దక్షిణ జపాన్ ను ముంచెత్తిన వరదలు

టోక్యో: అందరూ ఆదమరచి నిద్రపోతున్న వేళ వర్షం పడటం ప్రారంభమైంది. అది కాస్త భారీ వర్షంగా మారి ఇండ్లు మునిగిపోయేలా వరదలు సృష్టించింది. జపాన్ దేశంలోని దక్షిణ ప్రాంతం అతలాకుతలమైంది. కుమా నది పొంగడంతో హితోయోషి పట్టణం నీట మునిగింది.
శనివారం ఆకస్మిక వరదలతో ఇద్దరు మృతిచెందగా, దాదాపు 15మంది గల్లంతయ్యారని టోక్యో అధికార వర్గాలు వెల్లడించాయి. భారీ వరదలు రావడంతో కార్లు, ఇతర వాహనాలు సైతం నీటిలో మునిగిపోయాయి. పెద్దెత్తున ఇండ్ల కప్పులపైకి చేరుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వరద ముప్పు ఉన్న ప్రాంతాలకు చెందిన సుమారు 75వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు ప్రధాని షింజో అబే టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. కాగా, టోక్యోకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమామోటో ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరికలు జారీ చేసింది.