Top
Sneha TV

రాజకీయాల్లో మర్యాద అనేది అరుదైన గుణం

X

నిర్మలాసీతారామన్‌ అందుకు ఉదాహరణ అన్న శశిథరూర్‌

తిరువనంతపురం: తులాభారంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ను కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ పరామర్శించారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం కేరళ వెళ్లిన ఆమె.. ఈ ఉదయం తిరువనంతపురం మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి వెళ్లి శశిథరూర్‌ను కలిశారు. నిర్మలా సీతారామన్‌ రాక పట్ల శశిథరూర్‌ కృతజ్ఞత తెలిపారు. రాజకీయాల్లో మర్యాద అనేది చాలా అరుదుగా కన్పిస్తుందని, దానికి రక్షణ మంత్రి ఉదాహరణ అని కొనియాడారు.

'కేరళ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నప్పటికీ నిర్మలా సీతారామన్‌ ఆసుపత్రికి వచ్చి నన్ను పరామర్శించడం ఆనందంగా ఉంది. భారత రాజకీయాల్లో మర్యాద అనేది అత్యంత అరుదుగా కన్పించే గుణం. అందుకు ఈమె ఉదాహరణగా నిలిచారు' అని శశిథరూర్‌ ట్వీట్ చేశారు.

కేరళ నూతన సంవత్సరాది విషు పర్వదినాన్ని పురస్కరించుకుని శశిథరూర్‌ సోమవారం స్థానిక ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం తులాభారం మొక్క తీర్చుకుంటుండగా ఒక్కసారిగా త్రాసు గొలుసు ఊడిపోవడంతో ఆయన ప్రమాదానికి గురయ్యారు. త్రాసు పైన ఉండే బరువైన ఇనుప కడ్డీ ఆయన తలమీద పడటంతో శశిథరూర్‌ గాయపడ్డారు. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.

Next Story
Share it