Top
Sneha TV

టీడీపీ పోరాటం వల్లే వీవీప్యాట్‌లు తీసుకొచ్చారు: యనమల

X

అమరావతి: టీడీపీ పోరాటం వల్లే వీవీప్యాట్‌లు తీసుకొచ్చారని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఎమ్మెల్సీగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ షరీఫ్... యనమల చేత ప్రమాణం చేయించారు. అనంతర ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఉండాలన్నారు. అనేక దేశాలు ఈవీఎంలు అమలు చేసి తర్వాత వెనక్కి తగ్గాయని చెప్పారు. టెక్నాలజీలో జపాన్ ముందున్నా.. అక్కడ ఈవీఎంల వాడకాన్నీ నిషేధించారని పేర్కొన్నారు. 2014లో ఈవీఎంల వాడకాన్ని టీడీపీ వ్యతిరేకించందన్నారు. టెక్నాలజీ వాడకం పెరిగినప్పుడు ఈవీఎంలు హ్యాక్ చేయడం సులభతరం అయిపోతుందన్నారు. ఈవీఎంలపై ఒక్క టీడీపీనే పోరాటం చేయడం లేదన్నారు. అనేక రాజకీయ పక్షాలు ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నాయని వెల్లడించారు.

రెండోసారి ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెట్టే అవకాశం ఇచ్చిన చంద్రబాబుకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 1982 సంవత్సరం మొదటిసరిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు తెలిపారు. ఎన్టీఆర్ మొదటి కేబినెట్‌లోనే మంత్రిగా పని చేసినట్లు గుర్తుచేశారు. 1982 నుంచి 2009 వరకు శాసనసభలో ఉండే అవకాశం వచ్చిందని వెల్లడించారు. 43 సవత్సరాల పాటు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండే అవకాశం దక్కిందని వ్యాఖ్యానించారు. 43 సవత్సరాల్లో అనేక పదవుల్లో పని చేసినట్లు గుర్తుచేశారు. స్పీకర్‌గా ఉన్న సమయంలో దేశంలో మొదటి సారిగా ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు స్పష్టంచేశారు. శాసనసభ, మండలి సంప్రదాయాలను, గౌరవాలను సభ్యులు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. శాసన సభలో.. మండలిలో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని విన్నవించారు. బాయ్‌కాట్‌లు చేయడం, సభలో గొడవలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.

Next Story
Share it