Top
Sneha TV

జాయింట్ చెక్‌పవర్‌తో... కీలకం కానున్న ఉపసర్పంచ్

X

హైదరాబాద్ : రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉపసర్పంచ్ పదవి కీలకం కానున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం స్థానంలో తెలంగాణ రాష్ట్ర అవసరాలు, గ్రామాల అభివృద్ధికి పంచాయతీల్లో సర్పంచి, ఇతర ప్రజాప్రతినిధుల పాత్రను కీలకం చేస్తూ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018ని అమలులోకి తీసుకొచ్చారు. దీని ప్రకారం గ్రామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులు, ఇతర ఆదాయమార్గాల ద్వారా సమకూరిన నిధులకు గ్రామాల అభివృద్ధికి కేటాయింపులు, ఖర్చు చేసే విధానాలు, నిర్ణయాలపై తప్పనిసరిగా సర్పంచుతో పాటు ఉపసర్పంచ్ జాయింట్ చెక్‌పవర్ వినియోగించాల్సి ఉంటుంది. దీంతో గ్రామాల్లో ఉపసర్పంచి పదవిని దక్కించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలూ దృష్టి సారించనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 313 గ్రామ పంచాయతీలు, 2,966 వార్డులుండగా, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహంచనున్నారు.

గ్రామాల్లో కోలాహలం

ఎన్నికల ఉత్తర్వులు విడుదల చేసిన నేపథ్యంలో గ్రామాల్లో ఇప్పటికే ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. గ్రామ సర్పంచి ఎన్నిలకు నేరుగా ఎన్నికలు జరగనున్నాయి. కానీ గ్రామ పాలనా పరమైన నిర్ణయాలు ఇక నుండి సర్పంచుతో పాటు ఉపసర్పంచుకు కూడా కీలక బాధ్యతలు ఉండనున్నాయి. దీంతో పరోక్ష పద్ధతిలో ఎన్నిక కానున్న ఉపసర్పంచ్ పదవి కోసం ఆయా వార్డుల అభ్యర్థులు ఆరాటపడుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలకు వార్డుల సభ్యుల ఎన్నికలు కీలకం కానున్నాయి. గతంలో సర్పంచ్ గెలిస్తే వార్డు సభ్యుల బాధ్యతలు నామమాత్రంగా ఉండేవి. వీరి ద్వారా ఎన్నికైన ఉపసర్పంచి పదవి, బాధ్యతలు కూడా నామమాత్రంగానే ఉండేవి. కానీ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఈ ఎన్నికల్లో ఎక్కువ వార్డులు గెలిచిన పార్టీ లేదా, ఒక వర్గం వారే ఉపసర్పంచ్ పదవి చేపట్టగలుగుతారు. ఎన్నికల్లో సర్పంచ్ పదవి గెలిచినంత మాత్రాన ఉపసర్పంచ్ పదవి దక్కించుకునేంత వార్డుసభ్యులను గెలిపించుకోకపోతే గ్రామంలో నిధుల ఖర్చు విషయంలో అనుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. దీంతో గ్రామాల్లో వార్డుల సభ్యుల గెలుపు కోసం సర్పంచ్ అభ్యర్థులు కృషి చేస్తున్నారు.

రిజర్వేషన్ స్థానాల్లో పోటాపోటీ

సర్పంచ్, ఉపసర్పంచ్ పదవులు రెండు ఒకే పార్టీ గెలుచుకోవడం వల్ల రానున్న రోజుల్లో గ్రామాభివృద్ధికి క్రియాశీలక నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడుతుందని ఇప్పటికే ఆశావహులు ప్రజలకు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వ్ అయిన స్థానాల్లో ఉపసర్పంచ్ పదవి కోసం గ్రామాల్లో అభ్యర్థులు పోటాపోటీగా తలపడేందుకు సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్ అనుకూలించి సర్పంచి అవుదామని కలలు కన్నవారు కూడా ఇప్పుడు వార్డుసభ్యుడిగా నిలబడి ఉపసర్పంచుగిరీ కొట్టేందుకు ఆశపడుతున్నారు. రిజర్వేషన్‌తో సర్పంచుగా అదృష్టం రాకపోయినా కనీసం ఉపసర్పంచుగా అయినా పదవిలో కీలక పాత్ర పోషించాలని తపనపడుతున్నారు.

Next Story
Share it