Top
Sneha TV

వయనాడ్‌లో రాహుల్ గాంధీ నిజంగాే పాకిస్తాన్ జెండాను ఎగరేశారా?

X

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళ వయనాడ్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేసిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో చాలా రకాల వదంతులు వ్యాప్తి చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వయనాడ్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీలో పాకిస్తాన్ జెండాను ఎగరేశారంటూ పోస్ట్ చేస్తున్నారు. కేరళలో కాంగ్రెస్ కార్యాలయానికి కూడా ఇస్లామిక్ రంగు వేశారని చెబుతున్నారు.

వయనాడ్ స్థానంలో ఓటర్ల సంఖ్య గురించి కూడా సోషల్ మీడియాలో చాలా వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. అక్కడ హిందూ, ముస్లిం ఓటర్ల సంఖ్య గురించి రకరకాలుగా చెబుతున్నారు.

బీబీసీ వీటి గురించి పరిశోధన చేసిన తర్వాత గురువారం ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసింది.

కానీ రాహుల్ గాంధీ వాయ్‌నాడ్ ఎంపీ స్థానానికి నామినేషన్ వేసిన తర్వాత వందతులు మరింత జోరుగా వ్యాపించాయి.

వీటిలో వాయ్‌నాడ్ ర్యాలీకి సంబంధించిన కొన్ని వాదనలను పరిశీలించినపుడు అందులో నిజం లేదని తేలింది.

రాహుల్ ర్యాలీపై వదంతులు

2009లో పునర్విభజన తర్వాత ఉనికిలోకి వచ్చిన ఉత్తర కేరళలోని వాయ్‌నాడ్ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ వేయడానికి వెళ్లినపుడు జనం 'ఇస్లామిక్ జెండా'లతో ఆయనకు స్వాగతం పలికారు.

బాలీవుడ్ నటి కొయినా మిత్రా ఇదే చెబుతూ ఈ ఫొటో షేర్ చేశారు.

ట్విటర్, ఫేస్‌బుక్, షేర్ చాట్‌లో వందల సార్లు పోస్ట్ చేసిన ఈ ఫొటోను రాహుల్ వయనాడ్ ర్యాలీకి సంబంధించినది అని చెబుతున్నారు.

కానీ ఈ ఫొటో 2016 జనవరి 28న తీశారు.

2016లో జనవరి చివరి వారంలో కేరళలోని కోజికోడ్‌, మలప్పురం జిల్లాల్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ చాలాసార్లు పర్యటించింది. ఇది వాటికి సంబంధించిన ఒక ఫొటో.

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జనరల్ సెక్రటరీ కున్యాలీ కుట్టి నేతృత్వంలో ఈ పర్యటనలు జరిగాయి.

కున్యాలీకుట్టి కేరళ ప్రభుత్వంలో చాలా శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2017 ఏప్రిల్‌లో మలప్పురం లోక్‌సభ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయ్యారు.

వయనాడ్‌లో పాకిస్తాన్ జెండా

రాహుల్ వయనాడ్ ర్యాలీకి సంబంధించిన కొన్ని ఫొటోలు షేర్ చేసినవారు రాహుల్ ర్యాలీలో పాకిస్తాన్ జెండా ఎగరేశారని రాస్తున్నారు.

సోషల్ మీడియాలో రాహుల్ ర్యాలీకి సంబంధించి చూపిస్తున్న వీడియోల్లో ఆకుపచ్చ జెండా కనిపిస్తోంది. దానిని కొందరు పాకిస్తాన్ జెండా అని చెప్పి వాట్సాప్‌, ట్విటర్‌లో షేర్ చేస్తున్నారు.

కానీ ఈ ర్యాలీలో కనిపించిన చంద్రుడు, నక్షత్రంతో ఉన్న ఆకుపచ్చ జెండా పాకిస్తాన్ జెండా కాదు. అది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జెండా.

భారత ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వారు రాహుల్ గాంధీ పోస్టర్లు కూడా పట్టుకుని కనిపించారు.

కేరళలో కాంగ్రెస్ పార్టీ మరో ఐదు స్థానిక పార్టీలతో కలిసి యునైటెడ్ డెమాక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) ఏర్పాటు చేసింది.

ఈ కూటమిలో కాంగ్రెస్ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్.

1948లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ విడిపోయిన తర్వాత మహమ్మద్ ఇస్మాయిల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయుఎంఎల్) స్థాపించారు.

ఐయుఎంఎల్ రాహుల్ గాంధీ దక్షిణ భారత్‌ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయాన్ని స్వాగతించింది. సంతోషం వ్యక్తం చేసింది.

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జెండా ఆకుపచ్చగా ఉంటుంది. దానిపై ఎడమవైపున పైన చంద్రుడు, నక్షత్రం కూడా ఉంటాయి.

కానీ ఇది పాకిస్తాన్ జెండా కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

ఈ భవనం కాంగ్రెస్‌ది కాదు

సోషల్ మీడియాలో ఈ భవనం ఫొటో పోస్ట్ చేస్తూ ఇది కేరళ వయనాడ్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని చెబుతున్నారు.

చాలా మంది సోషల్ మీడియా యూజర్లు దానికి ఎన్నికల ఏర్పాట్ల మధ్య ఆకుపచ్చ రంగు వేశారని చెబుతున్నారు.

బీబీసీకి వాట్సాప్ ద్వారా అందిన ఈ ఫొటో గురించి మేం స్థానికులను అడిగాం. కాంగ్రెస్ పార్టీ తమ కార్యాలయానికి పాకిస్తాన్ జెండా రంగు వేయించిందా అని ప్రశ్నించాం.

కానీ ఈ ఫొటో కేరళ వయనాడ్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించినది కాదు. ఇది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రాంతీయ కార్యాలయం ఫొటో.

వైరల్ అవుతున్న ఫొటోను పరిశీలనగా చూస్తే కార్యాలయం పైన ఎడమవైపు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ గుర్తు(నిచ్చెన) కూడా కనిపిస్తుంది.

ఈ కార్యాలయం బయట ఎడమ వైపు ఒక వ్యక్తి ఫొటో ఉంది. ఆ ఫొటో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకుడు సయీద్ మొహమ్మద్ అలీ షిహాబ్‌ది. ఆయన 2009లో మరణించారు.

బిల్డింగ్ బయట అంతా మలయాళం భాషలో రాసుంది. అందుకే మిగతా రాష్ట్రాల వారు దీన్ని అర్థం చేసుకోలేకపోయారని భావించవచ్చు.

కానీ దానిపై ఇక్బాల్ నగర్, లీగ్ హౌస్ అని స్పష్టంగా రాసుంది.

(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)

Next Story
Share it