Top
Sneha TV

థాయ్‌లాండ్‌లో 'పబుక్‌' బీభత్సం..దూసుకొస్తున్న తుఫాన్

X

దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన పబుక్ తుఫాన్ ధాటికి థాయ్‌లాండ్ తీర ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. గత మూడు దశాబ్దాల్లో ఇలాంటి భీకరమైన తుఫాను రావడం ఇదే తొలిసారి అని అక్కడి అధికారులు చెబుతున్నారు. తుఫాను థాయిలాండ్ సౌత్ తీరాన్ని తాకడంతో భారీ వృక్షాలు నేలకూలడంతో పాటు ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. గాలుల వేగం కొంచెం తగ్గుముఖం పట్టిందని ఆదేశ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. పట్టాని ప్రావిన్స్‌కు సమీపంలో ఉన్న తీరంలో చేపల వేటకు వెళ్లే బృందంలోని ఒక వ్యక్తి మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరొక వ్యక్తి గల్లంతయ్యాడని.. నలుగురు వ్యక్తులు సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. థాయ్‌లాండ్ సౌత్‌లోని 15 ప్రావిన్స్‌లలో కుండపోత వర్షంతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సముద్రపు అలలు 22 అడుగుల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. తుఫాను హెచ్చరిక నేపథ్యంలో కొన్ని రోజులుగా సుమారు 6,176 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. థాయ్‌ను తుఫాను తాకనుండటంతో రెండు విమానాశ్రయాలను ముందస్తుగానే మూసివేశారు. పలు విమానాలను కూడా రద్దు చేశారు.

పర్యాటక ఆహ్లాదాన్ని ఆస్వాదించేందుకు వచ్చిన టూరిస్టులు హోటల్ గదులకే పరిమితమయ్యారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడంతో బోట్లన్నీ థాయ్‌లాండ్ గల్ఫ్ తీరంలో ఉన్నాయి. ఈనెల 5న అండమాన్‌ సముద్రంలో కలిసే అవకాశం ఉండగా 6న అండమాన్, నికోబార్‌ దీవుల్ని తాకొచ్చని అంచనా వేస్తున్నారు. తుఫాన్ నేపథ్యంలో ఒడిశా సైతం తీర ప్రాంత జిల్లాలను అప్రమత్తం చేసింది.

Next Story
Share it