Top
Sneha TV

కేటీఆర్ బాధ్యతల స్వీకరణకు కుదిరిన ముహుర్తం

X

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ ఆధ్వర్యంలో పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీనియర్ నేత కేకేశవరావుతో పాటు 62 మంది ప్రతినిధులు హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం పార్టీ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి వివరాలు తెలియజేశారు. సోమవారం ఉదయం 11.05 గంటలకు కేటీఆర్‌ బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన తెలిపారు. అర్హత గల వారందరూ ఓటు నమోదు చేసుకోవాలని, ఓటరు నమోదు కార్యక్రమాల్లో రాష్ట్రస్థాయి నేతలు పాల్గొనాలని సూచించారు. జనవరిలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలు ఉత్సహంగా పనిచేయాలని, వీలైనంత వరకు ఏకగ్రీవం చేసే విధంగా చూడాలని పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

పంచాయతీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు మొదలుపెట్టాలని సూచించారు. మార్చి నుంచి పార్లమెంట్‌ నియోజకవర్గాలకు జనరల్‌ సెక్రటరీ, ఇద్దరు సెక్రటరీలను నియామించనున్నట్లు ఆయన తెలిపారు. పబ్లిక్‌ గ్రీవెన్స్‌ సెల్‌ను తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండు సబ్‌ కమిటీలు ఏర్పాటు చేసుకొని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని పార్టీ సమావేశంలో నిర్ణయించారు. ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేలు రాష్ట్ర కమిటీ నుంచి రిలీవ్‌ అయ్యారని, త్వరలో ఖాళీగా ఉన్న అనుబంధ సంఘాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తెలిపారు.

Next Story
Share it