Sneha TV
న్యూస్

కేసీఆర్... సునామీలా కనిపించే వాటర్ ఫౌంటేన్!

X

మనుషులు మూడు రకాలు. కొందరు భయంతో, బద్ధకంతో ఏ పనీ మొదలే పెట్టరు. మరి కొందరు ఉత్సాహంగా ప్రారంభించినా మధ్యలో అడ్డంకులు చూసి బెదిరిపోయి ఆపేస్తారు. ఇక మూడో రకం వారు భూమ్యాకాశాలు ఏకమైనా అనుకున్నది తుద వరకూ చేసి చూపిస్తారు! ఇది ఎప్పుడో ఒక కవి తన పద్యంలో చెప్పిన భావం! తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో కూడా చాలా సార్లు ఈ మాటే చెప్పేవారు. పద్యం కూడా పాడి వినిపించే వారు! ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో ఆయన ఎంఏ చేశారు. ఆ మాత్రం పాండిత్యం సహజమే!

ప్రత్యేక తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రపై ఎవరికీ ఎలాంటి సందేహాలు వుండవు. ఆయన లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని అందరూ అంగీకరిస్తారు. తెలంగాణ వారు ఆనందంగా తెలంగాణ ఆయన వల్ల సాధ్యమైందంటే, ఆంధ్రాలో కొందరు ఇప్పటికీ ఆగ్రహంగానే వుంటూ వుంటారు.

కాకపోతే, ఏ కోణం నుంచి చూసినా ప్రత్యేక తెలంగాణకు పర్యాయపదం కేసీఆర్! అంతలా తాను పెట్టుకున్న లక్ష్యాన్ని చివరికంటా చేరుకునే వరకూ బరిలో నిలిచి పోరాడిన నేత కేసీఆర్! అందుకే, ఫిబ్రవరీ 17 ఆయన జన్మదినం అంటే యావత్ తెలంగాణలో కోలాహలం కనిపిస్తోంది...

కేసీఆర్ భాష, యాస, భావం, భావజాలం... ఇవన్నీ మనకు నచ్చినా నచ్చకపోయినా ఆయన ఒక కాదనలేని చారిత్రక సత్యం. ఆయన వల్లే తెలుగు ప్రజలు ప్రాంతాల వారీగా విభేదాలకు లోనయ్యారని అనే వారు కొందరైతే... అసలు అంతకు ముందే తెలంగాణ, ఆంధ్రా విభజన సుస్పష్టంగా వుందని చెప్పేవారు కొందరు. అప్పటికే వున్న అభిప్రాయ భేదాల్ని భేదాభిప్రాయాలుగా మార్చి కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అది ఆయన రాజకీయ చాతుర్యం. ఒక పొలిటికల్ లీడర్ గా అది తప్పని కూడా అనలేం!

మన దేశంలో చాలా చోట్ల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వున్నాయి. వాటన్నిటికీ ప్రధాన నేతలున్నారు. కాని, కేవలం కేసీఆర్ మాత్రమే విజయవంతమయ్యారు. అందుక్కారణం ఆయన ఉద్యమ సమయంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రమే కారణం కాదు. వాటి వెనుక ఆయన అమలు పరిచిన వ్యూహం వుంది. ఎంతగా వ్యతిరేకత వచ్చినా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు కేసీఆర్. ఈ విషయంలో ఆయన మోదీ, ట్రంప్ లాంటి నేతల కోవలోకే వస్తారు. వారికి కూడా విపరీతమైన ప్రతికూలతలు ఎదురయ్యాయి. అయినా కూడా వారు తమపై దాడులన్నీ తమ మద్దతుదారుల అభిమానంగా మార్చుకోగలిగారు. కేసీఆర్ ది కూడా అదే బాట. ఆయనపై ఆంధ్రా పాలకులు, తెలంగాణ ప్రత్యర్థులు, ఆంధ్రా జనం, మీడియా ఇలా ఎన్ని కోణాల్లోంచి దాడి జరిగినా క్రమక్రమంగా తెలంగాణ సామాన్య జనం గుండెల్లోకి చేరుకోగలిగారు. మరీ ముఖ్యంగా, ఆమరణ నిరాహార దీక్ష అంటూ ఆయన పంతం పట్టాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అదంతా ఆయన సక్సెసా... లేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వున్న ఆనాటి కాంగ్రెస్ వారి వైఫల్యమా అంటే... ఏదైనా కావచ్చు! కాని, కేసీఆర్ పట్టుదలగా ఉద్యమించారు. తెలివిగా ఫలితాల్ని తనకు అనుకూలంగా వాడుకోగలిగారు. రాజకీయ నేతగా ఆయన అది చేయటం తప్పు కాదు. చేయకపోతేనే , చేయలేకపోతేనే తప్పు!

కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాక ఇంత సాఫీగా పరిపాలించగలుగుతారని ఎవ్వరూ భావించలేదు. ఇక సమర్థంగా ఏలుతారనైతే ఊహించలేదు. కాని, నిన్న మొన్నటి హైద్రాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఆంధ్రా సెటిలర్ల ఓట్లు సంపాదించటం వరకూ ఆయన ప్రతీ అడుగు అనూహ్యంగా వేశారు. ఉద్యమకారుడిగా చూపిన ఆవేశం పరిపాలకుడిగా చూపటం మానేశారు. అక్కడే విజయాన్ని ఒడిసిపట్టుకోగలిగారు. తెలంగాణ జనానికి ఆయన చేసిన మంచిపై ఎన్ని విమర్శలైనా చేయవచ్చు. కాని, ఆయన ఎక్కడా ఆంధ్రుల మీద కక్ష సాధింపు, కవ్వింపు చర్యలకి తావు ఇవ్వలేదు. అక్కడే ఆయన అందరికీ ఆమోదయోగ్యమైన వాడిగా మారిపోయారు! సోషల్ మీడియాలో కొందరు ఆంధ్రులు తమకూ ఇలాంటి ముఖ్యమంత్రి వుంటే బావుండునని అనేదాకా పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ చాకచాక్యం, చాణక్యం అర్థం చేసుకోవచ్చు!

చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే, ఇవాళ్ల జన్మదినం జరుపుకుంటోన్న తెలంగాణ రథ సారథి ... '' సునామీలా ఎప్పుడు ఉప్పొంగాలో బాగా తెలిసిన అద్బుతమైన వాటర్ ఫౌంటేన్! '' మెచ్చుకునే వారే కాదు... తిట్టేవారు కూడా పట్టించుకోకుండా వుండలేని ఆశ్చర్యకర రాజకీయం!

Next Story
Share it