Top
Sneha TV

వీఆర్‌ఏల వేతనాలు పెంపు ....

X

హైదరాబాద్ :విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల వేతనాలను 64.61 శాతం పెంచనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రస్తుతం నెలకు రూ.6,500లుగా ఉన్న వీఆర్‌ఏల వేతనాన్ని రూ.10,500కు పెంచాలని, దీంతోపాటు రూ.200 తెలంగాణ రాష్ట్ర సాధన ఇంక్రిమెంటును కూడా ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. పెరిగిన వేతనాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. వారసత్వంగా పనిచేస్తున్న ప్రతీ వీఆర్‌ఏకు స్వగ్రామంలోనే డబుల్ బెడ్‌రూం ఇల్లు కట్టివ్వాలని, దీనికోసం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని, వీఆర్‌ఓ, అటెండర్, డ్రైవర్ తదితర ఉద్యోగ నియామకాల్లో తగిన విద్యార్హతలున్న వీఆర్‌ఏలకు 30 శాతం ఉద్యోగాలు రిజర్వు చేయాలని సీఎం నిర్ణయించారు.

ఈ నిర్ణయాల వల్ల్ల, వారసత్వంగా వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న రాష్ట్రంలోని 19,345 మందికి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వీఆర్‌ఏలుగా ఎంపికైన 2,900 మందికి (డైరెక్ట్ రిక్రూటీలకు) మేలు కలుగుతుంది. వీఆర్‌ఏ ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్‌లో సమావేశమై చర్చించారు.

శక్తివంచన లేని కృషి వారిది : వీఆర్‌ఏ ప్రతినిధులతో సమావేశం సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో శాయశక్తులా పాల్గొన్న వీఆర్‌ఏలు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. గ్రామంలో 24 గంటలపాటు అందుబాటులో ఉండి ప్రభుత్వం తరఫున ప్రతీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న వారందరూ పేదలే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజికవర్గాలకు చెందిన వారే ఎక్కువమంది. పేరుకు పార్ట్‌టైం ఉద్యోగమైనా ఓవర్‌టైం పని చేస్తున్నారు. ఇంతచేసినా వారికి లభించే జీతం తక్కువే. కనీస వేతనం కూడా దక్కడం లేదు. కేవలం రూ.6,500 నెల జీతంతో బతుకడం చాలా కష్టం. వారి జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనప్పటికీ, గ్రామస్థాయిలో అందుబాటులో ఉండి వీరు ప్రజలకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రతీ వీఆర్‌ఏకు నెలకు రూ.10,500 వేతనం, రూ.200 తెలంగాణ రాష్ట్ర సాధన ఇంక్రిమెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన వేతనాలను వీఆర్‌ఏలకు చెల్లించాలి. ప్రతీనెల 1వ తేదీన ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్నట్లే వీరికి కూడా వేతనం అందాలి.

వేతనంతోపాటు వీఆర్‌ఏల గౌరవం కూడా పెరగాల్సి ఉంది. తరతరాలుగా ఈ కుటుంబాలు గ్రామ సేవలో నిమగ్నమై ఉన్నాయి. అయినా వీరిని వెట్టి, మస్కూరి, కావల్‌కార్, కాన్‌దార్ తదితర పేర్లతో పిలువడం వల్ల వారి ఆత్మగౌరవం దెబ్బతింటున్నది. ఇకపై అలా పిలువొద్దు. వీఆర్‌ఏ అని మాత్రమే పిలువాలి అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Next Story
Share it