Sneha TV
న్యూస్

దేశానికి ఎలాంటి నాయకత్వం కావాలి....?

X

తమిళనాడులో పరిణామాలు యువతరంలో అనేక ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి వారా మన దేశాన్ని, రాష్ట్రాలను పాలించేదీ... అని ప్రశ్నిస్తున్నారు. ఏండ్ల తరబడి అమలవుతున్న నూతన ఆర్థిక విధానాలు రాజకీయ రంగంలోనూ పెనుమార్పులు తీసుకొచ్చాయి. రాజకీయాన్ని వ్యాపారంగానూ, ఓట్లను సరుకుగానూ మార్చేశాయి. ఇప్పుడు రాజకీయ రంగంలో కనిపించే అనేక దుర్లక్షణాలు దాన్నుండి పుట్టినవే. అవినీతీ, అక్రమ సంపాదనా రాజకీయానికి పర్యాయ పదాలుగా మారిపోతున్నాయి. పాలక పార్టీల్లో మనకు ప్రధానంగా రెండు రకాల నాయకులు కనిపిస్తున్నారు. ఒకటి కార్పొరేట్‌ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, రెండు రాజకీయ కుటుంబాల నుంచి వారసత్వంగా వస్తున్న యువ నాయకత్వం. పాతికేండ్లకు ముందు కూడా డబ్బున్న వాళ్లు రాజకీయాల్లోకి వచ్చేవారు.

ఆనాడు బయట సంపాదించుకొని, ఆ డబ్బు ఖర్చు పెట్టి రాజకీయాల్లో నిలబడేవారు. ప్రజాభిమానం చూరగొనటానికి ముందుగా ఎంతో కొంత పని కూడా చేసేవారు. సంపాదించుకున్న దాన్ని రాజకీయాల్లో కరగదీసి అప్పులపాలై దివాలెత్తిన వారూ ఉన్నారు. తిరిగి రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి అవినీతికి పాల్పడేవారు. కానీ ఈరోజు జరుగుతున్నది తద్విరుద్ధం. ఇప్పుడు సంపాదించుకోవడానికే రాజకీయాల్లోకి వస్తున్నారు. ప్రజలకు సేవ చేయడానికి పెట్టే ఖర్చును కూడా పెట్టుబడిగా చూస్తున్నారు. ఇలాంటి మార్పునే అమెరికాలో నిర్మొహమాటంగా ''రాజకీయ వ్యాపారం'' (పొలిటికల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌) అంటున్నారు. పరిశ్రమలో పెట్టినట్టుగానే రాజకీయాల్లో కూడా పెట్టుబడి పెడుతున్నారు.
గత పాతికేండ్లలో ఇలాంటి వాళ్లు అనేకమంది రాజకీయాల్లోకి దిగుమతయ్యారు. ఎక్కడెక్కడ నుంచో సూట్‌కేసులతో హఠాత్తుగా దిగుతున్నారు. రాత్రికి రాత్రి నాయకులైపోతున్నారు. అత్యంత ఆధునిక పద్ధతులు, మార్కెటింగ్‌ ఏజెన్సీల ద్వారా సర్వే చేయించుకొని ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ తరపున పోటీ చేస్తే గెలుస్తామో నిర్ణయించుకుంటారు. అక్కడున్న రాజకీయ సామాజిక పొందికలను బట్టి ఒకేసారి రెండు మూడు పార్టీల నుంచి టికెట్‌ కోసం ప్రయత్నిస్తారు. ఆయా గ్రామాల్లో, వార్డుల్లో ఉండే స్థానిక నాయకులనూ, కుల పెద్దలనూ గుర్తించి వారి ద్వారా ముఠాలను కూడగట్టుకోవడానికి, ప్రచారం చేయడానికి ముందుగానే డబ్బు ముట్టజెబుతారు. తమ పేరుతో బోర్లూ రోడ్లూ వేయించటం, కాల్వలు తవ్వించటం, కమ్యూనిటీ హాల్స్‌ కట్టించటం చేస్తారు. దీనంతటినీ వారు ''ఉచితసేవ''గా భావించరు. రాజకీయాలపై పెట్టుబడిగా చూస్తారు. గెలిచిన తరువాత దీనికి ఎన్ని రెట్లు సంపాదించుకోగలమని ముందుగానే అంచనాలు వేసుకుంటారు. దీనికి ఏ విలువా, నీతి నియమాలూ ఉండవు. గెలిచిన తరువాత హామీలను తుంగలో తొక్కి పై నుంచి కింద వరకు పర్సంటేజీలకే ప్రాధాన్యతనిస్తారు. ఇదే నీతిని కింది వారికి కూడా నేర్పించి తింటే తిన్నారు మనకు పని చేస్తే చాలు అనే స్థితికి తీసుకొస్తారు. తద్వారా అవినీతికి సామాజిక ఆమోదాన్ని పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలు ఆదర్శంగా ఉండాలనుకునే యువతరం ఈ స్థితిని చూసి నిరాశకు లోనవుతున్నది. ఈ నిరాశా నిస్పృహలనే గత ఎన్నికల్లో మోడీ తనకనుకూలంగా చక్కగా వాడుకున్నారు.
ఇక రెండో రకం నాయకులు నేరుగా పైనుంచి ఊడిపడుతున్నారు. అప్పటికే రాజకీయాల్లో నిలదొక్కుకున్న తమ తండ్రులు, తాతల వారసత్వాన్ని ఉపయోగించుకొని యువ నాయకులుగా రంగంలోకి వస్తున్నారు. ఆయా పార్టీల్లో ఎంతోమంది సమర్థులైన యువ నాయకులున్నప్పటికీ, అలాంటి వారిని పక్కన పడేసి, తొక్కేసి తమ పుత్రరత్నాలకు పట్టం కడుతున్నారు. తమ కిందనున్న నాయకుల పిల్లల్ని వీరి టీమ్‌కు జోడిస్తున్నారు. వీరికి ఎలాంటి రాజకీయ చరిత్రా ఉండదు. ప్రజలకు సేవ చేయాలనుకునే యోచనా ఉండదు. తల్లిదండ్రుల పేరు, పెత్తనం, డబ్బూ ఉపయోగించి దందాలు చేస్తుంటారు. చదువుల్లో రాణించకపోయినా అల్లరి చిల్లర బ్యాచ్‌ను వెంటేసుకొని క్లబ్బులు, పబ్బులు, రేసులంటూ తిరుగుతూ విష సంస్కృతి వెదజల్లుతుంటారు. ఇలాంటి పిల్లలు అనేకమంది ఇటీవల యాక్సిడెంట్లు, రేప్‌లు, మర్డర్ల వంటి కేసుల్లో ఇరుక్కొని పలుకుబడితో బయటపడుతున్న వైనం చూస్తున్నాం. వీధి నుంచీ రాజధాని వరకూ మన కండ్ల ఎదురుగా ఇలాంటి పుత్రరత్నాలు కనిపిస్తూనే ఉన్నారు. ఏ పట్టణంలో చూసినా ఇలాంటి వారి ఫ్లెక్సీలే దర్శనమిస్తుంటాయి. సెలబ్రిటీలుగా టీవీ ఇంటర్వ్యూల్లో కనిపిస్తుంటారు.
ఇప్పుడు అందరి ఆలోచనా దేశానికి మంచి నాయకత్వం రాదా అనే వైపు సాగుతున్నది. ఆర్థిక రంగంలో సంక్షోభం పెరగడం, నిరుద్యోగం, అసమానతలు పెరిగిపోవటం, అవినీతి, నల్లధనం ఊపందుకోవడంతో నీతి గల నాయకత్వం కోసం ఎదురు చూపులు సాగుతున్నాయి. దేశానికి కావాల్సిన మంచి నాయకత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? స్వాతంత్య్రోద్యమంలో బ్రిటిష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా నాయకత్వం పుట్టుకొచ్చింది. నాటి భూస్వాములు, బడా వ్యాపారులకు ప్రతినిధిగా కాంగ్రెస్‌ ఉన్నా, దాని నాయకత్వం గాంధీ అయినా, నెహ్రూ అయినా, పటేలైనా రాజకీయాదర్శాలను పాటించేవారు. ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడి భగత్‌ సింగ్‌, అల్లూరి సీతారామరాజు, సుభాష్‌ చంద్రబోస్‌ వంటి వీరులు పుట్టుకొచ్చారు. అంబేద్కర్‌ వంటి మహనీయులు జన్మించారు. నాడు, నేడు కూడా ఇలాంటి వారి నుంచి యువతరం స్ఫూర్తి పొందుతున్నది. ప్రత్యామ్నాయ రాజకీయాలకు ప్రతినిధిగా నాటి స్వాతంత్య్ర పోరాటాల నుంచే కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది. సుందరయ్య, నంబూద్రిపాద్‌, ఎకె గోపాలన్‌, జ్యోతిబసు, చండ్ర రాజేశ్వరావు వంటి ఆణిముత్యాలు నేటికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నారు.
విద్యార్థి దశలో మంచి ఇంజనీరో, డాక్టరో, లాయరో, శాస్త్రవేత్తో కావాలని కోరుకున్నట్టుగా, మంచి ఉద్యమకారులు కావాలని కోరుకునే వారు కూడా ఉండేవారు. ఇలాంటి వారు విద్యార్థి సంఘాల్లో చేరి సమస్యలపై ఉద్యమాలు నిర్మించేవారు. ''చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు'' 70, 80లలో మార్మోగిన ఒక నినాదం. మంచి అలవాట్లు, నిరాడంబర జీవితం, నీతీ నిజాయితీ, ఆడవారి పట్ల గౌరవం, ప్రజలంటే నమ్రత, పేదవారి పట్ల దయ, సమాజంలోని అసమానత, అన్యాయాలపై ఆక్రోశం, ఆగ్రహం వారికి ఆభరణాలుగా ఉండేవి. విద్యా సంస్థల్లో ప్రజాస్వామికంగా ఎన్నికలు పెట్టి విద్యార్థి నాయకులను ఎన్నుకునే వారు. ఆయా సంఘాలూ నాయకులూ చేసిన కృషిని బట్టి ఎన్నికయ్యే వారు. విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంచడంలో ఈ ఎన్నికలు తోడ్పడేవి. దేశానికి కావాల్సిన భావినాయకత్వం ఇక్కడ రూపుదిద్దుకునేది. ఇప్పుడు వివిధ పార్టీల్లో సీనియర్‌ నాయకులుగా ఉన్న అనేకమంది ఆనాడు విద్యార్థి సంఘాల ద్వారా రంగ ప్రవేశం చేసినవారే. ఇప్పుడు ఎన్నికలు లేవు. విద్యా సంస్థల్లో ప్రజాస్వామిక వాతావరణం కూడా తగ్గిపోయింది. సిద్ధాంతాలు, రాజకీయాల పట్ల వ్యతిరేక భావం అలముకుంది. శైశవదశలో స్కూల్‌లో అడుగుపెట్టే ముందు నుంచే పిల్లల సంపాదనకు ఒక ట్యాగ్‌ కట్టి పంపిస్తున్నారు. ఏ కోర్సు చేస్తే ఎంత సంపాదించు కోవచ్చు, దానికున్న అవకాశాలేంటీ... అన్న దాని చుట్టూనే వారి ఆలోచనలు తిరుగుతాయి. ఈ దశలో రాజకీయాల్లోకి రావాలని ఎవరూ కోరుకోవడం లేదు. అందు వల్లే ఈరోజు రాజకీయ వ్యవస్థలో మంచి నాయకత్వానికి శూన్యత ఏర్పడింది. ఈరోజు దేశంలో సమర్థులైన ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, శాస్త్రవేత్తలు, నటీనటులు, మేనేజర్లు, ఫైనాన్షియర్లు, చివరకు చురుకైన బ్రోకర్లు కూడా ఉన్నారు. కానీ మంచి రాజకీయ నాయకులే లేరు. ఈ శూన్యాన్ని పూడ్చేందుకు నవతరం రాజకీయాల్లోకి రావాలి. పైన పేర్కొన్న అనేక రంగాల్లో మంచి ప్రతిభ ఉన్న వారి భవితవ్యాన్ని తేల్చేది రాజకీయమే. అలాంటి రాజకీయ రంగానికి మంచి నాయకుల అవసరం ఎంతైనా ఉంది. మంచివారు రాజకీయాలకు దూరంగా ఉంటున్నందువల్లే స్వార్థపరులు దీన్ని ఆక్రమించారు.
గత పాతికేండ్లలో పాలకులు ఉద్దేశపూర్వకంగానే విద్యార్థులను రాజకీయాలకు దూరంగా ఉంచుతూ వచ్చారు. విద్యా సంస్థల్లో ఎన్నికలు నిషేధించారు. విద్యార్థి ఉద్యమాలపై ఉక్కు పాదం మోపారు. సంపన్నులు, మధ్యతరగతిలో చదువులో ఉన్నతంగా ఉండేవారంతా కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో చేరుతున్నారు. సామాజికంగా వెనుకబడిన తరగతుల్లోని విద్యావంతుల కుటుంబాలవారు కూడా అక్కడే చేర్చుతున్నారు. అక్కడ బట్టీలు పట్టి ర్యాంకులు సంపాదించడం తప్ప మరో పొడగిట్టదు. ఆటలు, పాటలు ఉండవు. సాహిత్య సమాలోచనలు జరగవు. రాజకీయ చర్చలను అనుమతించరు. పత్రికలను చదవనివ్వరు, టీవీలు చూడనివ్వరు. ఒక్కమాటలో చెప్పాలంటే వారికి బయట ప్రపంచంతో సంబంధమే ఉండదు. వీరికన్నా జైల్లో ఖైదీల పరిస్థితే మెరుగ్గా ఉంటుంది. ఇలాంటి వారు ఒక్కసారి స్వేచ్ఛా ప్రపంచంలోకి రాగానే దారితప్పి పోతున్నారు. కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ప్రజాస్వామిక వాతావరణం ప్రవేశిస్తేనే దేశానికి మంచి నాయకత్వం లభిస్తుంది. కొంత మంది సామాజిక వివేచన ప్రదర్శించినా, సంపాదన కోసమో, కెరీర్‌లో నైపుణ్యం కోసమో విదేశాలకు వెళ్లిపోతున్నారు. అక్కడ బహుళజాతి కంపెనీల్లో ఉన్నత స్థానాలకు కూడా ఎగబాకుతున్నారు. ఆ రకంగా కార్పొరేట్‌ విద్యా సంస్థల నుంచి సమర్థవంతమైన కార్పొరేట్‌ వ్యాపార నాయకత్వం తయారవుతోంది.
ఇప్పుడు నాయకత్వమంటే కార్పొరేట్‌ నాయకత్వంగా అర్థం మారిపోయింది. రాజకీయ నాయకులు సైతం తమ పిల్లలను హార్వర్డు, ఆక్స్‌ఫర్డ్‌ వంటి విద్యా సంస్థల్లో చేర్పించి, అక్కడ వ్యాపార సూత్రాలు, రహస్యాలు తెలుసుకున్నాక ఇక్కడ రాజకీయాల్లోకి దించుతున్నారు. తద్వారా రాజకీయాలను మంచి వ్యాపారంగా మార్చటంలో వారు నిష్ణాతులవు తున్నారు. రాజకీయ రంగంలోనే కాదు, ఇతర రంగాల్లో కూడా మంచి నాయకత్వం లోపించింది. డాక్టరై ప్రజలకు సేవ చేయటం, ఇంజనీరై దేశానికి సేవ చేయటం అనే ఆలోచనలే దరిదాపుల్లో లేవు. అలాంటి ఆలోచనలున్నవారిని కూడా అనుమతించటం లేదు. ఈ రోజు ఏ వృత్తికైనా ప్రజలను పీల్చి పిప్పిచేసి లాభాలు దండుకోవడమే పరమావధిగాఉంటున్నది. తద్వారా విద్య, వైద్య రంగాలు ప్రజలకు మరింత దూరమైపోయాయి. ఆ రంగాలకు ఉండాల్సిన సామాజిక స్పృహ లోపించింది. ఈ వ్యాపార ధోరణినే ప్రభుత్వ విధానాలు మరింత ప్రోత్సహిస్తున్నాయి. ఒక రకంగా ఈ రోజు దేశంలో అన్ని రంగాలకూ మంచి నాయకత్వం కావాలి. వృత్తి నైపుణ్యంతో పాటు సామాజిక స్పృహ, ప్రజాస్వామిక చైతన్యం కలిగినవారు కావాలి. అలాంటి నాయకత్వాన్ని తయారు చేసే నిలయాలుగా విద్యా సంస్థలుండాలి. అలాంటి సరికొత్త విద్యా వ్యవస్థ కోసం యువతరం పోరాడాలి. ఈ పోరాటాల నుంచే దేశానికి అంకితభావం, అభ్యుదయ భావాలు కలిగిన మంచి నాయకత్వం లభిస్తుంది. తాజా ప్రపంచ అనుభవం కూడా ఇదే చాటిచెబుతున్నది.

Next Story
Share it