Top
Sneha TV

సత్తెనపల్లిలో అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ నిరసన ర్యాలీ

X

అమరావతి: అగ్రిగోల్డ్‌ కస్టమర్ల ఆత్మహత్యలను నిలువరించాలని డిమాండ్‌ చేస్తూ.. అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం సత్తెనపల్లి పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. గ్రామ గ్రామాన అగ్రిగోల్డ్‌ బాధితుల చైతన్య సభలను, మండల స్థాయి బైక్‌ ర్యాలీలను జయప్రదం చేయాలని కోరుతూ.. ఈ నెల 4 వ తేదీ నుండీ 20వ తేదీ వరకూ నిరసన ర్యాలీ కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు సత్తెనపల్లిలో నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీ అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రాన్ని అందించారు. అనంతరం నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి నరిశేటి వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ఈ నెల 23 నుండి విజయవాడలో ధర్నా చౌక్‌ వద్ద రిలే ఆమరణ నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను వెంటనే వేలం వేసి బాధితులకు డబ్బులు చెల్లించి, కస్టమర్ల ఆత్మహత్యలను నిలువరించాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అగ్రిగోల్డ్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కేతినేని అగస్టీన్‌, యూనియన్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ఎస్‌కె కరిముల్లా, సిపిఐ పట్టణ కార్యదర్శి తోట రామ తిరుపతి రావు, ఎఐటియుసి ఏరియా అధ్యక్షులు కంబాల శ్రీనివాస్‌, ఏరియా ప్రధాన కార్యదర్శి పి.యిర్మియా, యూనియన్‌ మహిళా నాయకులు పాములపాటి సుజాత, నారాయణమ్మ, శకుంతల, యూనియన్‌ నాయకులు ఎస్‌.కోటేశ్వరరావు, జగన్నాథం, డి.వాసు, యువజన సంఘం నాయకులు కె.బంగారు స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it