Top
Sneha TV

మేఘాలయ గని బ్లూప్రింట్‌ లేదు

X

దిల్లీ: మేఘాలయ బొగ్గు గనిలో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన నివేదికను సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా శుక్రవారం సుప్రీంకోర్టుకు అప్పగించారు. 'ఆ గనిలో అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నారు. దీన్ని సరిగ్గా నిర్వహించడంలేదు. 355 అడుగుల లోతు ఉన్న ఈ గని బ్లూప్రింట్‌ కూడా లేదు. భారత నేవీకి చెందిన ప్రత్యేక అనుభవనం ఉన్న డైవర్లు గని వద్ద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కానీ గనికి సమీపంలో నది ఉండటం వల్ల సహాయక చర్యలు కష్టతరంగా మారాయి' అని కేంద్రం, ప్రభుత్వం తరఫున హాజరైన తుషార్‌ మెహతా న్యాయస్థానానికి తెలియజేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 72 మంది ఇప్పటికే సహాయక చర్యల్లో నిరంతరం పాల్గొంటున్నప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించలేదని తెలిపారు.

గనిలో నీటి స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన వెల్లడించారు. అక్రమంగా గని తవ్వకాలు చేపట్టిన సదరు యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. వాళ్ల వల్ల కార్మికులు ఎందుకు ఇబ్బందులు పడాలి? అని ప్రశ్నించింది. కేంద్రంతో పాటు మేఘాలయ అధికారులు కార్మికులను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన మరిన్ని వివరాలతో నివేదికను జవనరి 7న అందజేయాల్సిందిగా జస్టిస్‌ ఏకే సిక్రి, జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మేఘాలయలోని తూర్పు జయంతియా జిల్లాలో డిసెంబరు 13న 15 మంది కార్మికులు బొగ్గు గనిలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఘటన జరిగి 23 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కార్మికుల ఆచూకీ తెలియలేదు.

Next Story
Share it