Top
Sneha TV

మహాకూటమికి మద్దతుపై స్పందించిన అసదుద్దీన్‌

X

హైదరాబాద్:

ఒవైసీ సోదరులు అసదుద్దీన్‌, అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో హట్‌టాఫిక్‌గా నిలుస్తూ ఉంటారు. తెలంగాణ ఎన్నికల్లో తామే కింగ్‌మేకర్ అవుతామని వీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కర్నాటకలో జేడీఎస్ సీఎం పీఠాన్ని ఎట్లా కైవసం చేసుకుందో... అదే తరహాలో తెలంగాణలో సీఎం పీఠాన్ని తాము దక్కించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. బీజేపీని మాత్రమే టార్గెట్‌ చేసుకుని విమర్శలు గుప్పించే మజ్లీస్ సోదరులు.. ఇప్పుడు కాంగ్రెస్‌పై కూడా అదే తరహాలో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్, మజ్లీస్, బీజేపీ మధ్య రహస్యం ఒప్పందం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసదుద్దీన్ నిజామాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయాలని పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అసదుద్దీన్ ప్రకటనతో దాదాపుగా మజ్లీస్ మద్దతు టీఆర్‌ఎస్‌కే ఇస్తుందనే ప్రచారం జరుగుతుంది.

బుధవారం అసదుద్దీన్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రజాఫ్రంట్ మద్దతుపై స్పందించారు. కూటమి అధికారంలోకి వస్తే మద్దతుపై ఇప్పుడే చెప్పలేమని దాటవేశారు. ఎంఐఎం ఎవరికీ 'ఎ' టీమ్...'బి' టీమ్ కాదని చెప్పారు. మజ్లిస్ లేకుండా చేయాలన్న బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు నెరవేరవని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరాల్సిన అవసరం తమకు లేదని ఆయన తేల్చిచెప్పారు. కేసీఆర్‌ను ప్రజలు మంచి మెజార్టీతో గెలిపిస్తారని పేర్కొన్నారు. 2019లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర వహిస్తాయని వ్యాఖ్యానించారు. త్వరలో ఎంఐఎం మహిళా విభాగం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సర్వేలపై సీఈసీ దృష్టి పెట్టాలని, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ హైదరాబాద్‌లో ఎందుకు పోటీ చేయట్లేదని అసదుద్దీన్ ప్రశ్నించారు.

అక్బరుద్దీన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాము తలచుకుంటే ఎవరినైనా సీఎం పీఠంపై కూర్చోబెడుతామంటూ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ అయినా, కేసీఆర్ అయినా తమకు గొడుగుపట్టాల్సిందేన్నారు. మజ్లిస్ ముందు ఎవరైనా తలవంచాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 11 తర్వాత తమ సత్తా ఏమిటో చూపుతామని చెప్పారు. మరోవైపు అక్బర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, ఎంఐఎం అనధికారికంగా కూటమిగా ఏర్పడ్డాయనే విమర్శలు వస్తున్నాయి. ఎంఐఎం పోటీ చేస్తున్న ఏడు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ బలహీనమైన అభ్యర్ధులను నిలబెట్టిందని, ఈ సీట్లను ఆ పార్టీ గంపగుత్తగా గెలుచుకునేందుకు టీఆర్‌ఎస్ సహకరిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Next Story
Share it