Top
Sneha TV

దేశ ప్రతిష్ఠ పెంచేలా పనిచేస్తున్నాం: చంద్రబాబు

X

పోలవరం: పోలవరం ప్రాజెక్టు పనుల్లో నవయుగ సంస్థ చరిత్ర సృష్టించిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో రెండు ప్రపంచ రికార్డులు ఆవిష్కృతమయ్యాయి. 24 గంటల్లో 32, 315 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులతో గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. ప్రాజెక్టు వద్దే గిన్నిస్‌ ప్రతినిధులు ధ్రువపత్రాన్ని సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ఇంజినీర్లను, అధికారులను సీఎం సన్మానించిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు.

మార్చిలోపు ప్రాజెక్టు పనుల్లో మళ్లీ రికార్డు సృష్టించాలని.. ఒకే రోజు 65 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేసేలా లక్ష్యాన్ని పెట్టుకోవాలని నవయుగ సంస్థకు సీఎం సూచించారు. దేశంలోనే పోలవరం ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు అన్నారు. దేశ ప్రతిష్ఠ పెంచేవిధంగా తాము పనిచేస్తున్నామని చెప్పారు. పోలవరం పూర్తయితే రాష్ట్రంలో కరవు అనేదే ఉండదని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ చరిత్రాత్మక ప్రాజెక్టులో అందరూ భాగస్వాములు కావాలని, అడ్డుపడొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. చరిత్రలో భాగస్వాములు కావడం అరుదుగా జరుగుతుందన్నారు. ఈ ఏడాది జూన్‌ నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లిస్తామని పునరుద్ఘాటించారు. పోలవరం పూర్తయితేనే సోమవారం గుర్తుపెట్టుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు.

ఏపీ చేసే పనులను భవిష్యత్‌లో ఇతర రాష్ట్రాలు అనుసరిస్తాయని చెప్పారు.

Next Story
Share it