Sneha TV
న్యూస్

నిరుద్యోగపు నిజాలూ, అధికారిక అబద్ధాలూ...

X

తెలంగాణలో ఎందరు నిరుద్యోగులున్నారు? తెలంగాణ ప్రభుత్వం గత ముప్పై రెండు నెలల్లో ఎన్ని ప్రభుత్వోద్యోగాలు కల్పించింది? ఎన్ని ప్రైవేటురంగ ఉద్యోగాల కల్పనకు అవకాశాలు ఇచ్చింది? ఎంత చిన్న ప్రశ్నలు! కాని ఎంత వివాదాస్పదమై పోయాయి?! ఇవేమీ జటిలమైన, జవాబు చెప్పడం అసాధ్యమైన, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానపు ప్రశ్నలు కావు. అవి మూడూ కచ్చితమైన, నిర్ద్వంద్వమైన అంకెలు. ఏదీ వాస్తవంగా ఉన్నదానికన్న ఒకటి ఎక్కువ గాని ఒకటి తక్కువ గాని చెప్పడం కుదరని అంకెలు. ప్రభుత్వ, ప్రభుత్వేతర, పారిశ్రామిక, సేవా రంగ సంస్థల పత్రాలను, ప్రకటనలను పట్టుకుని నిశితమైన, నిజాయితీ పూర్వకమైన పరిశోధన చేస్తే ఆ మూడు అంకెలూ రాబట్టవచ్చు.
కాని గత కొద్ది వారాలుగా, మరీ ముఖ్యంగా నిరుద్యోగుల ఆందోళనతో, హైదరాబాదులో ఫిబ్రవరి 22న నిర్వహించనున్న నిరుద్యోగుల నిరసన ప్రదర్శన సందర్భంగా ఈ అంకెల మీద పాక్షిక అంచనాలు, అనవసరమైన గందరగోళం చాల జరుగుతున్నది.

ఈ విషయంలో కచ్చితమైన గణాంకాలు ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉండే అవకాశం ఉంది గాని ప్రభుత్వం వాటిని నిజాయితీగా బైటపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు కనబడడం లేదు. నిరుద్యోగులూ, వారి తరఫున తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఒకరకమైన అంకెలు ప్రకటిస్తుండగా, ప్రభుత్వం తరఫున అధికారికంగానో, అనధికారికంగానో మరొక రకమైన అంకెలు వెలువడుతున్నాయి. ఒకరి అంకెలను మరొకరు అపహాస్యం చేస్తున్నారు. జాగ్రత్తగా పరిశీలిస్తే నిరుద్యోగ పక్షపు అంకెలు అటూ ఇటూగా వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టున్నాయి. మంత్రులూ, శాసనసభ్యులూ, ప్రభుత్వ అధికార, అనధికార ప్రతినిధులూ చెపుతున్న అంకెలలో విస్మరణ, అతిశయోక్తి మాత్రమే కాదు, అవి సాధారణంగా అబద్ధానికి దగ్గరగా ఉన్నట్టున్నాయి. ఇంకా ప్రభుత్వం తరఫున, ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వెలువడుతున్న గణాంకాలలో విచిత్రంగా ఒకే వ్యక్తి చేసిన వేర్వేరు ప్రకటనల్లో వేర్వేరు అంకెలు, ఒకే పత్రికలో వేర్వేరు వార్తల్లో వేర్వేరు అంకెలు కనబడుతున్నాయి. నిజం ఎప్పుడైనా ఒకేలా ఉంటుంది గాని అబద్ధం ఎన్నిసార్లు చెపితే అన్ని వంకరలు తిరుగుతుందనే నానుడి నిజమవుతున్నది.
ఇంతకీ మొదటి ప్రశ్న తెలంగాణలో నిరుద్యోగం ఉన్నదా లేదా? అసలు లేదనేంత, ఈ రెండున్నరేండ్లలో మాసిపోయింద నేంత తీవ్రవాదాన్ని కూడ కొందరు ప్రదర్శిస్తున్నారు గాని దాన్ని పట్టించుకోనక్కరలేదు. గత ప్రభుత్వాలలో లేదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అందువల్లనే గత ప్రభుత్వాలను విమర్శించి, పదవీచ్యుతులను చేయడం జరిగింది. ఇవాళ కాకపోతే రేపు రావా, ఓపిక లేదా, ఇప్పుడే పుట్టిన బిడ్డమీద ఒత్తిడా అని సవాళ్లు విసురుతున్నారు గాని, ఓపిక ఉండాలో లేదో నిర్ణయించవలసినది భద్రమైన ఉద్యోగంలో ఉన్నవాళ్లు కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ప్రతిక్షణం ఆశనిరాశల మధ్య విసిగి వేసారుతున్న నిరుద్యోగులు. కోచింగ్‌ల పేరిట వెలిసిన పక్కా వ్యాపార సంస్థలకు కోట్ల రూపాయలు కట్టబెడుతూ నిత్యవంచితులుగా ఉన్న నిరుద్యోగులు. వయసు పెరిగినా ఉద్యోగం రాక, ఇంకా తల్లిదండ్రులను డబ్బులు అడిగి అవమానపడటం ఇష్టం లేని అభిమానధనులైన నిరుద్యోగులు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయనే వాగ్దానాలను నమ్మిన అమాయక నిరుద్యోగులు.
వాళ్లు ఎంతమంది ఉండవచ్చు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఆ అంకె పది లక్షల పైన. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దగ్గర నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య చూస్తే పదమూడు లక్షల పైన. ఈ రెండు చోట్ల నమోదు కాని నిరుద్యోగుల సంఖ్య, వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగంలో ఉన్నవారి సంఖ్య, చాలీచాలని చిరుద్యోగాలు చేస్తున్నవారి సంఖ్య కలిపితే మరొక పది లక్షలు ఉన్నా ఆశ్చర్యం లేదు. ఈ నిరుద్యోగ పరిమాణాన్ని తక్కువ చేసి చూపడానికి ప్రభుత్వ పత్రాలు ఎన్ని అంకెల గారడీలు చేసినప్పటికీ, ఉద్యోగం చేయగల వయసులో ఉన్న జనాభా రెండు కోట్ల ఇరవై లక్షల మంది కాగా కనీసం ఇరవై రెండు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అంగీకరించక తప్పదు. అంటే ప్రతి పది మంది ఉద్యోగార్హులలో ఒకరు నిరుద్యోగంతో ఉన్నారని అర్థం. అర్థశాస్త్ర విశ్లేషణల ప్రకారం ఇది చాల తీవ్రమైన, విస్పోటటకమైన నిరుద్యోగం.
అంకెల్లో, ఆర్థికవ్యవస్థ దృష్టితో చూసినా చూడకపోయినా తెలంగాణ సమాజం కళ్లముందర నిరుద్యోగం కనబడుతున్నది. స్వరాష్ట్రం వస్తే ఈ నిరుద్యోగ సమస్య తగ్గుతుందని తెలంగాణ సమాజం భావించింది. తగ్గిస్తామని రాజకీయ నాయకత్వం వాగ్దానాలు చేసింది. అందువల్లనే ఉద్యోగ కల్పన ఎంత జరిగిందనే అంశం ఇవాళ ఇంత చర్చనీయాంశం అవుతున్నది. ఎన్ని ప్రభుత్వోద్యోగాలు కల్పించామో లెక్క చెప్పడం అసాధ్యమైన విషయమేమీ కాదు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్లు, నియామకాలు, ఆయా శాఖల నియామకాలు అన్నీ బహిరంగంగా, పారదర్శకంగా జరిగినవే, జరగవలసినవే. జరిగినదాన్ని ఎవరూ దాచిపెట్టలేరు, జరగనిదాన్ని ఎవరూ చూపెట్టలేరు. కాని ప్రభుత్వ భజనపరులు టంగుటూరి మిరియాలు తాటికాయలంత అని సామెత చెప్పినట్టుగా నియామకాల అంకెలు ప్రకటిస్తున్నారు. ఖాళీల సంఖ్యను, ప్రభుత్వం ఆమోదించిన సంఖ్యను, నియామక ప్రక్రియ ప్రారంభమైన ఉద్యోగాల సంఖ్యను, భవిష్యత్తులో ప్రక్రియ ప్రారంభమయ్యే సంఖ్యను, బహుశా తమ మనసులో ఉన్న సంఖ్యను అన్నీ కలిపి ముద్ద చేసి ఒక బ్రహ్మాండమైన అంకె తయారు చేస్తున్నారు. ఈ వంటకం ఎంత దూరం పోయిందంటే మొత్తం జరిగిన ఉద్యోగకల్పన అంకెను ఒక పత్రిక ఒకే పేజీలో పైవార్తలో ప్రభుత్వోద్యోగాలు 35 వేలు, ప్రైవేటు ఉద్యోగాలు 43 వేలు అని రాసి, కిందివార్తలో మొత్తం ఉద్యోగాలు 63 వేలుగా రాసింది. ఇంతకీ ఆ వార్తల్లోనే ఈ అంకెలు రెండూ కూడ జరిగిన నియామకాలు కావని, అందులో అనుమతులు జారీ అయినవీ, నోటిఫికేషన్లు వచ్చినవీ, పరీక్షలు జరిగినవీ, ఏడాదిగానో అంతకన్న ఎక్కువో వేచి చూస్తున్నవీ, ప్రైవేటు పరిశ్రమల్లో వచ్చినవీ అన్నీ ఉన్నాయని తేటతెల్లమవుతుంది. వాస్తవ గణాంకాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నియామక ఉత్తర్వులు ఇచ్చినవి 4,295. సింగరేణి, విద్యుత్‌ వంటి సంస్థలలో కొత్త నియామకాలు గాని, కాంట్రాక్టుల క్రమబద్ధీకరణ గాని 7,181. పోలీసు శాఖ పరీక్ష జరిగి చాల కాలం అయ్యాక, ప్రస్తుత ఆందోళన నేపథ్యంలో ఫలితాలు ప్రకటించినవి 10,500. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఫలితాలు రావలసినవి 1,645. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తుందని ఆశిస్తున్న ఉద్యోగాలు 3,400. వివాదంలో పడి, ఆగిపోయిన గురుకులాల ఉపాధ్యాయుల సంఖ్య 7,300. అంటే మొత్తంగా జరిగిన నియామకాలు, చివరిదశలో ఉన్న నియామకాలు 22 వేలు. సమీప భవిష్యత్తులో ప్రకటించనున్న ఉద్యోగాలు 12 వేలు. 2014 నవంబర్‌ 24న శాసనసభావేదిక మీద ముఖ్యమంత్రి స్వయంగా ''రానున్న రెండు సంవత్సరాలలో 1,07,744 ప్రభుత్వోద్యోగాల ఖాళీలు నింపుతామ''ని వాగ్దానం చేశారు. రెండు సంవత్సరాలు గడిచాయి గాని వాగ్దానం చేసిన అంకెలో ఐదో వంతు జరిగింది, మరొక ఆరో వంతు ఎప్పటికవుతుందో తెలియని స్థితి ఉంది.
అందరూ ప్రభుత్వోద్యోగాలు కావాలంటే ఎలా అని కూడ ప్రభుత్వ సమర్థకులు నిలదీస్తున్నారు. నిజమే. ప్రభుత్వమే తన కర్తవ్యాన్ని ఇంత మహత్తరంగా నిర్వహిస్తున్నప్పుడు, ప్రైవేట్‌ రంగ ఉద్యోగ కల్పన మరెంత మహత్తరంగా ఉన్నదో చూడవలసిందే. కొన్ని వారాల కింద స్వయంగా ఒక మంత్రి గారు తమ ప్రోత్సాహం వల్ల తెలంగాణలో ప్రవేశించిన భారీ పెట్టుబడులు రెండు లక్షల యాబై ఎనిమిది వేల ఉద్యోగాలు కల్పించాయని అన్నారు. కాని ప్రస్తుతం ప్రభుత్వ అధికార పత్రిక ప్రైవేటు రంగంలో జరిగిన ఉద్యోగ కల్పన 43 వేలు అంటున్నది. అసలు ప్రైవేటు రంగ పరిశ్రమలు తెలంగాణ నిరుద్యోగులలో ఎందరికి ఉద్యోగం కల్పించాయి, ప్రైవేటు పరిశ్రమలలో ఉద్యోగాలు రావడానికీ తెలంగాణ నిరుద్యోగ సమస్య పరిష్కారానికీ సంబంధమేమిటి వంటి ప్రశ్నలు కూడ వేయవచ్చు గాని అసలు వేరు వేరు సందర్భాలలో వేరు వేరు అంకెలు చెప్పడమే గుర్తించవలసిన అంశం. వీటిలో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో వారికే తెలియాలి. తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రజలు పారదర్శకమైన నిజాలు కోరుకున్నారు గాని ఏలినవారు మాత్రం పారదర్శకమైన అబద్ధాలు చెప్పినా ప్రజలను పక్కదారి పట్టించగలమని అనుకుంటున్నట్టున్నారు.ఆరు దశాబ్దాల ఆకాంక్షతో, ప్రజా ఉద్యమంతో ఏర్పడిన ప్రభుత్వాన్ని ఇలా అబద్ధాలకోరు అనవచ్చునా అని ఎవరికైనా అనుమానం రావచ్చు. మహా ఘనత వహించిన తెలంగాణ స్వరాష్ట్ర ప్రభుత్వం, పద్నాలుగు సంవత్సరాల పాటు ప్రజా ఉద్యమం నడిపిన రాజకీయ పక్షం నడుపుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రజా ఆకాంక్షల గురించి ఇన్ని అబద్ధాలు ఆడుతుందా అని ఎవరైనా అనుమానించవచ్చు. ఆ అనుమానం ఉన్నవారెవరైనా మరొక సందర్భంలో న్యాయస్థానం ముందర ఈ ప్రభుత్వం ఆడిన మహా అబద్ధాన్ని చూడవచ్చు. నరహంతకుడు, వేల ఎకరాల కబ్జాదారు, మాఫియా నేత నయీం ఇరవై ఏండ్ల పాటు ఎందరెందరు రాజకీయ నాయకుల, పోలీసు అధికారుల సహాయంతో ఆ నేరాలన్నీ చేశాడో తెలియనివారు తెలంగాణలో ఎవరూ ఉండరు. సూర్యోదయం వంటి కఠోర వాస్తవం అది. ఆ వాస్తవాన్ని తారుమారు చేసి, నయీంకు రాజకీయ నేతలతో, పోలీసులతో ఎటువంటి సంబంధాలు లేవు అని న్యాయస్థానం సాక్షిగా కారుచీకటి అబద్ధాన్ని చెప్పగలిగిన ప్రభుత్వం ఉద్యోగకల్పన అనే చిన్న విషయంలో అబద్ధాలు ఆడడానికి సందేహిస్తుందా?

Next Story
Share it