Top
Sneha TV

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందించిన మంత్రి లోకేష్

X

అనంతపురం: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అనంతపురం జిల్లా కేశవపురం ఎంపీటీసీ నాగులప్పకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహాయ నిధి నుంచి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. విధి వెక్కిరింత.. టీడీపీలో చురుకైన కార్యకర్తకు అందని చేయూత శీర్షికన ఆంధ్రజ్యోతి ఆన్‌లైన్ ఎడిషన్‌లో వచ్చిన కథనానికి లోకేష్ స్పందించారు. తక్షణమే నాగుతప్ప చికిత్స కోసం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధినుంచి రూ. లక్ష అందజేయాలని ఆదేశించారు.

నాగులప్ప గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం కోసం బెంగళూరు, అనంతపురంలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయినా ఆరోగ్యం కుదుటపడలేదు. చికిత్స నిమిత్తం ఉన్న ఆస్తి కరిగిపోవడంతోపాటు అప్పులపాలయ్యారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని నాగులప్ప భార్య నారాయణమ్మ అభ్యర్థించారు. తన భర్తకు ఆరోగ్యం బాగుచేయించుకోడానికి సాయం చేయాలని ప్రజాప్రతినిధులు, నాయకులను వేడుకున్నా ఎవరూ చేయూతనివ్వలేదు.

విధిలేని పరిస్థితిలో గతకొన్ని రోజులుగా పెనుకొండ రహదారిలోని లోచర్ల సమీపంలో కొంటెమ్మ గుడివద్ద తలదాచుకుంటున్నారు. గుడికి వచ్చే భక్తులు ఇచ్చే డబ్బులు, సరుకులతో అక్కడే వంట చేసుకుని కాలం గడుపుతున్నామని నారాయణమ్మ వివరించింది. నాగులప్ప దీన గాథపై ఈనెల 13న ఆంధ్రజ్యోతి అనంతపురం ఆన్‌లైన్ ఎడిషన్‌లో వచ్చిన కథనం అందరినీ కలిచివేసింది. ఇది లోకేష్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన వెంటనే స్పందించారు. పార్టీ కార్యకర్తల సహాయ నిధి నుంచి నాగులప్పకు రూ. లక్ష అందజేయాలని స్థానిక నాయకులను లోకేష్ ఆదేశించారు.

Next Story
Share it