Sneha TV
న్యూస్

ఏసీబీకి చిక్కిన మరో అవినీతి సొరచేప!.

X

ఇటీవల అవినీతి నిరోధక శాఖ చేపట్టిన దాడుల్లో అనేక మంది అధికారులు పట్టుబడ్డారు. ఓ అధికారి రూ.100 కోట్లు కూడబెడితే, మరో అధికారి రూ.500 కోట్ల వరకు ఆస్తులు సంపాదించినట్టు ఏసీబీ దాడుల్లో వెలుగుచూశాయి. తాజాగా మరో అవినీతి సొరచేప ఏసీబీకి చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ బిల్‌ కలెక్టర్‌ నివాసంపై అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహించారు. బిల్ కలెక్టర్ ముద్రబోయిన మాధవ్‌తోపాటు ఆయన బంధువులు, బినామీలకు చెందిన ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. గుంటూరు, పొన్నూరు, మాచవరంలలో ఏకకాలంలో నిర్వహించిన ఈ దాడుల్లో భారీగా ఆస్తులను గుర్తించారు.

భరత్‌పేటలోని బిల్ కలెక్టర్ నివాసంలో సోదాలు సందర్భంగా మాధవ్, ఆయన భార్య రేఖ పేర్లతో నాలుగు అపార్టుమెంట్లలో ఫ్లాట్లు, నాలుగు ఇళ్లు, 20 వరకు స్థలాలు, ఇన్నోవా కారు, మూడు ద్విచక్రవాహనాలు, రూ.7.53 లక్షల నగదు, 200 గ్రాముల బంగారం బయటపడింది. వీటి పుస్తక విలువ రూ.6 కోట్లుగా లెక్కించిన అధికారులు, బహిరంగ మార్కెట్‌లో రూ. 40 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేశారు. వీటితోపాటు ఓ లాకర్ కూడా ఉన్నట్టు గుర్తించిన అధికారులు, అందులో ఏముందోనని ఆరా తీస్తున్నారు. లాకర్ తెరిస్తే మరింత సంపద బయటపడే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే ఓ గదికి సరిపోయేలా ఖరీదైన చీరలు, ఇతర వస్త్రాలను కనుగొన్నారు.

ఏసీబీ డీఎస్పీ దేవానంద్‌శామ్‌ నేతృత్వంలో అధికారులు తొమ్మిది బృందాలుగా ఏర్పడి ఈ సోదాలు నిర్వహించారు. మాధవ్ చేసేది బిల్ కలెక్టర్ ఉద్యోగమే అయినా, ప్రవృత్తి మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం. రెండు చేతులా సంపాదిస్తూ ఆరేళ్లలో కోట్లకు పడగలెత్తడం ఆధికారులను విస్మయానికి గురిచేసింది. 2012లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ బిల్ కలెక్టర్‌గా చేరి, ఆరేళ్ల నుంచి అక్కడే విధులు నిర్వహిస్తున్నాడు. ఓ చిరుద్యోగి అందులోనూ ఉద్యోగంలో చేరిన ఆరేళ్లలో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు కలిగి ఉండటంతో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it