Sneha TV
న్యూస్

మరోసారి కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా..

మరోసారి కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా..
X

తూర్పు లడఖ్ ప్రాంతంలోని సరిహద్దుల్లో చైనా కదలికలను పరిశీలిస్తున్న సైనిక విభాగం విశ్లేషకులు చైనా మరో కయ్యానికి సిద్ధమైందని, ముఖ్యంగా దౌలత్ బేగ్ ఓల్డీ, డేవ్ సాంగ్ సెక్టార్లలో గొడవలు రేపాలని చూస్తోందని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతంలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు, వాహనాలను చేర్చి, సైనిక బలగాలను మోహరించిందని తెలుస్తుండగా, నిఘా వర్గాలు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.

2016లో ఏర్పాటు చేసిన ఓ సైనిక స్థావరం పక్కనే తాజా క్యాంపులు ఏర్పాటు కావడం గమనార్హం. ఇక చైనా కదలికలను పరిశీలించిన భారత్, గత నెలాఖరులోనే డెప్ సాంగ్ ప్రాంతానికి అదనపు బలగాలను పంపించింది. 2013లో ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించిన చైనా విఫలమైందన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఏడేళ్లకు చైనా సైనికులు గాల్వాన్ లో బల ప్రదర్శనకు దిగారు.

రెండు వారాల క్రితం మొదలైన యుద్ధ వాతావరణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. గాల్వాన్ ఆక్రమణకు ప్రయత్నించిన చైనా, 20 మంది భారత సైనికులను చంపేయగా, భారత జవాన్లు దీటుగా ఎదిరించి, చైనాకు చెందిన పదుల సంఖ్యలో సైనికులను హతమార్చారు. చైనా సైనికుల సంఖ్య ఈ ప్రాంతంలో పెరుగగా, ఇండియా తన ఫైటర్ విమానాలతో విన్యాసాలు చేయించింది.

తాజాగా, సరిహద్దుల్లో చెక్ పాయింట్ల సంఖ్యను పెంచిన చైనా, మిలటరీ కార్యకలాపాలను పెంచింది. లేహ్ రోడ్లపై ఇండియా సైనిక వాహనాల సంఖ్య భారీగా ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇరు దేశాలకూ సరిహద్దుగా ఉన్న ఈ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో సైనికులు మోహరిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Next Story
Share it