Top
Sneha TV

రాహుల్‌జీ..మీ బయోపిక్‌లో హీరోయిన్‌ ఎవరుండాలి?

X

కాంగ్రెస్‌ అధ్యక్షుడి సమాధానం ఏంటో తెలుసా..

పుణె: ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. ఇప్పటికే మాజీ ప్రధాని మన్మోహన్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీల జీవితకథలు తెరకెక్కాయి. మరి రాహుల్‌గాంధీ బయోపిక్‌ కూడా తీస్తే అందులో హీరోయిన్‌గా ఎవరుండాలని అనుకుంటున్నారని పుణెకు చెందిన విద్యార్థులు రాహుల్‌ను అడిగారు. దీనికి ఆయన చెప్పిన సమాధానంతో సభంతా కరతాళధ్వనులతో మార్మోగిపోయింది. పనితో తన పెళ్లి ఎప్పుడో అయిపోయిందని రాహుల్‌ అన్నారు.

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని పుణెలో విద్యార్థులతో రాహుల్‌ సమావేశమయ్యారు. రాజకీయ అంశాలను గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు రాహుల్‌ వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించారు. 'మీ బయోపిక్‌ తీస్తే అందులో ఏ హీరోయిన్‌ నటించాలని అనుకుంటున్నారు' అని అడగగా.. 'పనితో నాకెప్పుడో పెళ్లి అయిపోయింది' అని రాహుల్‌ సమాధానమిచ్చారు. దీంతో అక్కడున్నవారంతా చప్పట్లు కొట్టారు. రాహుల్‌ తన పెళ్లి గురించి ఇలా స్పందించడం ఇదే తొలిసారి కాదు. ఆ మధ్య హైదరాబాద్‌లో జరిగిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీతో తన పెళ్లి అయిపోయిందని చెప్పారు.

ఇక వయనాడ్‌లో నామినేషన్‌ అనంతరం రాహుల్‌పై ఆయన సోదరి ప్రియాంక చేసిన ట్వీట్ గురించి ప్రస్తావిస్తూ.. మీకంత ధైర్యం ఎలా వచ్చింది అని విద్యార్థులు ప్రశ్నించారు. దీనికి రాహుల్‌ స్పందిస్తూ.. 'ఆ ధైర్యం నా అనుభవం, నాకు ఎదురైన సవాళ్ల నుంచి వచ్చింది. నిజాన్ని అంగీకరిస్తే మీరు ధైర్యంగా ఉండగలరు. అదే అబద్ధాన్ని అంగీకరిస్తే భయపడతారు' అని చెప్పుకొచ్చారు. వయనాడ్‌లో నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాత.. 'నా సోదరుడు, స్నేహితుడు, నాకు తెలిసిన గొప్ప ధైర్యవంతుడు రాహుల్‌. వయనాడ్‌ ప్రజలు తనను జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆశలను ఆయన వమ్ము చేయరు' అని ప్రియాంక ట్విటర్‌లో విజ్ఞప్తి చేశారు.

Next Story
Share it