Top
Sneha TV

'సవరణ నోటిఫికేషన్'కు సర్వం సిద్ధం...!!

X

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో నియామకాలపై సవరణ నోటిఫికేషన్‌కు సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పలు నిబంధనలు సడలించి.. రెండు, మూడు రోజుల్లో దీన్ని జారీ చేయనున్నారు. నాలుగు సంక్షేమ శాఖలు.. గురుకుల పాలక మండళ్లతో చర్చించిన అనంతరం కొత్త నిబంధనలతో నియామకాలు జరపాలని కోరుతూ తాజాగా టీఎస్‌పీఎస్సీకి లేఖ రాశాయి. దీనికి సంబంధించిన దస్త్రం ముఖ్యమంత్రి వద్దకు చేరింది. ఆయన ఆమోదం తెలిపిన వెంటనే కొత్త నిబంధనలతో దరఖాస్తుకు తేదీలను వెల్లడిస్తూ టీఎస్‌పీఎస్సీ సవరణ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. * పలు రకాల వెసులుబాట్లు గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు మొదట్లో విధించిన నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తంకావడంతో వాటిని సడలించాలని సంక్షేమ శాఖలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

దీనిపై సంక్షేమ శాఖలు కసరత్తు చేసి నిబంధనల్లో మార్పులు చేశాయి. ఎన్‌సీటీఈ నిబంధనల మేరకు అర్హత మార్కులను 60 శాతం నుంచి 50 శాతానికి తగ్గించడంతోపాటు మూడేళ్ల అనుభవం ఉండాలనే నిబంధనను తొలగించడం వంటి వాటిని ఆమోదించారు. అన్ని డిగ్రీల వారికి పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తున్నారు. వయోపరిమితి నిబంధనలు ఇతర నియామకాల మాదిరిగానే వర్తించనున్నాయి. డీఈడీ వారికి పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సంక్షేమ శాఖలు తాజా మార్గదర్శకాలను పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు నివేదించగా.. వాటిని టీఎస్‌పీఎస్సీ అధికారులు సీఎం కార్యాలయానికి పంపించారు. దస్త్రంపై సీఎం సంతకం చేసిన అనంతరం టీఎస్‌పీఎస్సీకి పంపిస్తారు. ఆ వెంటనే సవరణ నోటిఫికేషన్ జారీ అవుతుంది.

Next Story
Share it