Sneha TV
న్యూస్

సర్కారు ఆగ్రహం...హైదరాబాద్ పబ్‌లు, బార్లు క్లోజ్ అయినట్లేనా?

X

హైదరాబాద్‌లో పార్టీ కల్చర్ గురించి పరిచయం అవసరం లేదు. బడాబాబులు, వారి పిల్లలు, నగరంలోని ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలకు వీకెండ్ చిరునామా పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లే. అయితే, ఈ జల్సా రాయుళ్లు, వారి సంబరాల పరంపరతో ఇతరులకు తలనొప్పిగా మారుతున్నారనే ఆరోపణలు ఎంతో కాలంగా ఉన్నాయి. ఈ పర్వంలో తాజాగా కీలక నిర్ణయం వెలువడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ల్లో పబ్‌లు, రెస్టారెంట్ల ముందు అడ్డదిడ్డంగా కార్లను నిలుపుతూ సాధారణ ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్వాహకులపై పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ల్లోని రోడ్ నంబర్ 36, 45, 46, 33ల్లోని పబ్‌ల ముందే కాకుండా అంతర్గత రహదారుల్లో ఇష్టం వచ్చినట్టు కార్లను నిలుపడం వల్ల స్థానికులు తీవ్ర ఇ బ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో రాత్రిపూట ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్నదని కొందరు ప్రభుత్వానికి తెలిపారు. కేవలం పబ్‌లు, బార్లే కాకుండా కొన్ని ఆహారశాలలు ఫుట్‌పాత్‌లను ఆక్రమించడం వల్ల పాదచారులు రోడ్ల మీదే నడువాల్సిన దుస్థితి నెలకొంటుందనే విషయం సైతం సర్కారు దృష్టికి గత కొంతకాలంగా వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ఘాటుగా స్పందించారు.

నిబంధలను ఉల్లంఘించిన పబ్‌లు, రెస్టారెంట్లను తక్షనమే తనిఖీ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్‌ను అరవింద్‌కుమార్ ఆదేశించారు. తగిన పార్కింగ్ ఏర్పాట్లు లేకుండా పబ్‌లు, రెస్టారెంట్లను నిర్వహిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. 14 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని తెలిపారు. ఈ లెక్కన ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటే...త్వరలోనే హైదరాబాద్‌లోని కొన్ని పబ్‌లు, బార్లకు తాళం పడటం ఖాయమే. ఏం జరగనుందో వేచిచూద్దాం!

Next Story
Share it