Sneha TV
న్యూస్

ఇండోనేసియా ఎన్నికలు: అధ్యక్ష ఎన్నికల నుంచి... స్థానిక సంస్థల వరకు.. బ్యాలెట్‌తో 6 గంటల్లోనే పోలింగ్

X

BBCKarishma ఓటు హక్కు వినియోగించుకున్న మహిళ

మొత్తం 17,000కు పైగా దీవులు... 19.2 కోట్ల మంది ఓటర్లు... 2.45 లక్షల మందికి పైగా అభ్యర్థులు... 20,000 సీట్లు... 8,10,000 పోలింగ్ కేంద్రాలు.. స్థానిక సంస్థల నుంచి దేశ అధ్యక్ష పదవి వరకు... ఒకేరోజు అందులోనూ కేవలం 6 గంటల వ్యవధిలోనే పోలింగ్. అదే రోజు ప్రాథమిక ఫలితాలు కూడా వెలువడుతాయి. ఇది ఇండోనేషియా సార్వత్రిక ఎన్నికల ముఖచిత్రం.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల్లో ఒకటైన ఇండోనేసియా ఎన్నికల పోలింగ్ నేడు జరుగుతోంది.

దేశ అధ్యక్ష పీఠం మొదలుకుని, స్థానిక సంస్థల వరకు ఒకేరోజు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అది కూడా బ్యాలెట్ పద్ధతిలోనే. అందుకోసం ఎనిమిది లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు అంటే ఆరు గంటల పాటు పోలింగ్ ఉంటుంది. అప్పటి వరకు క్యూలో నిల్చున్నవారికి ఆలస్యమైనా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.

పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా చూసేందుకు 20 లక్షల మంది మిలిటరీ, పోలీసులను ఎన్నికల సంఘం వినియోగిస్తోంది.

BBC అంకెల్లో ఇండోనేషియా ఎన్నికలు

అయితే, పోలింగ్ ప్రారంభం కాకముందు నుంచే రిగ్గింగ్‌ ఆరోపణలు దుమారం రేపాయి. గతవారం, పొరుగున ఉన్న మలేషియాలో ఓ గోదాం దగ్గర వేలాదిమంది బ్యాలెట్ పత్రాలు పట్టుకుని బారులుతీరినట్లు కనిపిస్తున్న ఓ వీడియో బయటకు రావడంతో దానిపై ఇండోనేషియా ఎన్నికల సంఘం దర్యాప్తు చేపట్టింది. ఆ గోదాం దగ్గర ఉన్నవారిలో ఎక్కువ శాతం ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడోకు అనుకూలంగా బ్యాలెట్ పత్రాలపై మార్కు చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. మలేషియాలో దాదాపు పది లక్షల మంది ఇండోనేషియన్ ఓటర్లు ఉంటారని అంచనా.

దేశ అధ్యక్ష పదవి, పార్లమెంటు, స్థానిక సంస్థలన్నింటికీ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ఇండోనేసియా చరిత్రలో ఇదే తొలిసారి.

అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడో ముందంజలో ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

పోలింగ్ ముగియగానే రెండు గంటల్లో ప్రాథమిక ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అయితే, తుది ఫలితాలను మాత్రం ఎన్నికల సంఘం మే నెలలో వెల్లడించనున్నారు.

AFP చిన్నచిన్న మారుమూల దీవులకు బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామాగ్రిని తీసుకెళ్లేందుకు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

ప్రధాన సమస్యలు

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి అభివృద్ధి, అవినీతి, ఆర్థిక వ్యవస్థ వంటి విషయాలను అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ఇక్కడి ప్రధానమైన సమస్యల్లో జాతీయ గుర్తింపు ఒకటి.

ఇండోనేసియా జనాభాలో 80 శాతం మంది ముస్లింలే. ఇక్కడ దేశ అధికారిక మతం అన్నది ఏదీ లేదు. ఎవరైనా తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే స్వేచ్ఛ ఉంటుంది.

అయితే, కొంతకాలంగా మతపరమైన గ్రూపులు పెరిగిపోతున్నాయి. 2016లో జకార్తాకు చెందిన బసుకి అనే చైనీస్ క్రిస్టియన్ దైవ దూషణకు పాల్పడి జైలుపాలైన తర్వాత ఇక్కడ మతపరమైన గ్రూపులు మరింత ఎక్కువయ్యాయి.

దాంతో, ఈ ఎన్నికల్లోనూ మతానికి ప్రాధాన్యత పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇస్లాంకు ఎవరు పెద్దపీట వేస్తారు? అన్నదే ఈ ఎన్నికల్లో కీలకమని అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే, ముస్లింల హక్కులను పరిరక్షిస్తామంటూ కొందరు అభ్యర్థులు హామీలు ఇచ్చారు.

అయితే, ఒక ముస్లిం ఓటర్ మాత్రం తాను అభ్యర్థి మతం ఏంటన్నది పట్టించుకోనని బీబీసీతో చెప్పారు.

ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం ఇండోనేసియానే. ఇక్కడ దాదాపు 26 కోట్ల మందికి పైగా ముస్లింలు ఉన్నారు.

Next Story
Share it