వీళ్లు అసలు పోలీసులా... రాక్షసులా?

దళితులంటే ఎందుకింత చిన్నచూపో తెలియదు కానీ, నిత్యం దేశంలో ఎక్కడో ఓ చోట దళితులపై దాడి, దౌర్జన్యాలు జరుగుతునే ఉన్నాయి. ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో గత రెండు వారాల వ్యవధిలో ఎన్నో కేసులు తెరపైకి వచ్చాయి. భూముల ఆక్రమణం, దాడి ఇలా అనేక రకాలుగా దళితులపై దాడులు జరుతునే ఉన్నాయి. తాజాగా బిజెపి పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఓ సంఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకెళితే ..మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాకు వెళ్దాం... చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్ తో నాశనం చేయడం చూసి ఆ దళిత దంపతులు తట్టుకోలేకపోయారు. సొంతబిడ్డను చంపుతున్నట్లే భావించారు. ఆ దుశ్చర్యలను చూడలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు బాధితులు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో పోలీసుల, ఇతర రెవెన్యూ అధికారుల తీరు పట్ల సర్వత్రా విమర్శలు ఎక్కుపెట్టారు.
రాంకుమార్ అహిర్వార్, సావిత్రి దేవి దంపతులు కొన్నేళ్లుగా రెండు బిఘాల(5.5 ఎకరాలు) ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటున్నారు. అదే భూమిని ఓ కళాశాల కోసం కేటాయించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. దీంతో ఆ భూమిని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు రామ్ కుమార్ దంపతులకు సూచించారు. కానీ, వారు అంగీకరించకపోవడంతో రెండు రోజుల క్రితం రాష్ట్ర రెవెన్యూ అధికారులు పోలీసులతో వచ్చి భూమిని ఖాళీ చేయాల్సిందిగా రామ్ కుమార్ దంపతులను బెదిరించారు. అంతటితో ఆగకుండా బుల్డోజర్తో వారి పంటను నాశనం చేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, రామ్ కుమార్ దంపతులకు మధ్య వాగ్వాదం జరిగింది. '' మాకు రూ.3 లక్షల అప్పులున్నాయి. దాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందా? . ఎన్నో ఏళ్లుగా ఇక్కడ సాగు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటే మేం ఎలా బతకాలి. చావు తప్పా మాకు మరో దారి లేదు. " అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు లాఠీలతో విచక్షణారహితంగా రామ్ కుమార్ మీద దాడి చేశారు. అడ్డుకోబోయిన సావిత్రి దేవిని అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. చివరకు బుల్డోజర్తో పంటను నాశనం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఇది చూసి తట్టుకోలేకపోయిన బాధితులు పంటల కోసం తెచ్చుకున్న పురుగుల మందును తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
ఈ సంఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రామ్ కుమార్ దంపతుల మీద దాడి చేసిన పోలీసులకు జిల్లా కలెక్టర్ క్లీన్ చీట్ ఇవ్వడం మరింత వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా రంగంలోకి దిగారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులకు క్లీన్ చీట్ ఇచ్చిన కలెక్టర్‌ను, ఎస్పిని సస్పెండ్ చేశారు.
ఇదే వీడియోలో పోలీసుల నుండి తల్లిదండ్రులను కాపాడేందుకు ప్రయత్నించిన పిల్లలను కూడా పోలీసులు అవమానించారు. అవతలకు ఈడ్చిపారేశారు. దీనిపై ప్రతిపక్షాలు కూడా విమర్శలు ఎక్కుపెట్టాయి. .
జంగిల్ రాజా పాలన సాగుతోంది: మాజీ సిఎం కమల్‌నాథ్
రాష్ట్రంలో జంగిల్‌రాజా పాలన కొనసాగుతుందని ఆరోపించారు. దళిత దంపతుల మీద పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఏంటిది జంగిల్ రాజా ఒకవేళ వారు ప్రభుత్వ భూమిని సాగు చేస్తుంటే, దాన్ని చట్టబద్దంగా పరిష్కరించుకోవాలి. అంతేకానీ జాలీ, దయ, కరుణ లేకుండా ఆ పంపతులను, వారి పిల్లలను కొట్టడం న్యాయం కాదు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని వారు డిమాండ్ చేశారు.
- రామారావు.బి స్నేహ వెబ్ జర్నలిస్టు.