Top
Sneha TV

జనవరి 13 నుంచి అంతర్జాతీయ మిఠాయి పండుగ

X

పాల్గొననున్న 20 దేశాల ప్రతినిధులు
పరేడ్‌ గ్రౌండ్‌ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం మరో అంతర్జాతీయ వేడుకను నిర్వహించడానికి సిద్ధమైంది. ఇప్పటికే ప్రతీ ఏటా సంక్రాంతి పర్వదినం సందర్భంగా అంతర్జాతీయ పతంగుల పండుగ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనికి అనుబంధంగా ఈ ఏడాది అంతర్జాతీయ మిఠాయిల పండుగ నిర్వహించాలని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో జనవరి 13 నుంచి 15 వరకూ ఈ వేడుకలు నిర్వహించనున్నారు. కాగా, 20 దేశాలకు చెందిన మిఠాయిలు ఈ సందర్భంగా స్టాళ్లలో అందుబాటులో ఉంచనున్నారు. ఈమేరకు సోమవారం బేగంపేటలోని పర్యాటక భవన్‌లో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది నిర్వహించిన మిఠాయిల పండుగలో 1000 రకాల మిఠాయిలను ప్రదర్శించామనీ, వివిధ రాష్ట్రాలతో పాటు 15 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. మొత్తంగా సుమారు 8 లక్షల మంది సందర్శకులు పాల్గొన్నారని పేర్కొన్నారు.ఈ ఏడాది నిర్వహించనున్న వేడుకలకు 10 లక్షల మంది వరకూ హాజరు కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో సందర్శకుల తాకిడికి అనుగుణంగా ఏర్పాట్లు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వెంకటేశం అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story
Share it