Top
Sneha TV

ఆడ్వాణీ కుమార్తెను బరిలోకి దింపుతారా?

X

దిగ్విజయ్‌పై ప్రతిభా ఆడ్వాణీని నిలబెట్టే యోచనలో భాజపా

భోపాల్‌: వయోభారం రీత్యా భాజపా వ్యవస్థాపకుడు ఎల్‌కే ఆడ్వాణీని ఎన్నికల బరి నుంచి పక్కనబెట్టిన భారతీయ జనతా పార్టీ.. ఇప్పుడు ఆయన కుమార్తె ప్రతిభా ఆడ్వాణీకి టికెట్‌ ఇవ్వాలని భావిస్తోందట. మధ్యప్రదేశ్‌లో భాజపాకు కంచుకోట అయిన భోపాల్‌లో ప్రతిభను బరిలోకి దింపాలని కమలం పార్టీ యోచనలో ఉంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌.. సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌ను నిలబెట్టింది. దీంతో దిగ్విజయ్‌ను ఎదుర్కొనేందుకు భాజపా ప్రతిభ ఆడ్వాణీ వైపు మొగ్గుచూపుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

భోపాల్‌ నియోజకవర్గానికి 1989 నుంచి భాజపా నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి భోపాల్‌లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీ దిగ్విజయ్‌ను బరిలోకి దింపింది. దీంతో ఈ ఎన్నికను ప్రతిష్థాత్మకంగా తీసుకున్న భాజపా.. బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఈ క్రమంలో తొలుత సిట్టింగ్‌ ఎంపీ అలోక్‌ సంజర్‌, సాధ్వి పగ్ర్యా, ఉమాభారతి పోటీ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ను దిగ్విజయ్‌కు పోటీగా దింపుదామని పార్టీ భావించింది. అయితే చౌహన్‌ ఇందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో తాజాగా ప్రతిభా ఆడ్వాణీ పేరు వినిపిస్తోంది. ఆడ్వాణీ కుటుంబానికి భోపాల్‌లో మంచి పేరుంది. 2014 ఎన్నికల్లో ఆడ్వాణీని భోపాల్‌ నుంచి పోటీ చేయాలని మధ్యప్రదేశ్‌ భాజపా యూనిట్‌ కోరింది. అయితే తాను మాత్రం గాంధీనగర్‌ నుంచే బరిలోకి దిగుతానని చెప్పి సున్నితంగా తిరస్కరించారు.

వయసు రీత్యా ఆడ్వాణీని భాజపా పక్కనబెట్టింది. దీన్ని ముందుగానే ఊహించిన ఆయన.. తన కుమార్తెకు టికెట్‌ ఇవ్వాలని కోరారు. ఇందుకు పార్టీ తిరస్కరించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు పార్టీనే స్వయంగా ప్రతిభా ఆడ్వాణీని బరిలోకి దింపాలని చూస్తోంది. అదే జరిగితే భోపాల్‌ ఎన్నిక దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారనుంది.

Next Story
Share it