాతీయ పార్టీల ప్రాంతీయ అవకాశవాదం, ప్రాంతీయ పార్టీల జాతీయ అవకాశవాదం మొత్తం దృశ్యాన్ని గందరగోళంగా చిందరవందరగా మార్చేయడం ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నదే. అనుభవజ్ఞులూ చైతన్యవంతులైన ప్రజలు వీటి లోతుపాతులు గ్రహించి సరైన నిర్ణయమే తీసుకుంటారని అన్ని అవకాశవాదాలను అక్రమ పోకడలనూ అవినీతి శక్తులనూ తిరస్కరిస్తారని ఆశించాలి.

Next Story
Share it