Top
Sneha TV

చంద్రబాబును చూస్తే మోదీకి గుండెపోటు: సీఎం రమేష్‌

X

ఢిల్లీ: మహాకూటమి ఏర్పాటుతో ప్రధాని మోదీలో భయం మొదలైందని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ ఎద్దేవాచేశారు. వెన్నుపోటు కాదు... చంద్రబాబును చూస్తే మోదీకి గుండెపోటు వస్తోందన్నారు. వైసీపీ-బీజేపీ మధ్య ఒప్పందాన్ని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారని, కాపు రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా... కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన దుయ్యబట్టారు. ఎలాంటి అధ్యయనం, చర్చ లేకుండా ఈబీసీ రిజర్వేషన్ల అంశం తీసుకొచ్చారని రమేష్‌ విమర్శించారు.

ప్రభుత్వానికి సభ నడపడం చేతకావడంలేదని, టీడీపీ ఎంపీల సస్పెన్షన్‌ దారుణమని ఎంపీ సుజనాచౌదరి ఆరోపించారు. అగ్రవర్ణాల పేదలకు 10శాతం రిజర్వేషన్లని నిర్ణయం తీసుకున్నారని, ఎలా అమలు చేస్తారో వివరణ ఇవ్వలేదన్నారు. రాజకీయ లబ్దికోసం రిజర్వేషన్లు పెంచకూడదని, రాష్ట్రాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈబీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేసి స్పందిస్తామని సుజనాచౌదరి తెలిపారు.

మోదీ రాజకీయ ప్రవచనం వెన్నుపోటుతో ప్రారంభమైందని, బీజేపీ సీనియర్ నేత అడ్వాణీకి వెన్నుపోటు పొడిచి మోదీ ప్రధాని అయ్యారని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ దుయ్యబట్టారు. ఏపీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు అని మోదీనే అన్నారని, వెన్నుపోటు అంటూ అవగాహన లేకుండా మాట్లాడొద్దని సూచించారు. మోదీ స్థాయి దిగజారి మాట్లాడటం సరికాదని కనకమేడల మండిపడ్డారు. రాజకీయ లబ్దికోసమే ఈబీసీ రిజర్వేషన్లు తెస్తున్నారని ఎంపీ నిమ్మల కిష్టప్ప విమర్శించారు.

Next Story
Share it