Top
Sneha TV

ఎంబిబిఎస్‌లో వికలాంగుల ప్రవేశాలపై మార్గదర్శకాలను సవరించాలి

X

ఎంబిబిఎస్‌లో వికలాంగుల ప్రవేశాలపై మార్గదర్శకాలను సవరించాలి

- ఎన్‌పిఆర్‌డి డిమాండ్‌
న్యూఢిల్లీ : ఎంబిబిఎస్‌ కోర్సులో వికలాంగుల ప్రవేశాలపై మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసిఐ) జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాలు వివక్షాపూరితంగా వున్నాయని, పైగా వికలాంగుల హక్కుల చట్టం, 2016కి పూర్తి విరుద్ధంగా వున్నాయని జాతీయ వికలాంగుల హక్కుల వేదిక (ఎన్‌పిఆర్‌డి) పేర్కొంది. తక్షణమే వాటిని సవరించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కేంద్రానికి ఒక లేఖ రాసింది. ముసాయిదా మార్గదర్శకాలపై సలహాలు ఇవ్వడానికి, నీట్‌-యుజి పరీక్షకు ఆఖరు తేది నవంబరు 30 కావడం ఆశ్చర్యకరంగా వుందని, కేవలం ముసాయిదా మార్గదర్శకాల ఆధారంగా అర్హులా, అనర్హులా అనేది ఎలా నిర్ణయిస్తారని ఎన్‌పిఆర్‌డి ప్రధాన కార్యదర్శి మురళీధరన్‌ ప్రశ్నించారు. ఎంబిబిఎస్‌ కోర్సుల్లో వికలాంగుల ప్రవేశానికి సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పులకు కూడా ఈ మార్గదర్శకాలు విరుద్ధంగా వున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రవేశాల సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు, డాక్టర్లు ఇచ్చిన సలహాలు, సవరణలు అన్నింటినీ పొందుపరిచి ఈ నెల 26న మెమోరాండం కూడా అందచేశామని తెలిపారు. వాటన్నింటినీ పరిశీలించి, విదేశాల్లో ప్రాక్టీస్‌ చేస్తున్న డాక్టర్ల సలహాలు కూడా గమనంలోకి తీసుకుని మార్గదర్శకాలను సవరించాలని ఆ లేఖ కోరింది. తాజాగా మార్గదర్శకాలు రూపొందించే సమయంలో డాక్టర్లను, వికలాంగుల కోసం పనిచేసే సంస్థలను, విద్యార్ధులను సంప్రదించాలని కోరింది.

అలాగే 2019-20 సంవత్సరానికి నిర్వహించే నీట్‌-యుజి పరీక్షకు దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీని నెల రోజుల పాటు పొడిగించాలని కోరింది. ఇప్పటివకే రిజిస్టర్‌ అయిన అభ్యర్ధులు తమ దరఖాస్తులను పున పరిశీలించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు.

Next Story
Share it