Top
Sneha TV

డిపాజిటర్లకు కుచ్చుటోపి వేసి వందల కోట్లతో పరారైన ఘనాపాఠీ

X

హైదరాబాద్ : జనాలను ఈజీగా మోసం చేసేందుకు కంత్రీగాళ్లు ఎంచుకుంటున్న వ్యాపారం చిట్టీల వ్యాపారం. ప్రజలను ముందుగా నమ్మించి ఆ తర్వాత వంచించి చివరకు ప్రజలను ముంచేస్తున్నారు. తాజాగా రిషబ్ చిట్‌ఫండ్స్ కంపెనీ యాజమాన్యం రూ. 200 కోట్లు వరకు ప్రజలకు కుచ్చుటోపీ పెట్టింది. రిషబ్ చిట్‌ఫండ్స్ కంపెనీ యజమాని శైలేష్ గుజ్జర్ ప్రజల నుంచి రెండు వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఉడాయించాడు. శైలేష్ గుజ్జర్ అతని భార్యతో కలిసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తప్పించుకుపోయిన శైలేష్ గుజ్జర్‌ను సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

చిట్టీల రూపంలో డిపాజిట్‌దారులనుంచి డబ్బులు వసూలు చేసి చాలా విలాసవంతమైన జీవితాన్ని శైలేష్ గుజ్జర్ గడిపాడు .పలు చోటు స్థిర చరాస్తులు కొన్నాడు. రూ. 50 లక్షలకు పైగా విలువైన మూడు కార్లు కొన్నాడు. అంతేకాదు గోవాలో క్యాసినోలు, హైదరాబాద్‌లో బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్స్ కూడా ఉన్నాయి. ఇలా ఒక్కచోట కాదు బెంగళూరులో కూడా భారీగానే ఆస్తులు కొన్నాడు. అక్కడ 1600 గజాల స్థలం, నల్లగండ్లలో 1200 గజాల స్థలం, కొనుగోలు చేశాడు. హైదరాబాద్‌ బోయిగూడాలో ఇల్లు, వస్త్రాల దుకాణాలు ఉన్నాయి.

ఇక ఇల్లును బ్యాంకులో కుదువ పెట్టి రూ.60 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఇక ఇల్లును బ్యాంకులో కుదువపెట్టి అప్పుతీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆలోచించిన డిపాజిట్ దారులకు ఆయనపై అనుమానం మొదలైంది. దీంతో తమ డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు బాధితులు. వారి నుంచి తప్పించుకునేందుకు తన క్యాసినో, పబ్స్‌ ద్వారా వచ్చే లాభాలు షేర్లు గురించి చెప్పి అప్పటికప్పుడు వారిని పంపించేసేవాడు.

అన్ని వర్గాల ప్రజలను శైలేష్ మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. తన ఇంట్లో పనిచేసే పనిమనుషుల వద్ద నుంచి కూడా చిట్టీల పేరుతో రూ. 2లక్షలు వసూలు చేశాడు. చిట్టీ కోసం రూ. 2లక్షలు కట్టిన ఓ మహిళకు డబ్బులు తిరిగి చెల్లించలేదు. ఇప్పటి వరకు పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం మొత్తం రూ.53 కోట్లకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. శైలేష్ గుజ్జర్ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు ఎట్టకేలకు చాకచక్యంగా పట్టుకున్నారు. బాధితులు తమకు న్యాయం చేయాలంటూ చిట్‌ఫండ్ కార్యాలయం ముందు బాధితులు ఆందోళనకు దిగారు.

Next Story
Share it