Top
Sneha TV

'నేను తెలంగాణ ప్రజల పొత్తుల సద్దిని'

X

అందరూ పంచుకోవచ్చు.. సిరిసిల్ల సభలో కేసీఆర్‌

సిరిసిల్ల: తాను కలలు కన్న తెలంగాణ సాకారం కాబోతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ఎన్నికల వేళ సీఎం కేసీఆర్‌ సుడిగాలి పర్యటనలో భాగంగా ఈ రోజు ఆయన సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల సంయుక్త బహిరంగ సభలో మాట్లాడారు. ఉద్యమ సమయంలో సిరిసిల్ల వాసులు తన వెంటే ఉన్నారని, 2001లో మొట్టమొదటి సారిగా కరీంనగర్‌ జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగురవేశామని గుర్తు చేసుకున్నారు. కొత్త రాష్ట్రానికి ప్రారంభంలో అనేక సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు. అనేక బాలారిష్టాలను అధిగమించి రాష్ట్రం అభివృద్ధి పథంలో కొనసాగుతోందన్నారు. దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు రైతులను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఈ రోజు అన్నీ కల్తీమయంగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు. కారప్పొడి, పసుపు, నూనెలు, చివరకు పాలను కూడా కల్తీచేసే దుర్మార్గులు పుట్టుకొచ్చారని ఆందోళన వ్యక్తంచేశారు. వీరి పీచమణిచేందుకు ఐదారు వ్యవస్థలను సమీకృతం చేసే అద్భుతమైన పథకాన్నితీసుకొస్తామని భరోసా ఇచ్చారు. సిరిసిల్లలో అపెరల్‌ పార్కు రావాలన్నారు. ప్రతి చేనేత కార్మికుడి నెల జీతం రూ.25వేలు వచ్చేలా కృషి చేస్తామన్నారు.

రైతులకు గిట్టుబాటు ధరలు రావాలన్నారు. రైతులు పండించిన పంటలను ఏ ఊరికి ఆ ఊరులోనే అమ్మకాలు అయిపోవాలన్నారు. ఐకేపీ మహిళా గ్రూపులే ఆ ధాన్యం కొనుగోలు చేసేలా వ్యవస్థను తీసుకురాబోతున్నామన్నారు. ఎక్కడ ఏ పంట ఎక్కువ పండుతుందో దానికి సంబంధించి మహిళా సంఘాలతో ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నెలకొల్పుతామన్నారు. ఈ కేంద్రాలను ఐకేపీ మహిళలే నిర్వహిస్తారని చెప్పారు. క్రాంతి, విప్లవం ఆకాశం నుంచో, అమెరికా నుంచో రాదని, మన సమాజం నుంచి మనమే దాన్ని నేర్చుకోవాలన్నారు. ముంబైలోని ధారవిలో ఒక చైతన్యమంతురాలైన మహిళ లిజ్జత్‌ అప్పడాలను తయారు చేసి విజయవంతమయ్యారని చెప్పారు. దేశంలోనే ఆ కంపెనీ రూ.1176 కోట్ల టర్నోవర్‌ చేస్తోందన్నారు. కేసీఆర్‌ తమ పెద్దకొడుకు అని వృద్ధులు అంటున్నారని చెప్పారు. గతంలో బీడీ కార్మికుల కష్టాలను ఎవరూ పట్టించుకోలేదని, తామే వారిని ఆదుకున్నామని అన్నారు. రాష్ట్ర సంపదను పెంచి దాన్ని పేదలకు పంపిణీ చేస్తున్నామన్నారు.

తెలంగాణ రాకముందు పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఇసుకపై రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 9.5 కోట్లు అయితే, తమ నాలుగేళ్ల పాలనలో ఆ ఆదాయాన్ని రూ.2057 కోట్లకు పెంచామన్నారు. దాన్ని పెంచేందుకు తాము మాయలకు పాల్పడలేదని, విచ్చలవిడిగా స్మగ్లింగ్‌ను అరికట్టడం వల్లే దాన్నిసాధించామన్నారు. భవిష్యత్తులో ఇంకా ఈ ఆదాయాన్ని పెంచుతామన్నారు. ఈ డబ్బుతో ప్రజలకు మరిన్ని సంక్షేమ కార్యక్రామలను అమలు చేస్తామన్నారు.

కేసీఆర్‌ ఒక కులానికో, మతానికో చెందిన వ్యక్తి కాదని, తాను తెలంగాణ ప్రజల పొత్తుల సద్దిని అన్నారు. తనను అందరూ తినొచ్చని చెప్పారు. తనకు శత్రువులెవరూ లేరని చెప్పారు. సిరిసిల్లలో భవిష్యత్తులో చేనేత కార్మికుల ఆత్మహత్యలు పునరావృతం కావొద్దని సూచించారు. మళ్లీ అధికారంలోకి వస్తే వేములవాడ రాజన్న ఆలయాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ సీఎం కాకపోతే రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ జన్మలో అయ్యేది కాదన్నారు. పచ్చని పొలాలతో తెలంగాణ కళకళలాడితే అంతకన్నా గొప్ప కోరిక తనకేమీ లేదన్నారు. సిరిసిల్లలో కేటీఆర్‌, వేములవాడలో రమేశ్‌బాబును గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story
Share it