Top
Sneha TV

ఖమ్మంలో కమ్యూనిస్టుల పట్టు సడలుతోందా? : తెలంగాణ ఎన్నికలు 2018

X

ఖమ్మంలో ఒకనాటి వామపక్ష రాజకీయాల వెలుగును చూసినవారు ప్రస్తుత పరిస్థితులపై ఏమంటున్నారో చూద్దాం.

తెలంగాణలోని ఖమ్మం జిల్లా వామపక్షాలకు ఒకప్పుడు కంచు కోట. దశాబ్దాలుగా ఎన్నికల ఫలితాలను పరిశీలించినా, క్షేత్రస్థాయిలో చూసినా ఆ మాట వాస్తవమేనని అర్థమవుతుంది. ఇప్పుడా కంచు కోట కొన్నాళ్లుగా బలహీనపడుతోంది.

2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో కేవలం ఒకే ఒక్క స్థానాన్ని వామపక్షాలు దక్కించుకున్నాయి. భద్రాచలం ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి సీపీఎం తరఫున గెలిచిన సున్నం రాజయ్య ఒక్కరే ఆ జిల్లాలో ఇప్పుడున్న వామపక్ష ఎమ్మెల్యే.

ప్రస్తుత ఎన్నికల్లోనూ వామపక్షాల్లోని ప్రధాన పార్టీలైన సీపీఎం, సీపీఐలు వేర్వేరు కూటముల్లో ఉంటూ పోటీ చేస్తున్నాయి.

నిజాం వ్యతిరేక పోరాటం నుంచి ముదిగొండ కాల్పుల వరకు తెలంగాణలో ఎన్నో ఉద్యమాలకు ఊపిరి ఎర్రజెండా ఇప్పుడు ఖమ్మంలాంటి కంచుకోటలో ఉనికి కోసం పోరాడుతోందా?

రైతు కూలీలకు మద్దతుగా తెలంగాణలో ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాలలో వామపక్షాలదే ముందువరుస.

రజాకార్లపై తిరుగుబాటు, తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించింది.

కానీ అంతర్జాతీయ వామపక్ష రాజకీయాల పరిణామాలు, భారత దేశంలోని వామపక్ష పోరాటాలపైనా ప్రభావం చూపాయి.

1964లో భారత కమ్యూనిస్టు పార్టీ చీలికతో, తెలంగాణలోని కమ్యూనిస్టులూ చీలిపోయారు. వామపక్ష రాజకీయాల్లో ఈ పరిణామం ఓ కీలక మలుపు అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

'తప్పుడు నిర్ణయాలు నష్టపరిచాయి'

మంచికంటి రామకిషన్ రావు, చిరావూరి లక్ష్మినర్సయ్య, పెరవళ్ళు వెంకటరమణ, ఓటికొండ నాగేశ్వర్ రావు, సర్వదేవభట్ల రామనాథం, శేషగిరి రావు, పర్సా సత్యనారాయణ, మొత్తూరి హనుమంతరావు.. ఇలా ఎంతోమంది వామపక్ష నాయకులు ఖమ్మం కేంద్రంగా వామపక్ష భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లారు.

"ఆనాటి వామపక్ష నాయకులు, ప్రజల బాధలు తెలుసుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేయటమే కాక, ఆ సమస్యలపై ప్రాణాలకు తెగించి పోరాడారు. కానీ 1980 తర్వాత.. నాయకత్వ మార్పులు, కొత్త తరం నాయకత్వాన్ని బ్యాలెన్స్ చేయలేకపోవడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవటంతో విసిగిపోయిన కొందరు సభ్యులు పార్టీకి దూరమయ్యారు" అని ఖమ్మం జిల్లా సీపీఐఎంలో పని చేసి ఇప్పుడు పార్టీకి దూరంగా ఉన్న మాటూరి రామచందర్ రావు అన్నారు.

ఏదీ ఆ ప్రాభవం?

1999కి ముందు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు హేమాహేమీల్లాంటి నేతలుండేవారు.

సీపీఐ నుంచి మహ్మద్ రజబ్ అలీ, నల్లమల్ల గిరిప్రసాద్, పువ్వాడ నాగేశ్వరరావు వంటి నేతలు.. సీపీఎం నుంచి బోడేపూడి వెంకటేశ్వరరావు, మంచికంటి రామకిషన్ రావు, తమ్మినేని వీరభద్రం ప్రభావవంతమైన నేతలుండేవారు. వీరిలో పువ్వాడ, తమ్మినేనిలు ఇప్పుడూ క్రియాశీలంగానే ఉన్నారు.

న్యూడెమొక్రసీలో గుమ్మడి నర్సయ్య, దొరన్న, బాటన్న వంటి నేతలుండేరు.

మొదట్లో తెలంగాణ సాయుధ పోరాట యోధుల నాయకత్వంలో రెండు పార్టీలూ ఉండేవి. ఆయా నియోజకవర్గాల్లో వీరి ప్రభావం ఉండేది.

వ్యక్తిగతంగా, రాజకీయంగా విలువలు పాటించే నాయకత్వం, నిబద్ధత ఉన్న క్యాడర్ ఉంటూ ప్రజల పార్టీలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి.

ఇవన్నీ వామపక్ష పార్టీలు ప్రజల్లో పట్టు సాధించడానికి, నిర్మాణం బలంగా ఉండడానికి కారణమైంది.

రాష్ట్రమంతా ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించినప్పుడు కూడా వామపక్షాలు ఖమ్మంలో ఎదురొడ్డి నిలిచాయంటే కారణం అదే. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదని చెబుతున్నారు.

సిద్ధాంతాలతో సంబంధం లేకుండా పొత్తులు

"ఒకప్పుడు ఎన్నికల రాజకీయాలని తీవ్రంగా వ్యతిరేకించిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు అవే ఎన్నికల కోసం తమ సిద్ధాంతాలతో ఏమాత్రం సంబంధం లేని పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాయి. ఇలాంటి పొత్తుల ప్రభావం పార్టీలపై ఉంది" అని రాజకీయ పరిశీలకులు డా.బుగ్గవీటి నరసింహ అన్నారు.

రాబోయే తెలంగాణ శాసన సభ ఎన్నికలకు బహుజన లిబరల్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) కూటమితో సీపీఎం బరిలోకి దిగింది. అయితే సీపీఐ కాంగ్రెస్, టీడీపీల పొత్తుతో ప్రజాకూటమిగా బరిలో ఉంది.

"అసలు.. ఎవరికోసమైతే ఉద్యమాలు చేస్తున్నారో ఆ వర్గంలోకి వామపక్షాలు చొచ్చుకుపోలేకపోయాయి. వామపక్ష పార్టీలకు అండగా మధ్యతరగతి కుటుంబాలు నిలిచాయి. కానీ మధ్యతరగతి వారికి రాజకీయ శిక్షణ ఇవ్వలేదు. ఆలా రెండో తరం నాయకులు.. తర్వాతి తరం నాయకులను తయారు చేయడంలో విఫలం అయ్యారు" అని ఒక పాతతరం నేత అభిప్రాయపడ్డారు.

BBC

1994లో 7 సీట్లు.. 2014లో సింగిల్ సీటే..

వామపక్షాలకు తెలుగుదేశంతో పొత్తు ఏర్పడిన తరువాత ఎన్నికల్లో విజయాలు మరింత పెరిగాయి.

1994లో ఖమ్మం జిల్లాలోని 9 స్థానాల్లో ఏడు వామపక్షాలే గెలుచుకున్నాయి. ఆ ఎన్నికల్లో సీపీఐ 4 స్థానాలు, సీపీఎం 3 స్థానాలు గెలిచాయి. మిగతా రెండు సీట్లలో టీడీపీ విజయం సాధించింది.

1999లో వామపక్షాలు, టీడీపీ మధ్య పొత్తు ముగిసింది. అప్పటికే రాజకీయాల్లో ధన ప్రవాహం మొదలైంది. మరోవైపు మొదటి తరం నేతల స్థానంలో కొత్త తరం నేతలు రావడం.. ఏకతాటిపై నడిపించే స్థాయి నేతలు కరవవడంతో నెమ్మదిగా బలహీనపడడం మొదలైంది.

ఆ ఎన్నికల్లో సీపీఐ ఒక్క సీటూ గెలవలేకపోయింది. సీపీఎం భద్రాచలంలో మాత్రం గెలిచింది.

2004కి వచ్చేసరికి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాయి వామపక్షాలు. అంతకుముందు అయిదేళ్లు ప్రజా పోరాటాలు చేయడంతో మళ్లీ పుంజుకోగలిగారు. ఖమ్మం జిల్లాలో మొత్తం అయిదు సీట్లు వామపక్షాలు గెలుచుకోగలిగాయి. సీపీఐ ఒక సీటు, సీపీఎంకు మూడు స్థానాలు, న్యూడెమొక్రసీ ఒక స్థానం దక్కాయి.

నియోజకవర్గాల పునర్విభజన తరువాత..

నియోజకవర్గాల పునర్విభజన తరువాత వామపక్షాలు మరింత బలహీనపడ్డాయి. న్యూడెమొక్రసీ పూర్తిగా ప్రాబల్యం కోల్పోయింది.

2009లో సీపీఎం నాలుగు స్థానాల్లో పోటీ పడగా ఒకటి కూడా దక్కలేదు. రాజశేఖరరెడ్డి ప్రభావం.. సీనియర్ లీడర్లు వెళ్లిపోవడంతో ఆ పార్టీ నష్టపోయింది. సీపీఐ మాత్రం కొత్తగూడెం, వైరాల్లో గెలవగలిగింది.

2014లో సీపీఎం ఒక్క సీటు గెలుచుకుంది.

ప్రస్తుత ఎన్నికల్లో సీపీఐ వైరా నుంచి పోటీ చేస్తుండగా సీపీఎం మూడు స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. న్యూడెమొక్రసీ ఇల్లందు నుంచి పోటీ చేస్తున్నప్పటికీ అక్కడ ఆ పార్టీలోని రెండు వర్గాలు బరిలో ఉన్నాయి.

ప్రస్తుత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. 1999లోనూ ఎన్నికల్లో విఫలమైనప్పటికీ అప్పట్లో క్యాడర్ బలం కారణంగా తిరిగి పుంజుకొన్నాయి. ప్రస్తుతం నాయకులు, క్యాడర్ వేర్వేరు పార్టీల్లోకి మారడంతో వామపక్షాలు బలహీనమయ్యాయి.

'వామపక్షాలన్నీ కలిస్తేనే మళ్లీ పునర్వైభవం'

వామపక్ష రాజకీయాల ప్రభావం తగ్గుతోందా? అన్న ప్రశ్నకి చాలా మంది పార్టీ సభ్యుల నుంచి వినిపించేది ఒక్కటే.. 'వామపక్ష పార్టీలన్నీ కలిసివస్తేకానీ మనుగడ ఉండదు అన్న విషయం గుర్తించాలి' అని మాటూరి రామచందర్ రావు అన్నారు.

"దళిత బహుజనులను పైకి తేవాలని సీపీఎం బీఎల్ఎఫ్‌ను ఏర్పాటు చేసింది. ఇది ఎప్పుడో జరగాల్సింది. ఇప్పటికైనా జరిగింది. కానీ అన్ని వామపక్ష పార్టీలు కలిసి పరస్పరం సంప్రదింపులు జరిపి, దీన్ని మరింత బలోపేతం చేస్తే తెలంగాణలోనే ఒక పెద్ద అచీవ్‌మెంట్ అయ్యుండేది" అని మాటూరి అన్నారు.

'ఉద్యమాలు చేయాలంటే ఎర్ర జెండా కావాలి... కానీ ఎన్నికల్లో ఓట్లేయాల్సిన అవసరం లేదు' అనే నానుడి ఉందంటున్నారు కొందరు విమర్శకులు. మరి రాబోయే ఎన్నికల్లో వామపక్ష పార్టీలు తమ ఉనికి ఎలా చాటుకుంటాయన్నది వేచి చూడాల్సిందే.

BBC

ఏ నియోజకవర్గంలో ఎలా..

పినపాక/బూర్గంపాడు: నియోజకవర్గాల పునర్విభజనకు ముందున్న బూర్గంపాడులో 1962 నుంచి 2004 ఎన్నికల వరకు అయిదు సార్లు సీపీఐ నేతలు ప్రాతినిధ్యం వహించారు.

బూర్గంపాడు నుంచి గెలిచిన సీపీఐ నేతలు అనంతరం వివిధ పార్టీల్లోకి మారారు. రెండు సార్లు గెలిచిన కుంజా భిక్షం, ఒకసారి గెలిచిన ఊకే అబ్బయ్య అనంతర కాలంలో టీడీపీలో చేరగా... 2004లో సీపీఐ నుంచి గెలిచిన పాయం వెంకటేశ్వర్లు ఈ ఎన్నికల్లో పినపాక నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు.

ఇల్లందు: ఇక్కడ వామపక్షాలదే హవా. 1972కి ముందు జనరల్ నియోజకవర్గంగా ఉన్న ఇల్లందులో పీడీఎఫ్, సీపీఐ అభ్యర్థులు గెలిచారు. 1978 నుంచి ఈ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా మారింది.

అనంతరం సీపీఐ(ఎంఎల్) పార్టీకి చెందిన గుమ్మడి నర్సయ్య ఈ నియోజకవర్గం నుంచి అయిదుసార్లు గెలిచారు. 1994లో సీపీఐ నుంచి ఊకే అబ్బయ్య గెలిచారు. అనంతరం ఆయన 2009లో తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌పై గెలిచారు. 2014లో ఈ నియోజకవర్గం కాంగ్రెస్ చేతిలోకి వెళ్లింది. ఊకే అబ్బయ్య ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ప్రస్తుత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గుమ్మడి నర్సయ్య బీఎల్ఎఫ్ కూటమి తరఫున సీపీఐ(ఎంఎల్) అభ్యర్థిగానే బరిలోకి దిగుతున్నారు.

ఖమ్మం: ఈ నియోజకవర్గం కూడా కమ్యూనిస్టులకు కంచుకోటగా చెప్పాలి. 1952, 57లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న ఖమ్మంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగ్గా 11 సార్లు వామపక్షాల అభ్యర్థులే విజయం సాధించారు. సీపీఎం, సీపీఐ నాలుగేసి సార్లు.. పీడీఎఫ్ మూడుసార్లు గెలిచాయి. 2004లో చివరిసారి ఇక్కడ వామపక్షాలు గెలిచాయి.

పాలేరు: వామపక్ష అభ్యర్థులు మూడు సార్లే విజయం సాధించినప్పటికీ ఇది కూడా వారికి పట్టున్న నియోజకవర్గమే. ఇక్కడ సీపీఎం రెండు సార్లు, సీపీఐ ఒకసారి గెలిచాయి. 1994లో సీపీఎం నుంచి సండ్ర వెంకటవీరయ్య గెలిచిన తరువాత మళ్లీ వామపక్షాలు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించలేదు. సండ్ర వెంకట వీరయ్య కూడా అనంతర కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.

మధిర: నియోజకవర్గం సీపీఎంకు పట్టున్న స్థానం. ఇక్కడి నుంచి ఆ పార్టీ అయిదుసార్లు గెలిచింది. పీడీఎఫ్ అభ్యర్థి ఒకసారి గెలిచారు. 2009 నుంచి వామపక్షాలకు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం కరవైంది.

వైరా: ఇది నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఏర్పడింది. ఆ వెంటనే 2009లో సీపీఐ నుంచి బానోత్ చంద్రావతి ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2009కి ముందు సుజాతనగర్‌గా ఉన్న ఈ నియోజకవర్గంలో 1983 నుంచి 1994 వరకు సీపీఐ నేత మహ్మద్ రజబ్ అలీ వరుసగా నాలుగుసార్లు గెలిచారు.

సత్తుపల్లి: ఒక్కసారి కూడా వామపక్షాల ప్రాతినిధ్యం లేని నియోజకవర్గం ఇది. ఇక్కడ జరిగిన 10 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో అయిదేసి సార్లు గెలిచాయి.

కొత్తగూడెం: 2009లో కూనంనేని సాంబశివరావు ఇక్కడి నుంచి సీపీఐ తరఫున గెలిచారు. 1972కి ముందున్న పాల్వంచలోనూ సీపీఐ ఒకసారి గెలిచింది. పర్స సత్యనారాయణ 1962లో సీపీఐ నుంచి విజయం సాధించారు.

భద్రాచలం: ఒక ఉప ఎన్నిక సహా మొత్తం 15 సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగితే అందులో 8 సార్లు సీపీఎం అభ్యర్థులే గెలిచారు. రెండు సార్లు సీపీఐ నేతలు గెలిచారు. సీపీఎంకు అత్యంత పట్టున్న నియోజకవర్గాల్లో ఇదొకటి.

2014 ఎన్నికల్లో సున్నం రాజయ్య ఇక్కడి నుంచి సీపీఎం తరఫున ఎన్నికయ్యారు. అయితే, ఈ నియోజకవర్గంలోని పలు మండలాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కలవడంతో రాజయ్య ఈసారి ఇక్కడ బరిలో లేరు.

Next Story
Share it