Top
Sneha TV

10 శాతం కోటా.. అంత ఈజీ కాదు బాసూ!

X

8 లక్షల్లోపు వార్షికాదాయం, ఐదెకరాల కంటే తక్కువ భూమి కలిగివున్న అగ్రవర్ణ 'పేదల'కు ఇక అదృష్టం తలుపు తట్టినట్లే. విద్య, ఉద్యోగావకాశాల్లో వీళ్లకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న మోదీ సర్కార్ సంకల్పం ఇప్పుడు దేశవ్యాప్త సంచలనం. "ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్‌లో వున్న ఈ ప్రతిపాదనను మోదీ సాహసోపేతంగా అమల్లో పెడుతున్నారు.. బ్రాహ్మణులు, వైశ్యులతో పాటు క్రైస్తవులు, ముస్లిమ్స్ కూడా ఈ కోటాతో లబ్ది పొందవచ్చు" అంటోంది బీజేపీ. సంక్షేమానికి దూరమయ్యే వర్గాల మనోభావాల్ని, ఆర్థిక అవసరాల్ని అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయమే ఇది అంటూ మోదీ బ్యాచ్ చెబుతున్నప్పటికీ.. ఇటీవల మూడు రాష్ట్రాల పరాభవాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరి పరిస్థితుల్లోనే బీజేపీ ఈ సాహసం చేసినట్లు స్పష్టమవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గడం కోసం సరికొత్త ఓటుబ్యాంకుల్ని సృష్టించుకోడానికే ఇలా 'కోటా'గిరీకి తెగించింది బీజేపీ.

రిజర్వేషన్లపై 1992లో సుప్రీం కోర్ట్ 50 శాతం పరిమితి విధించింది. కానీ.. వీలునుబట్టి రాష్ట్రాలు ఈ పరిమితిని మీరవచ్చని 2010 జులైలో మరో తీర్పునిచ్చింది. కానీ.. పటిష్టమైన సైంటిఫిక్ డేటా కలిగిఉంటే తప్ప ఇది వీలు కాదు. మోదీ సర్కార్ తాజా ప్రతిపాదనతో ఈ 50 శాతం క్యాప్ దాటిపోతుంది కనుక.. రాజ్యాంగ సవరణ చేయక తప్పదు. 50 శాతం దాటి చేపట్టే ఏ రిజర్వేషన్ మీదైనా జ్యుడీషియల్ స్క్రూటినీ తప్పనిసరి. అధికార పార్టీ రాజ్యసభలో మైనారిటీ దశలోనే ఉండడంతో.. ఈ కొత్త కోటాకి పార్లమెంటరీ అప్రూవల్ దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. ఈ ఎత్తుగడ నుంచి బీజేపీ 'లబ్ది' పొందకుండా.. మిగతా పార్టీలు లేనిపోని కొర్రీలు పెట్టి అడ్డుకుని తీరతాయి. నాలుగేళ్ల 8 నెలలుగా గుర్తుకురాని అగ్రవర్ణ పేదలతో ఎన్నికల సమయంలోనే మీకు అవసరం వచ్చిపడిందా? అంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి దెప్పిపొడుపులు కూడా మొదలయ్యాయి.

కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు, ఆర్ధిక పరమైన రిజర్వేషన్ల మధ్య వైరుధ్యాలపై మళ్ళీ దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగడం ఖాయం. ఇప్పుడు సుప్రీమ్ కోర్ట్ పెట్టిన పరిమితి కేవలం సామాజిక రిజర్వేషన్లకు సంబంధించింది మాత్రమే! ఇక్కడే న్యాయపరమైన చిక్కులు పుట్టుకొచ్చే అవకాశముంది. దేశవ్యాప్తంగా ముస్లింల నుంచి, గుజ్జర్ల నుంచి, పాటీదార్ల నుంచి కోటా కోసం ఉద్యమాలు జరుగుతుంటే.. అవన్నీ పెండింగ్‌లో ఉంచి బీజేపీ ప్రతిపాదిత కోటా మీద మాత్రమే చట్టం చేస్తే.. నిరసన సెగ పుట్టవచ్చన్న ఆందోళన కూడా లేకపోలేదు. మోదీ ఎత్తుగడ జనంలో చర్చ కంటే.. రచ్చనే ఎక్కువగా ఎగదోస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

తరతరాలుగా రిజర్వేషన్లకు దూరమయ్యామంటూ ఆవేదన చెందుతున్న వర్గాలను ఈ 'దెబ్బ'తో దగ్గర చేర్చుకోవచ్చన్నది బీజేపీ యుక్తి. ఇది ఎంతోకొంత ఫలితం ఇవ్వవచ్చు కూడా. అగ్రవర్ణాల జనాభా ఎక్కువగా వుండే ఉత్తరప్రదేశ్‌లో ఈ '10 శాతం' పాచిక బాగా పనిచేయవచ్చని బీజేపీ ఆశిస్తోంది. మోదీ సర్కార్ ఎప్పట్నుంచో చెబుతూ వస్తున్న 'ఉమ్మడి పౌరస్మృతి' (కామన్ సివిల్ కోడ్) అమలులో ఇది కీలక ఘట్టమన్న ప్రచారం కూడా జరుగుతోంది. సో.. 2019 ఎన్నికల్లో అయోధ్య రామాలయం కంటే.. ఈ రిజర్వేషన్ అంశమే బాగా వర్కవుట్ అవుతుందని కమలం పార్టీ ఫిక్స్ అయింది. అయితే.. ఇంత తక్కువ సమయంలో ఉభయసభల ఆమోదాన్ని పొందడం అసాధ్యమన్న అపశకునాలు కూడా వినిపిస్తున్నాయి.

Next Story
Share it