Sneha TV
న్యూస్

సమాచార సామ్రాజ్యంపై ఆధిపత్యం

X

వికీలీక్స్‌ మరోసారి సంచలనం సృష్టించింది. అమెరికా గూఢచారి సంస్థ సిఐఎ ప్రజల అంతర్గత జీవితాల్లోకి ఎలా ప్రవేశిస్తుందన్నదో ఆధారాలతో నిరూపించింది. యావత్‌ ప్రపంచం దీనితో నిర్ఘాంతపోయింది. ప్రపంచంపై అమెరికా దుర్మార్గంగా ఆధిపత్యం కోసం సాగిస్తున్న కుట్రలు ఇప్పటికే పలుసార్లు నిరూపితమయ్యాయి. వివిధ దేశాల్లోని అంతర్గత సమాచారాన్ని సేకరించి తమ 'బాస్‌'లకు పంపిన వైనాన్ని మొదటిసారి వికీలీక్స్‌ తన పత్రాల ద్వారా 2011 సం||లో బయటపెట్టింది. ఆతర్వాత స్నోడెన్‌ 2013లో ఇంటర్‌ నెట్‌ కోసం ఉపయోగించే కేబుల్స్‌ ద్వారా గూగుల్‌, యాహూ వంటి మధ్యంతర సర్వీస్‌ సంస్థల ద్వారా సముద్ర గర్భంలోని సర్వర్ల ద్వారా సమాచార సేకరణ చేసినట్టు రుజువైంది.

ఇది అమెరికా మిత్ర దేశాల్లో సైతం పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. జర్మన్‌ ఛాన్సలర్‌ మార్కెట్‌ ప్రత్యక్షంగా ఖండించడమే కాకుండా అమెరికాకు హెచ్చరిక కూడా చేశారు. దానితో అమెరికా పాలకులు ఆత్మరక్షణలో పడ్డారు. రష్యా, చైనా వంటి దేశాలు తమ స్వంత సర్వర్లు, సర్చ్‌ ఇంజన్లు ఉపయోగిస్తున్నారు కనుక వారి నుండి ఎక్కువ సమాచారం రాబట్టలేకపోయింది అమెరికా. కాని మనలాంటి దేశాల నుండి ప్రభుత్వ రక్షణ రహస్యాలతో సహా మొత్తం సమాచారమంతా వారికి చేరింది. తమ అసమర్ధత బయటపడకుండా ఉండేందుకు మన దేశపాలకులు దానిపై పెద్దగా స్పందించకుండా అదేదో స్వల్ప విషయం అన్నట్టుగా వ్యవహరించారు. ఇప్పుడు ఇది మూడో సంచలనం. వికీలీక్స్‌్‌ దాదాపు 8500 ఫైళ్లను'వాల్డ్‌' పేరుతో తాజాగా విడుదల చేసింది. ఇందులోనే దిమ్మతిరిగే సమాచారముంటే ఇంతకన్నా తీవ్రమైన సమాచారం కలిగిన ఫైళ్లను త్వరలో విడుదల చేస్తామని వికీలీక్స్‌ మరో సంచలన ప్రకటన చేసింది. ఇంతకీ ఏమిటా ఫైళ్లు? ఏముంది వీటిల్లో? ఇప్పటికే హిందూ పత్రిక తర్వాత మరికొన్ని దినపత్రికలు వీటి సారాంశాన్ని ప్రచురించాయి. 2011-16 మధ్య సిఐఎ తయారుచేసిన రహస్య నివేదికలివి. అందులో పనిచేసే వారి ద్వారానే వికీలీక్స్‌ వీటిని సేకరించింది. స్నోడెన్‌ బట్టబయలుచేసిన పత్రాలతో వచ్చిన ప్రజాగ్రహం నుండి తప్పించుకోవడానికి గూగుల్‌ వంటి మధ్యంతర సర్వీసు కంపెనీలు నేరుగా సమాచారాన్ని అందించడానికి నిరాకరించాయి. అమెరికా చట్టాల ప్రకారం అమెరికాలో ఉండే ఆఫీసుల ద్వారా వారి దేశాల సమాచారం ఇవ్వాల్సిందే. కాని విదేశాల్లో ఉండే కంపెనీలు వారికి ఇవ్వడం ఆయా దేశాల చట్టాల ప్రకారం నేరం. దానితో సీఐఎ ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకున్నది. యాపిల్‌, శ్యాంసంగ్‌, నోకియా వంటి హార్ట్‌వేర్‌ కంపెనీల ద్వారా వారు ఉపయోగించే కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, ఇంటర్‌ నెట్‌ కలిగిన టెలివిజన్‌ సెట్లలో కెమెరాలు, రేడియోలను ఆడియో చిప్‌లను ఆధీనంలోకి తీసుకునే సాఫ్ట్‌వేర్‌ను చొప్పించారు. మనం ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేసినా బ్యాటరీ ఉన్నంతవరకు అవి లోపల పనిచేస్తూనే ఉంటాయి. మనం పంపే మెసేజ్‌లు, మెయిల్స్‌, నిక్షిప్తం చేసుకున్న సమాచారం, టెలిఫోన్‌ సంభాషణలు ఇలా ఏది కావాలనుకున్నా వారికి చేరిపోతుంది. ఎవరెవరితో సంబంధాల్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, వారి కార్యకలాపాలన్నీ జీపీఎస్‌, గూగుల్‌ మ్యాప్‌ సహాయంతో వారికి తెలిసిపోతాయి. ఒక వేళ సాంకేతిక లేక కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండి తమ పరికరాలకు ఎన్‌క్రిప్షన్‌ ద్వారా రక్షణ కల్పించుకున్నా అది టైపు దశలో ఉండగానే వారికి చేరిపోతుంది. వాట్సప్‌, టెలిగ్రాం వంటి యాప్‌లు చెప్తున్నట్టు ఆ చివర, ఈ చివర రక్షణ ఉన్నా, మధ్యలోడేటాను దొంగలించడం, హ్యాక్‌ చేయడం సాధ్యం కాకపోయినా మొదట, చివర పాయింట్ల ద్వారా వారు ఈ సమాచారాన్ని దొంగలిస్తారు. సాధారణ వ్యక్తులు మొదలుకొని ఉన్నత స్థానాల్లో ఉన్న వారి వరకు ఆఖరికి అమెరికా అధ్యక్షుడు ఒబామా పంపిన మెసేజ్‌లు కూడా వారి జాబితాలోకి వచ్చి చేరాయంటే ఈ చౌర్యం ఎంత పకడ్బందీగా సాగుతుందో అర్థమవుతుంది. ఇప్పటికే సామాజిక మాద్యమాల (సోషల్‌ మీడియా) ద్వారా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ వంటి సాధనాల ద్వారా మన అభిప్రాయాలన్నీ బహిరంగంగానే వారికి దొరుకుతున్నాయి. వీటిని విశ్లేషించడం ద్వారా ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో? ఎవరెవరిని ప్రభావితం చేస్తున్నారో, ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో వారి ఆశయాలేమిటో, వారి ప్రభావం ఏయే ప్రాంతాల్లో ఎలా ఉందో సూక్ష్మంగా విశ్లేషణ చేయగలుగుతున్నారు. తర్వాత ప్రజల మనోభావాలను గమనించి వాటిని అణచివేసే లేదా పక్కదారి పట్టించే చర్యలు లేదా నినాదాలు వదులుతుంటారు. సిఐఏ లాంటి ప్రమాదకర సంస్థలే కాదు ప్రపంచంలో ఉన్న బహుళజాతి వాణిజ్య సంస్థలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం కూడా ఈ సమాచారాన్ని ఉపయోగించుకుంటారయి. దీన్నే 'బిగ్‌డాటా' అంటున్నారు. వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయమే కాకుండా చౌకగా ప్రజలకు ఇంటర్‌నెట్‌ సర్వీసు ఇచ్చి అందరినీ ఈ సుడిగుండంలోకి నెట్టి వారి సమాచారాన్ని అమ్ముకోవడం ఈరోజు పెద్ద వ్యాపారంగా ఉంది. అలా ప్రజల సమాచారాన్ని ఒక సాధనంగా మలిచి దానిపై ఆధిపత్యం కోసం పెద్ద కంపెనీలు ఆరాటపడుతున్నాయి. క్యాష్‌లెస్‌(నగదురహిత) ఎకానమీ, ఈ-కామర్స్‌ (ఎలక్ట్రానిక్‌ వ్యాపారం), స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ల ద్వారా సాగే వాణిజ్య కార్యకలాపాలన్నీ మన రోజువారీ జమాఖర్చుల విశ్లేషణ చేస్తాయి. తద్వారా మార్కెట్‌ వ్యూహాలను రూపొందించుకుంటాయి. గత సెప్టెంబర్‌ నుండి మార్చి వరకు రిలయెన్స్‌ జియో ఇంటర్‌నెట్‌ ఉచితంగా ఇస్తున్నది. వినియోగదారులను కొనుక్కోడానికి పెడుతున్న పెట్టుబడిగా ఇది కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి భారతీయ సమాచార వ్యవస్థపై ఆధిపత్యం కోసమే జియో వ్యూహం రూపొందించుకుంది. తద్వారా ఇంటర్‌నెట్‌ ద్వారా సాగే వ్యాపారంపైనే కాకుండా ప్రజలపైనా, ఆర్థికవ్యవస్థపైనా పట్టుసాధించవచ్చు. ఇప్పటికే మీడియాపై రిలయెన్స్‌ ఆధిపత్యం వచ్చింది. ఇక సమాచార వ్యవస్థ కూడా దాని పరిధిలోకి పోతే మొత్తం సమాచార సాంకేతిక వ్యవస్థపై ఏకచక్రాధిపత్యం వచ్చేస్తుంది. రానున్న కాలంలో ప్రభుత్వాలను, వ్యవస్థలను కూడా శాసించేది ఈ వ్యవస్థే. దానికి మోడీ ప్రభుత్వ సహకారం నిండుగా ఉంది. పౌరుల ప్రాథమిక హక్కుల్ని ఈ దాగాకోరు సంస్థలకు తాకట్టుపెడుతున్నారు. ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న సమాచార తస్కరణపై చర్చ సాగకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికి జాతి, మతం వంటి సున్నితమైన అంశాలపై వారిని రెచ్చగొడుతున్నారు. తద్వారా ప్రపంచ కార్పొరేట్‌ కంపెనీలకు, సీఐఎ వంటి రహస్య గూఢచారి సంస్థలకు మన ప్రభుత్వాలు సేవచేస్తున్నాయి.
ఒక మనిషి శరీరంలో 'చిప్‌' అమర్చి దానిద్వారా ఆవ్యక్తిని పూర్తిగా రిమోట్‌తో కంట్రోలు చేసే దృశ్యాలను, ఒక కారులోని చిప్‌ల ద్వారా ఆ కారు మార్గాన్ని, వేగాన్ని నియంత్రించే దృశ్యాలను, మనిషి కంటిపాపను స్కాన్‌చేసి మనిషి మానసిక ఉద్వేగాలను అంచనావేసే మిషన్లను హాలీవుడ్‌ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాల్లో మనం చూస్తుంటాము. ఇవన్నీ మనకు ఊహజనితంగానే ఉంటాయి. నిజంగా అలా జరుగుతుందా? అని ఆశ్చర్యపోతుంటాము. కాని భవిష్యత్‌లో ఇవి సాధ్యమేనని ఇప్పుడు వికిలీక్స్‌ విడుదల చేసిన సీఐఎ పత్రాలు నిరూపిస్తున్నాయి. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లే కాదు, మనిషి జీవితంలో అందునా 21వ శతాబ్దంలో ప్రతి అడుగూ ఎలక్ట్రానిక్‌ మైక్రోచిప్‌ల ద్వారానే పడుతుందని అంటే అతిశయోక్తికాదు. ఎక్కడో బయట దూరంగా వుండి ఇంట్లో ఏసీని, టీవీని ఇతర విద్యుత్‌ పరికరాలను కూడా రిమోట్‌ ద్వారా కంట్రోలు కచేసే విజ్ఞానం వచ్చింది. మనం వాడే కార్లు, మోటార్‌సైకిళ్లు కూడా చిప్‌ల సహాయంతోనే నడుస్తుంటాయి. ఒక ఆధునిక కారులో దాదాపు 500 మైక్రో చిప్‌లు పనిచేస్తున్నాయంటే ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదు. రేడియో యాక్టివ్‌ పరికరాల ద్వారా వీటిని బయట నుండి ఎవరైనా నియంత్రించే పరిస్థితి రాదనుకోలేము. ఒక స్మార్ట్‌ వాచ్‌ మన శరీర కదలికలను రికార్డు చేస్తుంది. తాజాగా ద్రోణుల గురించి వింటున్నాము. అమెజాన్‌ లాంటి వాణిజ్య సంస్థలు సరుకుల రవాణాకు (కొరియర్‌) ఉపయోగిస్తున్నది. పోలీసులు అడవుల్లో నక్సల్స్‌ జాడ తెలుసుకోడానికి ఉపయోగిస్తున్నారు. ఈ డిజిటల్‌ యుగంలో ప్రజాస్వామిక హక్కులు, పౌరస్వేచ్ఛ, వ్యక్తిగత ప్రైవసీ అనే మాటలకు అర్థాలు మారిపోతున్నాయి. డిజిటల్‌ యుగంలో ''ఈ-స్వేచ్ఛ'' కావాలన్న డిమాండు ముందుకొస్తున్నది. మరోవైపు డిజిటల్‌ అంతరాలు పెరిగిపోతున్నాయి. హక్కుల కోసం జరిగే పోరాటంలో డిజిటల్‌ సమానత్వం కూడా ఒక భాగమవుతుంది. ఆ రీత్యా వికీలీక్స్‌ సీఐఎ పత్రాలు మనకు మేలుకొలుపు.
ఇంత జరుగుతున్నా గతంలోకానీ ఇప్పుడుకానీ ప్రభుత్వాలు స్పందించడంలేదు. నిత్యం దేశభక్తి, జాతీయత గురించి గాలికబుర్లు చెప్పే బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌, మోడీ పల్లెత్తు మాట్లాడటం లేదు, ఖండించడంలేదు, ఆందోళన వ్యక్తపర్చడం లేదంటే వారి దేశభక్తి ఏపాటిదో అర్థమవుతున్నది. ఇలా సమాచార చౌర్యం జరగకుండా ప్రజలకు ప్రభుత్వం కల్పించే రక్షణ ఏమిటి? ఆమాట కొస్తే పౌరుల ప్రాథమిక హక్కులేకాదు, ప్రభుత్వ రహస్యాలు కూడా సీఐఎకు చేరుతున్నాయి. ఇక మన దేశ రక్షణకు భద్రత ఏముంది? రష్యా, చైనా ల్లాగా మనకు స్వంత సర్వర్లు, సర్చ్‌ ఇంజన్లు లేవు.చిప్‌లు తయారు చేసుకోలేము. పూర్తిగా అమెరికా కంపెనీలపై ఆధారపడు తున్నాము. మేక్‌ఇన్‌ ఇండియా వంటి నినాదాలతో యువతను భ్రమల్లో పెట్టడం తప్ప స్వీయాభివృద్ధి ఎక్కడా కన్పించడం లేదు. మేక్‌ఇన్‌ ఇండియా పేరుతో ఆయుధాలు తయారు చేసే అమెరికా కంపెనీలను ఇక్కడకు రప్పించి ఇక్కడే తయారుచేయించి ఎగుమతి చేయించడమే జరుగుతుంది. ఇప్పటికే మన రక్షణ వ్యవస్థలోకి అమెరికా పూర్తిగా ప్రవేశించింది. రోజూ మనం పాకిస్తాన్‌పై నిప్పులు చెరుగుతుంటాం. కాని అమెరికా అదే పాకిస్తాన్‌ను ఒక చేత్తో, ఇండియాను మరో చేత్తో పట్టుకొని నడిపిస్తుంటుంది. ఇద్దరినీ కలిపి రష్యా, చైనాలకు వ్యతిరేకంగా నిలబెట్టి ఆసియా, యూరప్‌లలో తన ఆధిపత్యాన్ని తెచ్చుకోవాలన్నది దాని వ్యూహం. ఆ వ్యూహాంలో మనం స్వతంత్రతను వదులుకొని అమెరికాకు సాగిలపడుతున్నాం. అందుకే మోడీ నోరు విప్పడం లేదు. ఇటీవల అమెరికాలో భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. కూచిబొట్ల శ్రీనివాస్‌తో సహా ముగ్గుర్ని హత్యచేశారు. అయినా మోడీ నోరుమెదపడం లేదు. అమెరికాతో సంబంధాలు చెడిపోతాయేమోనని వారి భయం. ఇలాంటి ఒక్క ఘటన ఏ చైనాలోనో జరిగి ఉంటే ఈ పాటికి బిజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు బోనభవంతరాలు అదిరిపోయేటట్టు కేకలు పెట్టి ఉండేయి. కాని అమెరికా వైపు కన్నెత్తి చూడటానికి కూడా వారికి దమ్ముచాలడం లేదు. ఇదే వారి దేశభక్తి? వీరి నరనరాల్లో దేశభక్తి కన్నా అమెరికా అనుకూలత, కమ్యూనిస్టు వ్యతిరేకత కుళ్లికుంపుకొడుతున్నాయి. కేరళ ముఖ్యమంత్రిపై కత్తికట్టి, రివార్డులు ప్రకటిస్తున్న ఈ ఉన్మాదులకు అమెరికా నుండి విదేశీ కంపెనీల నుండి వస్తున్న ప్రమాదాలు కండ్లకు కన్పించటం లేదు. అమెరికాలోని భారతీయుల ఆర్తనాదాలు వినిపించడం లేదు. సీఐఏ సాదాసీదా గూఢచార సంస్థ కాదు. దీని చరిత్ర అంతా కుట్రలు, కుతంత్రాలతో నిండి ఉన్నది. ప్రపంచాన్ని అస్థిరం పాలుచేస్తున్నది. తన మాట వినని పాలకుల్ని సైతం హతమారుస్తున్నది. ప్రజాస్వామిక ఉద్యమాలను, పార్టీలను, దెబ్బతీస్తున్నది. ఇది చట్టవిరుద్ధ సంస్థ. ఏ దేశ రాజ్యాంగాన్ని, చట్టాలనూ లెక్కచేయదు. ఇలాంటి సంస్థని మనదేశంలోకి స్వేచ్ఛగా అనుమతించడం ఎంత ప్రమాదకరమో ఊహించుకోవల్సిందే. ప్రధాని మోడీకి సీఐఏ గురించి తెలియదనుకోలేము. ఇలాంటి ప్రభుత్వం కింద భారతదేశానికి రక్షణ ఉంటుందా? ఇప్పటికైనా మోడీ ప్రజల ప్రాథమిక హక్కుల్ని కాపాడటానికి ముందుకు రావాలి. మన పౌరుల సమాచార చౌర్యం జరగకుండా భద్రతాచర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ రహస్యాలు అమెరికా చేరకుండా చూడాలి. అందుకోసం యువత ఉద్యమించాలి. ప్రజల ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడుకోవాలి.

Next Story
Share it