Top
Sneha TV

ఆ ఊరు ఓటర్ల కోసం ఎదురుచూస్తోంది!

X

హింజిలి(ఒడిశా): ఆ గ్రామంలో సుమారు 3,500 ఇళ్లు ఉంటాయి. కానీ దాదాపు 2000 నుంచి 2500 ఇళ్లకు ఎప్పుడూ తాళాలు వేసి ఉంటాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలయినా ఆ ఊరులో మాత్రం ఎన్నికల ప్రచారం అంతంత మాత్రంగానే ఉంది. ఒడిశాలోని సరు అనే గ్రామం ఇది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న హింజిలి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది ఈ గ్రామం. అయితే ఈ గ్రామంలో ఎక్కువమంది గ్రామంలో ఉండకపోవడానికి కారణం ఉపాధి లేకపోవడం. బతుకుతెరువు కోసం ఈ ఊర్లోని సుమారు 2500 కుటుంబాలు ముంబయి, సూరత్‌ తదితర నగరాలకు వలస వెళ్లిపోయాయి. ఏడాదికో, రెండేళ్లకో ఒకసారి గ్రామానికి వస్తుంటారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కనీసం ఓటేసేందుకైనా వస్తారా?లేదా? అనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది. ' మా గ్రామంలోని ఎక్కువ మంది ఉపాధి కోసం ముంబయి, సూరత్‌ లాంటి నగరాలకు వలస వెళ్లిపోయారు.

కనీసం ఎన్నికల రోజు కూడా వారు గ్రామానికి వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇళ్లన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి' అని ఒక గ్రామస్థుడు తెలిపాడు. ' ఈ ప్రాంతంలో కొంతమేర ఉపాధి అవకాశాలు కల్పించినా ఇక్కడి ప్రజలు తమ ఊరిని, ఇళ్లను వదిలిపెట్టి నగరాలకు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. స్థానికంగా ఎటువంటి అవకాశాలు లేకపోవడం వలన ఇక్కడివారు అధిక సంఖ్యలో నగరాలకు వలస వెళ్లాల్సి వస్తోంది.

ఏడాదికి ఒకసారి ఎప్పుడో వారు ఇక్కడకు వస్తారు ' అని మరో గ్రామస్థుడు చెప్పాడు. ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని చర్యలు చేపడుతున్నా ఇంకా ఇలాంటి గ్రామాలు ఉండడం గమనార్హం. ఒడిశాలో ఏప్రిల్ 18న శాసనసభ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి .

Next Story
Share it