Top
Sneha TV

ఏపీకి పాఠాలు చెబుతోన్న తెలంగాణ ఎన్నికల ఫలితాలు..

X

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌కు మంచి పాఠాలే చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు ఉత్తరాదిన వచ్చిన ఫలితాలు ఊతమివ్వగా, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూటమితో కలిసి చేసిన ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

మొత్తంగా దేశంలో సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో మోదీ ఇమేజ్ తగ్గుతోందని, కమలం వాడిపోతుందనే అంశం తేటతెల్లమైంది. సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి లబ్దిదారుల్లో సంతృప్తి పెంచాలనేదే తెలంగాణలో టి.ఆర్.యస్ సాధించిన విజయం ఏపీలో తెలుగుదేశానికి సూచిస్తోంది. మొత్తంగా తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై స్పష్టంగా కనిస్తోంది.

రెండు నెలల నుంచి హోరాహోరీగా సాగిన తెలంగాణ ఎన్నికల పోరులో టి.ఆర్.యస్‌కు అనుకూలంగా నిశ్శబ్ద విప్లవం పని చేసిందని తేలింది. తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్న కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా పట్టాభిషక్తులను చేశారు ఓటర్లు. తెలంగాణలో టి.ఆర్.యస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ఫలితాలు క్షేత్రస్థాయికి వెళ్లడం, ప్రభుత్వం మారితే, ఆ పథకాలు ఆగిపోతాయనే ఆందోళన, మహాకూటమిలో వైరుధ్యాలు, తన సభలకు వచ్చిన మహిళలకు అరటిపండు ఒలిచి పెట్టినట్లుగా కేసీఆర్ చేసిన ప్రసంగం తెలంగాణ ప్రజానీకంపై ప్రభావాన్ని చూపించాయి. ముఖ్యంగా మహిళాలోకం.. తెలంగాణలో కారుకు అనుకూలంగా ఓటు వేశారు. ఏపీ నుంచి చంద్రబాబు వచ్చి తెలంగాణలో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారని, కేసీఆర్ చేసిన ఆరోపణలు కూడా పట్టణ ప్రాంతాల్లోని ప్రజానీకంలోకి వెళ్లాయి. తెలంగాణ కోసం కొట్లాడిన వారంతా ఈ ప్రచారంతో ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నప్పటికీ సెంటిమెంట్ వారిని ప్రభావితం చేసిందనే విశ్లేషణలు సాగుతున్నాయి.

కానీ తెలంగాణలో బీజేపీకి ఎనిమిది స్థానాలు వస్తాయని అంచనా వేసినప్పటికీ ఒకటి, రెండింటికే పరిమితంకావడం, ఇండిపెండెంట్లు కూడా ఒకరిద్దరు మాత్రమే గెలవడం, టి.ఆర్.యస్ అభ్యర్దులకు భారీ ఆధిక్యత పరిశీలిస్తే టి.ఆర్.యస్‌కు సైలెంట్ వేవ్ ఉందని ఫలితాలు స్పష్టం చేశాయి.

మొత్తంగా చూస్తే ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీ ప్రతిష్ట మసకబారటం, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యం రావడం, తెలంగాణలో కూడా బీజేపీకి సీట్లు రాకపోవడంతో మోదీ ఇమేజ్ తగ్గిపోతుందనే అంశం ఏపీలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఊరటనిచ్చింది. ముఖ్యంగా జాతీయస్థాయిలో బీజేపీయేతర పక్షాల కూటమి ఏర్పాటుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి.

మొత్తంగా ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్న వైఖరికి ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మద్దతు ఇచ్చినట్లయిందని పరిశీలకులు చెబుతున్నారు. ఇదే సమయంలో కూటమిగా ఏర్పడి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చేసిన ప్రయోగం విఫలమైందనే ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది.

Next Story
Share it