Top
Sneha TV

ఉర్జిత్ పటేల్ రాజీనామా: ప్రధానికి స్వామి సూచన, మోడీ ఏమన్నారంటే? షాకయ్యామని గురుమూర్తి

X

ముంబై/న్యూఢిల్లీ:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి, కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తదితరులు స్పందించారు. ఈ రాజీనామాపై ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ మెంబర్ ఎస్ గురుమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

షాకింగ్: ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ రాజీనామా, కొద్ది రోజులుగా ప్రభుత్వంతో ఢీ

గత సమావేశం ఆహ్లాద వాతావరణంలో జరిగిందని గురుమూర్తి అన్నారు. కానీ హఠాత్ రాజీనామా నిర్ణయంతో షాక్‌కు గురైనట్లు తెలిపారు. ఆర్బీఐ అంతర్గతంగా మరోలా ఉంటే, మీడియా మాత్రం మరొకటి క్రియేట్ చేస్తుందని ఆర్బీఐ డైరెక్టర్లు భావిస్తున్నారని చెప్పారు. అది మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు.

నరేంద్ర మోడీ
ఉర్జిత్ పటేల్ రాజీనామాపై ప్రధాని నరేంద్ర మోడీ

ఉర్జిత్ పటేల్ రాజీనామా పైన ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఆయనపై ప్రశంసలు కురిపించారు. అతను మంచి ఆర్థికవేత్త అని తెలిపారు. స్థూల ఆర్థిక అంశాల పైన ఆయనకు లోతైన, అర్థవంతమైన అవగాహన ఉందని చెప్పారు. గందరగోళంగా ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థను అతను సరి చేశారని కితాబిచ్చారు. అతనిని ఎంతో మిస్ అవుతున్నామని చెప్పారు. తన హయాంలో మంచి విజయాలు సాధించి, ముందు తరాలకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు.

సుబ్రహ్మణ్య స్వామి

రాజీనామాపై సుబ్రహ్మణ్య స్వామి స్పందన

ఉర్జీత్ పటేల్ రాజీనామాపై బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి వెంటనే స్పందించారు. అతని రాజీనామా నిర్ణయం మన ఆర్థిక వ్యవస్థకు, కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకి మంచిది కాదని చెప్పారు. కనీసం అతను వచ్చే ఏడాది జూలై నెల వరకు ఉండాల్సిందని చెప్పారు. వచ్చే ఏడాది కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఉండవలసిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ అతనిని పిలిపించి రాజీనామాకు గల కారణాలను తెలుసుకోవాలని, అతని రాజీనామాను ఉపసంహరింప చేయాలని అభిప్రాయపడ్డారు.

అరుణ్ జైట్లీ
ఉర్జీత్ రాజీనామాపై అరుణ్ జైట్లీ

ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా ఉర్జీత్ పటేల్ సేవలను ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. ఆర్బీఐకి ఆయన గవర్నర్‌గా, డిప్యూటీ గవర్నర్‌గా అత్యుత్తమ సేవలు అందించారని చెప్పారు. ఉర్జిత్ పటేల్ మరెన్నో సంవత్సరాలు ప్రజలకు ఇలాంటి సేవ చేయాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు.

అహ్మద్ పటేల్
ఉర్జిత్ పటేల్ రాజీనామాపై అహ్మద్ పటేల్

ఉర్జిత్ పటేల్ రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ స్పందించారు. అనూహ్య పరిణామాల మధ్య ఆయన రాజీనామా చేశారని, ఇది మన ద్రవ్య, బ్యాంకింగ్ సిస్టమ్‌కు పెద్ద దెబ్బ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆర్థిక ఎమర్జెన్సీ పరిస్థితిని కల్పించిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశం విశ్వసనీయతను కోల్పోయే పరిస్థితి ఉందని చెప్పారు.

Next Story
Share it