Top
Sneha TV

ఏఏఐ ఉద్యోగుల నిరాహారదీక్ష

X

విమానాశ్రయాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన
న్యూదిల్లీ: వందలాది ఏఏఐ(ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్‌ ఇండియా) ఉద్యోగులు సోమవారం నుంచి మూడు రోజులపాటు రిలే నిరాహారదీక్ష చేయబోతున్నట్లు ఏఏఈయూ( ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌) ప్రతినిధి ఒకరు తెలిపారు. దేశంలోని ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నిరసన చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే డిసెంబర్‌ 28న ఉద్యోగులందరూ క్యాజువల్‌ లీవ్‌పై వెళతారని యూనియన్‌ హెచ్చరించింది. '' ఈ రిలే నిరహార దీక్ష విమాన సేవలపై ఎలాంటి ప్రభావం చూపబోదు. ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము చర్యలు తీసుకుంటాం'' అని ఏఏఈయూ ప్రధాన కార్యదర్శి బీ.ఎస్‌ అల్హావత్‌ ఓ జాతీయ మీడియా సంస్థకు తెలిపారు.

ఇదిలా ఉండగా గతనెల ప్రభుత్వం దేశంలోని ఆరు విమానాశ్రయాలను పీపీపీ(పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌)కింద నిర్వహించడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలకు అంగీకరించింది. ఇందులో అహ్మదాబాద్, జైపూర్‌, లక్నో, గౌహతి, తిరువనంతపురం, మంగుళూరు విమానాశ్రయాలున్నాయి. దీంతో యూనియన్‌లో ఉన్న 9,000 మంది ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా డిసెంబరు 4న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.

Next Story
Share it