Top
Sneha TV

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019

X

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించి ఈసారి అధికారం చేపట్టేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడైన జగన్ తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ తన పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

ప్రస్తుతం కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు.

తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లా నుంచే జగన్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

తొలిసారిగా 2009 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

వైసీపీ ఏర్పాటు

తండ్రి ఆకస్మిక మరణం అనంతరం ఓదార్పు యాత్ర పేరుతో జగన్ రాష్ట్రమంతా పర్యటించేందుకు సిద్ధం అయ్యారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అందుకు అనుమతించలేదని కారణంతో 29 నవంబర్ 2010లో ఎంపీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఆ తర్వాత వచ్చిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన తన పినతండ్రి వైఎస్ వివేకానందరెడ్డిపై 5,45,043 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

2011 మార్చి 11న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) పేరుతో ఒక రాజకీయ పార్టీని తీసుకొచ్చారు.

వాస్తవానికి వైఎస్సార్ పేరు స్ఫురించేలా కె. శివకుమార్ అనే వ్యక్తి మొదటి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. దీనికి తర్వాత జగన్‌ అధ్యక్షుడు అయ్యారు.

సమైక్యాంధ్ర కోసం పోరాటం

యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఆమోదం తెలిపిన సమయంలో వైసీపీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా జగన్ ఉద్యమించారు. సమైక్యాంధ్ర కోసం అనేక రకాలుగా పోరాడారు. ఎన్నికైన పార్టీ నేతలతో రాజీనామాలు చేయించారు. ఆమరణ నిరహార దీక్ష చేశారు.

2012 ఉప ఎన్నికలు

2012 ఉప ఎన్నికల్లో జగన్ సారథ్యంలోని వైసీపీ విజయఢంకా మోగించింది. ఆ ఏడాది 19 శాసన సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 17 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్త రెండింటిలోనూ గెలిచారు.

2014 ఎన్నికల్లో ఓటమి

2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వైసీపీ పోటీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ కూటమి 175 స్థానాలకుగాను 106 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఒంటరిగా బరిలోకి దిగిన వైసీపీ 67 స్థానాల్లో గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.

ఇక తెలంగాణలో ఆ పార్టీ 3 శాసన సభ, ఒక పార్లమెంట్ స్థానంలో గెలిచింది. తర్వాత కాలంలో వారందరూ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి తెలంగాణలో వైసీపీ ఉనికి నామమాత్రంగా కనిపిస్తోంది.

యాత్రలు..

తండ్రి మరణాంతరం ఓదార్పు యాత్రతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పర్యటించిన జగన్ ఆ తర్వాత ప్రజలతో మమేకం అయ్యేందుకు అనేక యాత్రలను నిర్వహించారు.

పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా జన దీక్ష, కృష్ణా నది జలాల వినియోగంపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఏపీకి న్యాయం చేయాలని దిల్లీలో జల దీక్ష, చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చేనేత దీక్ష, రైతు సమస్యలపై రైతు దీక్ష చేశారు.

ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రజాసంకల్ప యాత్ర పేరుతో 14 నెలల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. 2017 నవంబర్ 6న ప్రారంభమైన ఈ యాత్ర 2019 జనవరి 9న ముగిసింది. తన యాత్రలో భాగంగా దాదాపు 3000 కిలోమీటర్లు జగన్ పర్యటించారు.

ప్రత్యేక హోదా కోసం పోరాటం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని జగన్ సారథ్యంలోని వైసీపీ పోరాడుతోంది. ప్రత్యేకహోదా సాధన పోరాటంలో భాగంగా ఎన్డీయే ప్రభుత్వంపై మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని వైసీపీ ప్రవేశపెట్టింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడంతో వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు.

ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో ముందుకు...

2014 ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీని బలోపేతం చేసేందుకు తగిన వ్యూహాలను అమలు చేసేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను జగన్ వినియోగించుకుంటున్నారు.

అక్రమాస్తుల కేసులో విచారణ

అక్రమంగా ఆస్తులు కూడగట్టారనే అభియోగం కింద 2012 మే 27న సీబీఐ.. జగన్‌ను అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి 16 నెలల పాటు జగన్ చంచల్ గూడ జైలులో ఉన్నారు. 2013 సెప్టెంబర్2లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

వ్యక్తిగతం

జగన్‌ భార్య భారతి వ్యాపార కార్యక్రమాలు చూసుకుంటారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. తల్లి విజయమ్మ, సోదరి శర్మిల పార్టీ ప్రచారంలో పాల్గొంటారు. విజయమ్మ 2014 ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం జగన్ బీకాం వరకు చదివారు. ఆయనపై 31 క్రిమినల్ కేసులు ఉన్నాయి. రూ. 339 కోట్ల ఆస్తులు, రూ. 1.19 కోట్ల అప్పులున్నాయి.

Next Story
Share it