Top
Sneha TV

కేంద్రం నిర్ణయం మంచిదే కానీ..: జేపీ

X

విజయవాడ: అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ స్వాగతించారు. అయితే, 10శాతం రిజర్వేషన్లు ఎలా అమలుచేస్తారో చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లు సమాజాన్ని నిట్టనిలువుగా చీలుస్తున్నాయని.. వాటితో కేవలం కొంతమందికే లాభం కలుగుతోందన్నారు. అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు అవసరమని.. నిజమైన పేదలకు వాటిని కల్పించాలన్నారు. అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జేపీ మాట్లాడారు. విజయవాడలో నిర్వహించిన 'రాష్ట్రానికి కేంద్ర హామీలు- ప్రతిపత్తి' నివేదిక విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రిజర్వేషన్లపై స్పందించారు. తహసీల్దార్‌ ఇచ్చే ధ్రువపత్రం వల్ల పేదరికం తెలియదని.. రిజర్వేషన్‌ కుదరని పక్షంలో వెయిటేజీ ఇవ్వాలని జేపీ సూచించారు. పాఠశాల విద్యలో తెలుగు రాష్ట్రాలు అధ్వానంగా ఉన్నాయన్నారు. కేంద్రం రిజర్వేషన్లు సుప్రీంకోర్టులో చెల్లుతాయో, లేదో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల అంశాన్ని తొమ్మిదో షెడ్యూల్‌ పెట్టారని.. ఇతర రాష్ట్రాల చట్టాలు ఇంకా పొందుపరచలేదని చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నప్పుడు రిజర్వేషన్లు ఏమవుతాయో చూడాలని జేపీ అన్నారు.

హామీల అమలు రాజకీయ చర్చగా మిగిలిపోయింది

ఆర్థికంగా గాయపడిన రాష్ట్రం ఏపీకి హైదరాబాద్‌ లేని లోటు కనిపిస్తోందని జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. విభజన హామీల అమలు రాజకీయ చర్చగా మిగిలిలిపోయిందని చెప్పారు.ఆర్టికల్‌3 నుంచి శాసనసభ అంగీకారం లేకుండా విభజించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే అని జేపీ గుర్తు చేశారు.

Next Story
Share it