Top
Sneha TV

నాటు తుపాకీ మిస్‌ఫైర్‌.. బాలుడి మృతి

X

గుడివాడ రూరల్‌: కృష్ణా జిల్లా గుడివాడ మండలంలో విషాదం చోటుచేసుకుంది. శేరిధింటికుర్రు గ్రామంలో నాటు తుపాకీ మిస్‌ ఫైర్‌ కావడంతో ముక్కుపచ్చలారని బాలుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో నివాసం ఉంటున్న నాని అనే వ్యక్తి కుమారుడు చిటికనేని కరుణానిధి (14) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రెండో శనివారం సెలవు కావడంతో తండ్రికి సహాయంగా గేదెలను మేపుతూ.. చెరువు గట్టుపైకి వెళ్లాడు. 100 ఎకరాల చేపల చెరువుపై పక్షులను తరిమేందుకు గాను నాటు తుపాకీతో ఓ వ్యక్తిని యజమాని నియమించుకున్నాడు. పక్షులను కాల్చే క్రమంలో గురి తప్పి పక్కనే ఆసక్తిగా తిలకిస్తున్న కరుణానిధి నుదిటిపై తుపాకీ గుండు తగిలింది. దీంతో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని శవ పంచనామ నిమిత్తం గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Next Story
Share it