Top
Sneha TV

ఆ శక్తి తెరాసకే ఉంది: కేటీఆర్‌

X

హైదరాబాద్‌: దిల్లీ పీఠంపై ఎవరు కూర్చోవాలో నిర్ణయించే శక్తి తెరాసకే ఉందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు అన్నారు. కేంద్రంలో సీఎం కేసీఆర్‌ చక్రం తిప్పాలంటే తెలంగాణలోని 16 పార్లమెంట్‌ సీట్లను దక్కించుకోవాల్సిన అవసరముందన్నారు. ఈ క్రమంలో ఒక్కోసీటు కీలకంగా మారనుందని, మన పాలన దేశానికే ఆదర్శం కానుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ జలవిహార్‌లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధ్యక్షతన జరిగిన సనత్‌నగర్ నియోజకవర్గ తెరాస కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.

ఉద్యమ నాయకుడు ఉద్యమ ఫలితాలను ప్రజలకు చూపించి రెండో సారి ముఖ్యమంత్రి కావడం దేశంలోనే రికార్డుగా కేటీఆర్‌ అభివర్ణించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా కేసీఆర్‌ పట్ల ప్రజలు విశ్వాసం ప్రకటించారని వివరించారు. భాజపా, కాంగ్రెస్‌, తెదేపా నుంచి హేమాహేమీలు వచ్చి ప్రచారం చేసినా కేసీఆర్‌కే ప్రజలు పట్టం కట్టారన్నారు. దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు గెలిచి చరిత్ర సృష్టించామని ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. బీసీలపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదని తలసాని దుయ్యబట్టారు.

Next Story
Share it